You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాల్ బహదూర్ శాస్త్రి: ఆయన ఒక్క పిలుపుతో లక్షలాది భారతీయులు ఒక పూట భోజనం మానేశారు
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇది 1965 సెప్టెంబర్ 26న జరిగింది. భారత-పాకిస్తాన్ యుద్ధం ముగిసి అప్పటికి నాలుగు రోజులే అయ్యింది. ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి దిల్లీ రాంలీలా మైదాన్‌లో వేలాదిగా గుమిగూడిన జనం ఎదుట ఉత్సాహంగా ప్రసంగిస్తున్నారు.
కరతాళ ధ్వనుల మధ్య శాస్త్రి “గౌరవ అయూబ్ దిల్లీ వరకూ కాలినడకనే చేరుకుంటానని చెప్పారు. ఆయన పెద్ద మనిషి. మంచి ఒడ్డూపొడుగూ ఉంటారు. దిల్లీ వరకూ నడిచొచ్చేలా ఆయనకు కష్టం ఎందుకు ఇవ్వాలని నేను అనుకున్నాను. మనమే లాహోర్ వైపు ముందుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలకాలనుకున్నా” అన్నారు.
ఇదే శాస్త్రీజీ ఐదడుగుల రెండు అంగుళాలు ఎత్తు, గొంతు గురించి ఏడాది క్రితం పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ ఎగతాళిగా మాట్లాడారు.
అయూబ్ ఖాన్ బయటకు కనిపించే వారి స్వరూపాన్ని బట్టి వ్యక్తులను అంచనా వేసేవారు.
పాకిస్తాన్‌లో భారత మాజీ హైకమిషనర్‌గా పనిచేసిన శంకర్ బాజ్‌పేయి( ఇటీవల చనిపోయారు) నాతో “అయూబ్ భారత్ బలహీనంగా ఉందని అనుకోవడం ప్రారంభించారు. ఆయన నెహ్రూ చనిపోయాక దిల్లీ వెళ్లాలనుకున్నారు. ఇప్పుడు, అక్కడికి వెళ్లి నేను ఎవరితో మాట్లాడాలి అని ఆయన తన దిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు. శాస్త్రి.. మీరు రాకండి, మేమే వస్తాం” అన్నారు.
“శాస్త్రీజీ అలీన సమావేశంలో పాల్గొనడానికి కైరో వెళ్లి, తిరిగి వస్తున్నప్పుడు ఆయన కొన్ని గంటలు కరాచీలో ఆగారు. అక్కడ నేను ప్రత్యక్షసాక్షిని, శాస్త్రీజీ వెళ్తుంటే, విమానాశ్రయానికి వచ్చిన అయూబ్ తన సహచరులకు సైగ చేస్తూ ‘ఈయనతో మాట్లాడ్డం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అన్నారు”.
అమెరికా అధ్యక్షుడి ఆహ్వానం తిరస్కరించారు
శాస్త్రీజీ కైరో వెళ్లడానికి ముందు ఆయన్ను కలిసిన అమెరికా రాయబారి చెస్టర్ బోల్స్ అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ నుంచి తమ దేశానికి రావాలని ఆహ్వానం వచ్చిందని చెప్పారు. కానీ, శాస్త్రి దానిపై ఒక నిర్ణయం తీసుకోకముందే జాన్సన్ ఆ ఆహ్వానాన్ని వెనక్కు తీసుకున్నారు.
దీనికి కారణం అమెరికాపై ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ ఒత్తిడి. తాము భారత్‌తో కొత్త సమీకరణలు ఏర్పరుచుకోడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అమెరికా ఆ పిక్చర్‌లోకి రాకూడదని ఆయన భావించారు.
ఈ అవమానానికి జాన్సన్‌ను తర్వాత శాస్త్రీజీ ఎప్పటికీ క్షమించలేదని సీనియర్ జర్నలిస్ట్ కులదీప్ నయ్యర్ చెప్పారు. కొన్ని నెలల తర్వాత ఆయన కెనెడా వెళ్తున్నప్పుడు, జాన్సన్.. ‘మీరు మధ్యలో వాషింగ్టన్‌లో ఆగాలి’ అని శాస్త్రిని ఆహ్వానించారు. కానీ ఆయన దానిని తిరస్కరించారని తెలిపారు.
ఒక్క పిలుపుతో ఒక పూట భోజనం మానేశారు
“!1965 యుద్ధం జరిగినపుడు అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ ‘మీరు పాకిస్తాన్‌తో యుద్ధం ఆపకపోతే మేం మీకు పీఎల్ 480 కింద పంపించే ఎర్ర గోధుమలు ఆపేస్తామని బెదిరించార”ని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి అప్పటి విషయాలను గుర్తు చేశారు.
”ఆ సమయంలో భారత్ గోధుమల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేదు. అమెరికా అలా అనడంతో శాస్త్రీజీ బాధపడ్డారు. ఎందుకంటే, ఆయన చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. ఆయన దేశ ప్రజలతో మనం వారంలో ఒక పూట భోజనం చేయడం మానేద్దాం. దానివల్ల అమెరికా నుంచి వచ్చే గోధుమలు సరఫరా తగ్గించవచ్చు’’ అన్నారు.
“కానీ, నాన్నగారు ఆ అపీల్ చేసే ముందు మా అమ్మ లలితా శాస్త్రితో ‘మీరు ఈరోజు రాత్రి మన ఇంట్లో వంట చేయకండి. నేను రేపు దేశ ప్రజలను కూడా ఒక పూట భోజనం ఆపేయాలని కోరబోతున్నాను” అని అన్నారని అనిల్ శాస్త్రి చెప్పారు.
“నా పిల్లలు ఆకలితో ఉండగలరా, లేదా అనేది నేను చూడాలనుకుంటున్నాను అన్నారు. మేం ఒక పూట భోజనం చేయకుండా ఉండగలమనేది చూసినప్పుడు, ఆయన దేశ ప్రజలను కూడా అలాగే చేయాలని కోరాలని అనుకున్నార”ని తెలిపారు .
వార్తా పత్రికలకు వ్యాసాలు రాస్తేనే ఇల్లు నడిచేది
కామరాజ్ ప్లాన్ కింద 1963లో శాస్త్రీజీ నెహ్రూ మంత్రిమండలికి రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన భారత హోంమంత్రిగా ఉన్నారు.
కులదీప్ నయ్యర్ కూడా ఆ రోజు గురించి చెప్పారు. “ఆరోజు సాయంత్రం నేను శాస్త్రి ఇంటికి వెళ్లాను. డ్రాయింగ్ రూం మినహా మిగతా ఇల్లంతా చీకటిగా ఉంది. శాస్త్రి ఒక్కరే కూర్చుని వార్తా పత్రిక చదువుతున్నారు. నేను ఆయన్ను బయట లైట్లేవీ వెలగడం లేదేంటి అని అడిగాను”.
దాంతో ఆయన ‘ఇక నుంచి కరెంట్ బిల్లుకు నేను నా జేబు నుంచే చెల్లించాలి. అందుకే నేను అన్ని లైట్లు వెలగడం భరించలేను’ అన్నారు.
శాస్త్రికి ఎంపీగా నెలకు 500 రూపాయల జీతం వచ్చేది. దానితో కుటుంబం ఖర్చులు చూసుకోవడం ఆయనకు కష్టంగా మారింది.
నయ్యర్ తన ఆత్మకథలో “నేను శాస్త్రీజీని వార్తా పత్రికలకు రాయడానికి ఒప్పించాను. ఆయన కోసం ఒక సిండికేట్ సేవలు ప్రారంభించాను. దాంతో ఆయన వ్యాసాలను ద హిందూ, అమృత్ బజార్ పత్రిక, హిందుస్తాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించేవారు. పత్రికలు ఒక ఆర్టికల్‌కు ఆయనకు 500 రూపాయలు ఇచ్చేవి”.
“అలా, ఆయన అదనంగా 2 వేల రూపాయల వరకూ సంపాదించేవారు. ఆయన మొదటి ఆర్టికల్ జవహర్ లాల్ నెహ్రూపై, రెండోది లాలా లజపత్ రాయ్ గురించి రాయడం నాకు గుర్తుంది” అని కులదీప్ నయ్యర్ చెప్పారు.
జూనియర్ అధికారులకు టీ అందించిన శాస్త్రి
శాస్త్రితో కలిసి పనిచేసిన అధికారులు అందరూ ఆయన ప్రవర్తన చాలా మర్యాదపూర్వకంగా ఉండేదని చెబుతారు.
ఆయన వ్యక్తిగత కార్యదర్శి సీపీ శ్రీవాస్తవ్ ‘లాల్ బహదూర్ శాస్త్రి ఎ లైఫ్ ఆఫ్ ట్రూత్ ఇన్ పాలిటిక్స్’లో శాస్త్రికి స్వయంగా తన చేత్తో టీపాట్ నుంచి కప్పులోకి టీ వంచే అలవాటు ఉండేది. ‘ఇది నా గది కాబట్టి కప్పులో టీ పోసే అధికారం కూడా నాదే’ అని ఆయన చెప్పేవార’ని రాశారు.
“అప్పుడప్పడూ ఆయన మాట్లాడుతూ తన కుర్చీలోంచి లేచి నిలబడేవారు. గదిలో అటూ ఇటూ నడుస్తూ మాతో మాట్లాడేవారు. అప్పుడప్పడూ గదిలో వెలుతురు పెద్దగా అవసరం లేకపోతే, ఆయనే స్వయంగా వెళ్లి లైట్ స్విచ్ ఆప్ చేసేవారు. ప్రజా ధనాన్ని వృథా చేయడం ఆయనకు ఏమాత్రం నచ్చేది కాదు” అంటారు శ్రీవాస్తవ్.
శాస్త్రిని ‘సూపర్ కమ్యూనిస్ట్’గా వర్ణించిన రష్యా ప్రధాని
లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ సదస్సులో పాల్గొనడానికి రష్యా వెళ్లినపుడు కూడా తన చేనేత ఉన్ని కోటు వేసుకుని వెళ్లారు.
రష్యా ప్రధాని ఎలెక్సీ కోసిగిన్ వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి ఈ కోటు తాష్కెంట్ చలిని తట్టుకోలేదని చెప్పారు. తర్వాత రోజు ఆయన శాస్త్రి తాష్కెంట్ చలిలో వేసుకుంటారని భావించి ఒక ఓవర్ కోట్ పంపించారు.
“తర్వాత రోజు కోసిగిన్ శాస్త్రీజీ అదే పాత ఖాదీ కోటులో ఉండడం చూశారు. ఆయన ‘మీకు ఆ కోట్ నచ్చలేదా’ అని అడిగారు. దానికి శాస్త్రి ‘ఆ కోటు నిజంగానే చాలా వెచ్చగా ఉంది. కానీ నేను దానిని మా బృందంలోని ఒక సభ్యుడు వేసుకోడానికి ఇచ్చేశాను. ఎందుకంటే, ఆయన ఈ వాతావరణంలో వేసుకోడానికి తనతో కోటు తెచ్చుకోలేదు అన్నార”ని అనిల్ శాస్త్రి చెప్పారు.
భారత ప్రధానమంత్రి, పాకిస్తాన్ అధ్యక్షుడిని సన్మానించడానికి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో కోసిగిన్ ఈ ఘటన గురించి ప్రస్తావించారు. “మనం కమ్యూనిస్టులమే,. కానీ ప్రధాన మంత్రి శాస్త్రి ‘సూపర్ కమ్యూనిస్ట్’ అన్నారు.
ప్రభుత్వ కారుకు అద్దె చెల్లించారు
లాల్ బహదూర్ శాస్త్రి మరో తనయుడు సునీల్ శాస్త్రి కూడా తనకు తెలిసిన ఒక ఘటన గురించి చెప్పారు.
“శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పడు ఆయన ఉపయోగించడానికి ప్రభుత్వం ఒక షెవ్రొలె ఇంపాలా కార్ ఇచ్చింది. ఒకరోజు నేను నాన్నగారి సెక్రటరీతో మీరు డ్రైవర్‌ను ఇంపాలా కారుతో ఇంటికి పంపించమన్నాను. తర్వాత డ్రైవర్ దగ్గర కారు తాళాలు తీసుని, నా స్నేహితులతో డ్రైవ్‌కు వెళ్లిపోయాను. అర్థరాత్రి మేం తిరిగి ఇంటికి వచ్చాక, కారు గేటు దగ్గరే వదిలేశాం. వెనుక కిచెన్ దారి నుంచి ఇంట్లోకి వెళ్లాను. నా గదిలో నిద్రపోయాను. తర్వాత రోజు ఉదయం ఆరున్నరకు ఎవరో నా గది తలుపును కొట్టారు. నేను ఎవరో నౌకర్ అనుకుని ‘రాత్రి బాగా ఆలస్యం అయ్యింది, నన్ను విసిగించకండి’ అని గట్టిగా చెప్పాను. తలుపుపై మళ్లీ కొట్టారు. వెళ్లి చూస్తే.. బయట నాన్నగారు. ఆయన నన్ను టేబుల్ దగ్గరకు రమ్మన్నారు. అక్కడ అందరూ టీ తాగుతున్నారు. అమ్మ రాత్రి ఎక్కడికెళ్లావ్, అంత రాత్రి వేళ ఎందుకొచ్చావ్ అన్నారు. నాన్న నువ్వు ఎలా వెళ్లావ్. నేను తిరిగొచ్చినపుడు మన ఫియట్ కారు చెట్టు కిందే కనిపించిందే” అన్నారు.
“ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన ఇంపాలా కారులో తిరగడానికి వెళ్లామని నేను నిజం చెప్పాల్సి వచ్చంది. నాన్నగారు ఆ కారును ఎవరైనా విదేశీ అతిథులు దిల్లీ వచ్చినపుడు మాత్రమే ఉపయోగించేవారు. తర్వాత ఆయన కారు డ్రైవర్‌ను పిలవమన్నారు. ఆయనతో మీరు మీ కార్‌లో ఏదైనా లాగ్ బుక్ పెట్టండి అన్నారు. ఆయన సరే అనడంతో నిన్న ఇంపాలా కారు మొత్తం ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అని అడిగారు.
డ్రైవర్ 14 కిలోమీటర్లు అన్నారు. దాంతో నాన్నగారు దానిని వ్యక్తిగత వినియోగం కింద రాయాలని చెప్పారు. అమ్మతో 14 కిలోమీటర్లకు ఎంత అవుతుందో లెక్కవేసి ఆ మొత్తం తన కార్యదర్శికి ఇవ్వాలని, ఆయన దానిని ప్రభుత్వ అకౌంటులో జమ చేస్తారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ నేను, నా సోదరులు ఎప్పడూ వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించలేద”ని సునీల్ శాస్త్రి చప్పారు.
ప్రజల కోసం బస్ స్టాప్‌కు వెళ్లిన ప్రధాని
ఒకసారి ప్రధానమంత్రి శాస్త్రీజీ బిహార్ నుంచి వచ్చే కొందరికి ఇంట్లో కలవడానికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
అదే రోజు అనుకోకుండా ఒక విదేశీ అతిథిని సత్కరించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెళ్లారు. దానికి శాస్త్రీజీ వెళ్లడం చాలా ముఖ్యం.
అక్కడ నుంచి తిరిగొచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. శాస్త్రీజీని కలవడానికి బిహార్ నుంచి వచ్చిన వారు నిరాశగా తిరుగుముఖం పట్టారు. అనిల్ శాస్త్రి ఆ రోజు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నారు. “వాళ్లు చాలా సేపు వేచిచూసి, అప్పుడే వెళ్లారని శాస్త్రీజీకి తెలిసింది. దాంతో ఆయన తన కార్యదర్శిని వాళ్లెక్కడికి వెళ్లుంటారో మీకేమైనా తెలుసా అన్నారు. ఆయన వాళ్లు ప్రధాన మంత్రి నివాసం బయట బస్ స్టాప్ నుంచి ఎక్కడికో వెళ్లాలనుకున్నారని చెప్పారు”.
“శాస్త్రీజీ వెంటనే ఇంటి నుంచి బయట బస్టాప్ దగ్గరకు వెళ్లారు. కార్యదర్శి ఇది ప్రజలకు తెలిస్తే ఏమనుకుంటారు అన్నారు. కానీ, శాస్త్రి ఆయనతో నేను ఆహ్వానించిన వారిని కలవలేదని జనానికి తెలిస్తే అప్పుడు ఏమనుకుంటారు.. అని ఆయన్ను ఎదురు ప్రశ్నించారు.
“కార్యదర్శి నేనెళ్లి వారిని తీసుకొస్తానని చెప్పినా శాస్త్రీజీ వినలేదు. స్వయంగా వెళ్లి వాళ్లను తీసుకొస్తా, ఈ పొరపాటుకు క్షమాపణ అడుగుతానని అన్నారు. ఆయన బస్టాప్‌కు వెళ్లి ఇంకా అక్కడే ఉన్న వారిని క్షమాపణలు అడిగారు, తర్వాత తనతో పాటూ ఇంట్లోకి తీసుకొచ్చారు”.
శాస్త్రీజీ శవపేటిక మోసిన పాక్ అధ్యక్షుడు, సోవియట్ ప్రధాని
1966లో లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్‌లో మృతిచెందినప్పుడు, ఆయన ఉన్న డాచా(ఇంటికి ) మొట్టమొదట చేరుకున్న వ్యక్తి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్.
ఆయన శాస్త్రి పార్థివ దేహాన్ని చూస్తూ ‘హియర్ లైస్ ఎ పర్సన్ హూ కుడ్ హావ్ బ్రాట్ ఇండియా అండ్ పాకిస్తాన్ టుగెదర్(ఇక్కడ పడుకున్న ఈయన భారత్, పాకిస్తాన్‌ను దగ్గర చేసుండేవారు) అన్నారు. శాస్త్రీజీ మృతదేహాన్ని తాష్కెంట్ నుంచి దిల్లీ తీసుకురావడానికి విమానాశ్రయానికి తీసుకెళ్తున్నప్పుడు దారి పొడవునా సోవియట్, భారత, పాకిస్తాన్ జెండాలన్నీ అవనతం చేశారు.
శాస్త్రీజీ శవపేటికను వాహనం నుంచి దించి విమానంలో ఎక్కిస్తున్నప్పుడు దానిని మోసిన వారిలో సోవియట్ ప్రధాని కోసిగిన్‌తో పాటూ కొన్ని రోజుల క్రితమే ఆయన్ను పొట్టివాడని ఎగతాళి చేసిన పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ కూడా ఉన్నారు.
శాస్త్రి జీవితచరిత్ర రాసిన సీపీ శ్రీవాస్తవ్ “ఒక్క రోజు ముందు వరకూ బద్ధ శత్రువులుగా ఉన్న ఇద్దరు ప్రత్యర్థులు స్నేహితులు అవడమే కాదు, ఒకరి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ వారి శవపేటికను కూడా మోయడమనే ఇలాంటి ఉదాహరణలు మానవ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తాయి” అన్నారు.
శాస్త్రీజీ చనిపోయే సమయానికి ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉంది. ఆయన తన వారి కోసం డబ్బు, ఇళ్లు, భూములు ఏవీ వదిలి వెళ్లలేదు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)