కోవిడ్-19 టీకా వేయించుకున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

సోమవారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో మొదటి డోసు టీకా వేయించుకున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.

"కోవిడ్-19పై పోరులో మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా గొప్పది" అని ఆయన అన్నారు.

అర్హులందరూ ఈ వ్యాక్సీన్ వేయించుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. "అందరం కలిసికట్టుగా భారతదేశాన్ని కోవిడ్-19 రహిత దేశంగా చేద్దాం!" అన్నారు.

దేశ వ్యాప్తంగా రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇవాళ (మార్చి 1) ప్రారంభమైంది. 60 ఏళ్లకు పైబడిన వారితో పాటు, 45 ఏళ్లకు పైగా వయసు ఉండి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి టీకా ఇస్తున్నారు.

మొదటి దశలో, ప్రభుత్వ కేంద్రాలలో మాత్రమే వ్యాక్సీన్ ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఎంపిక చేసిన ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ టీకా అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా టీకా వేయించుకోవచ్చు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే ప్రజలు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.

టీకా కోసం www.cowin.gov.in వెబ్‌సైట్‌లో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

మొత్తం 10,000 ప్రభుత్వ ఆస్పత్రుల్లో, 20 వేల ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ టీకాను అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒక డోసుకు 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోలేని వారు నేరుగా టీకా కేంద్రానికి వెళ్ళవచ్చు. ఓటరు ఐడి కార్డు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు పత్రాన్ని తీసుకెళ్లాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)