You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బిహార్: గంగా నదిలో పడవ ప్రమాదం.. ఒకరి మృతి, అనేక మంది గల్లంతు.. ప్రమాద సమయంలో పడవలో 50 మంది - BBC Newsreel
బిహార్‌లోని భగల్‌పూర్‌లోని నవ్‌గఛియా ప్రాంతంలో గంగా నదిలో పడవ మునిగిపోవడంతో ఒకరు మరణించారు.
అయితే, గురువారం ఉదయం ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 50 మంది ఉన్నట్లు భగల్‌పూర్ కలెక్టర్ బీబీసీ ప్రతినిధి నీరజ్ ప్రియదర్శికి తెలిపారు.
ఇప్పటివరకు 30 మందిని రక్షించినట్లు ఆయన చెప్పారు. ఒక మృతదేహం లభించింది.
మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
వస్త్ర పరిశ్రమలో భారీ పేలుడు.. 12 మంది మృతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 12కు పెరిగింది. మరో తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
పిరాలా-పీప్లాజ్ రోడ్డుకు అనుకుని ఉన్న పరిశ్రమలో బుధవారం ఉదయం ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
''ఒక బాయిలర్‌లో విస్ఫోటం సంభవించడంతో ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీకి చెందిన మూడు షెడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి''అని అడిషనల్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాజీవ్ భట్.. బీబీసీ గుజరాతీకి తెలిపారు.
ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. బాయిలర్‌లో ఒత్తిడి పెరగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.
ఘటనపై కేంద్ర హోం మంత్రి విచారం వ్యక్తంచేశారు.
మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ నాలుగు లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రకటించారు.
బాయిలర్ల పేలుడుకు కారణాలపై విశ్రాంత డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ పీసీ పర్మార్ బీబీసీతో మాట్లాడారు.
''గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమలు ప్రస్తుతం ఎలాంటి నిబంధనలూ అనుసరించడం లేదు. బాయిలర్స్ ఉండే పరిశ్రమలు ఆరు నెలలకు ఒకసారి లైసెన్సులను పునరుద్ధరించుకోవాలి. కానీ ఎవరూ అలా చేయడం లేదు. వాడేకొద్దీ బాయిలర్‌లో లోహం దెబ్బతింటుంది. పెరిగే ఒత్తిడికి అది తట్టుకోలేదు. చాలా మంది బాయిలర్లలో విస్ఫోటం చెందే అవకాశమున్న పదార్థాలు ఉపయోగిస్తున్నారు. దీంతో విస్ఫోటాలు జరిగి పేద కార్మికులు బలవుతున్నారు''అని పర్మార్ వ్యాఖ్యానించారు.
''ఇది చాలా తీవ్రమైన అంశం. మేం విచారణ చేపడుతున్నాం. బాయిలర్‌లో ఉపయోగించిన రసాయనాలు నిషేధ రసాయనాల జాబితాలో ఉన్నాయేమో పరిశీలిస్తున్నాం. ఫ్యాక్టరీ ఓనర్‌పై ఇప్పటికే కేసు నమోదుచేశాం. బాయిలర్లు నడపడానికి అనుమతులు ఉన్నాయో లేదో కూడా విచారణ చేపడుతున్నాం''అని ఏసీపీ మిలాప్ పటేల్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయం కోరారు’
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
- జార్జ్ ఫ్లాయిడ్: పోలీసు కాల్పుల్లో చనిపోయేదీ, కేసుల్లో అరెస్టయేదీ, జైళ్లలో మగ్గుతున్నదీ అత్యధికంగా నల్లజాతి వారే... ఎందుకు?
- కెప్టెన్గా ధోనీ తీసుకున్న 10 అసాధారణ నిర్ణయాలు
- అఫ్గానిస్తాన్: తాలిబాన్లు ఎవరు... ఇన్నేళ్ళుగా వారితో యుద్ధం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)