రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్.. ఏమిటి? ఎందుకు?

వీడియో క్యాప్షన్, రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్.. ఏమిటి? ఎందుకు?

బ్లూ ఫ్లాగ్...తీర ప్రాంత పర్యాటక స్థలాలకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్టిఫికేట్. పర్యాటకుల భద్రత, కాలుష్య రహిత పరిసరాలు, సీ వాటర్ క్వాలిటీ లాంటి వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు. తాజాగా విశాఖ రుషికొండ బీచ్‌కు కూడా ఈ సర్టిఫికేట్ వచ్చింది.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అందుకున్న బీచ్‌లంటే సురక్షితమైనవి అని అర్థం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, తీర ప్రాంతంలో ఎలాంటి జల కాలుష్యం లేకపోవడం, పర్యావరణ అనుకూలంగా ఉండటం వంటి 33 అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన బీచ్ లకు ఈ అంశాలను పరిశీలించి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అందిస్తారు. డెన్మార్క్‌లోని పర్యావరణ అధ్యయన సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను అందజేస్తుంది.

తీరంలో ప్రమాదకర జీవులుంటే..?

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ వచ్చిన బీచ్ లో నీలం రంగులో ఉండే జెండాలను ఎగుర వేస్తారు. అంటే ఈ బీచ్ అత్యంత పరిశుభ్రతమైన, సురక్షితమైనదని అర్థం. వివిధ దేశాల బీచ్‌లను సందర్శించే వారు ఈ జెండాల ఆధారంగానే వాటి మీద ఒక అవగాహనకు వస్తారు.

దేశంలో తొలి బ్లూ ఫ్లాగ్ ఎగిరింది ఇక్కడే...

1985లో డెన్మార్క్ లో ప్రారంభించిన 'ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్' ఏజెన్సీ 1987 నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ ని ఇస్తోంది. ప్రపంచంలో తొలిసారి ఈ సర్టిఫికేట్ పొందిన దేశం స్పెయిన్. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అందిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పెయిన్ దేశానికి చెందిన బీచ్లే ఎక్కువ సంఖ్యలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ ని సొంతంచేసుకున్నాయి. స్పెయిన్ లో ఇప్పటి వరకు మొత్తం 566 బీచ్‌లు ఈ సర్టిఫికేట్ పొందగా, గ్రీస్ 515, ఫ్రాన్స్ 395 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్స్ పొందాయి. ఇక భారతదేశంలో, అలాగే ఆసియా ఖండంలో ఈ సర్టిఫికేట్ పొందిన తొలి బీచ్ ఒడిశాలోని కోణార్క్ తీరంలోని 'చంద్రబాగ్' బీచ్. ఇది 2018 లో ఈ సర్టిఫికేట్ పొందింది. ఆ తర్వాత ఇండియాలో మరో 12 తీర ప్రాంతాలను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ పొందే స్థాయిలో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పనిని పర్యావరణశాఖ ఆధ్వర్యంలో పని చేసే సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్ కి అప్పగించింది.

బ్లూ ఫ్లాగ్ ఉంటే...

ఈ సర్టిఫికేట్ బరిలో నిలిచేందుకు సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు కొన్ని బీచ్ లను ఎంపిక చేసి కేంద్రానికి సిఫార్సు చేస్తారు. మన దేశం నుంచి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కోసం ఎనిమిది బీచ్‌లను కేంద్రంలో కొద్ది రోజుల క్రితం నామినేట్ చేసింది. సాధారణంగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉన్న తీర ప్రాంతాల్లో పర్యటించడానికి విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపుతారు. అంతేకాదు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉంటే అది ఎంతో సురక్షితమైన బీచ్ గా భావిస్తారు. బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ పొంది టూరిస్టులను, ప్రధానంగా విదేశి టూరిస్టులను ఆకర్షించాలని పర్యాటక శాఖ భావిస్తుంటుంది. తాజాగా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ తో పాటు గుజరాత్‌లోని శివరాజ్ పూర్, డయ్యూలోని ఘోఘ్లా, కర్ణాటక నుంచి కసర్‌కోడ్, పడుబిద్రి బీచ్‌లు, కేరళలోని కప్పడ్, ఒడిశా నుంచి పూరి గోల్డెన్ బీచ్, అండమాన్ నికోబార్ దీవుల నుంచి రాధానగర్ బీచ్‌లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌కు ఎంపికయ్యాయని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం వెల్లడించారు.

విశాఖ పర్యాటకం పరుగు తీస్తుందా?

బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ కోసం విశాఖలోని రుషికొండ బీచ్‌ ఎంపికయ్యిందనే విషయంపై ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు. "రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఎంపికవ్వడం ఆనందంగా ఉంది. ఇది విశాఖ పర్యాటకానికి ఎంతో ఊతమిస్తుంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఉన్న తీర ప్రాంతాలను విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. తద్వారా ప్రపంచ దేశాలకు మన పర్యాటకరంగం కోసం తెలుస్తుంది. ఈ బీచ్ ల అభివృద్ధికి కేంద్ర ఆర్థిక సహాయం లభిస్తుంది" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)