You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి స్ఫూర్తి ఎవరు? - అభిప్రాయం
- రచయిత, అవధానం రఘు కుమూర్
- హోదా, న్యాయవాది, బీబీసీ కోసం
గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లిన కొత్తలో మైఖేల్ కోట్స్ అనే ఒక ఆధ్యాత్మికవాది కలిశారు. ఆయన గాంధీజీని ప్రభావితం చేయడానికి, క్రైస్తవంలోకి మార్చడానికి చాలా ప్రయత్నం చేశారు.
ఆ ప్రయత్నంలో భాగంగా టాల్‌స్టాయ్ రాసిన "ది కింగ్‌డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యు" అనే పుస్తకం పరిచయం చేశారు. అది గాంధీజీ ఆలోచనలని తీవ్రంగా ప్రభావితం చేయడమే కాక ఆయనలో శాంతియుత నిరసన (పాసివ్ రెసిస్టెన్స్) అనే విధానానికి అంకురార్పణ చేసింది. అయితే ఈ శాంతియుత నిరసనను గాంధీజీ పూర్తిగా అంగీకరించలేదు. తరువాత కాలంలో గాంధీ టాల్‌స్టాయ్ రచనలను సంపూర్ణంగా చదివారు.
విదేశీ నాగరికత, ముఖ్యంగా పారిశ్రామిక నాగరికతపై, గాంధీజీలో వ్యతిరేక భావనలు పెరగడానికి మాత్రం టాల్‌స్టాయ్ రచనలే ప్రధాన కారణం. అయితే టాల్‌స్టాయ్, థోర్‌ల నుంచి గాంధీజీ ఒక ప్రాథమిక ఆదర్శ లోకపు భావనలకు రూపమిచ్చినా ఆయన భారతీయ తత్వచింతనలోని ఆదర్శ రాజ్యం కూడా ఆయన ఆలోచనలలో బలంగా ఉంది.
దక్షిణాఫ్రికాలో ఉద్యమం ఒక స్థాయిలో ఉన్నపుడు, ఆ ఉద్యమం సరైన ఫలితాలనివ్వక నిరుత్సాహంలో ఉన్నపుడు, 1909 అక్టోబర్ 1న టాల్‌స్టాయ్ సలహాలు కోరుతూ గాంధీజీ ఆయనకు తొలి ఉత్తరం రాశారు. ఆ ఉత్తరం వారం రోజుల తర్వాత టాల్‌స్టాయ్‌కి అందింది.
దీని గురించి టాల్‌స్టాయ్ తన డైరీలో... "ట్రాన్స్‌వాల్ నుంచి ఓ హిందూ రాసిన ఆహ్లాదకరమైన ఉత్తరం" అని రాశారు.
టాల్‌స్టాయ్ సమాధానం రాకముందే, అంతకుముందు తారకౌత్తదాస్ అనే ఇంకో భారతీయుడికి టాల్‌స్టాయ్ రాసిన ఉత్తరం (లెటర్ టు ఏ హిందూ) ఆధారంగా గాంధీ 'ఈస్ట్ అండ్ వెస్ట్' అనే అంశంపై ఒక సభలో మాట్లాడాల్సి వస్తుంది.
మొదటిసారిగా గాంధీ భారతీయులపై ఆంగ్లేయుల పాలనపై తీవ్రంగా మాట్లాడింది ఇక్కడే. అది టాల్‌స్టాయ్ ప్రభావం వల్ల.
భారతీయుల ప్రస్తుత పరిస్థితికి భారతీయులే కారణం, వారు బానిసత్వాన్ని అంగీకరించారు అని 'లెటర్ టు హిందూ'లో టాల్‌స్టాయ్ అన్నారు. ఆంగ్లేయుల పాలనకు సహకరించడం మానేయాలని సలహా ఇచ్చారు టాల్‌స్టాయ్. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి మూలాలు ఈ టాల్‌స్టాయ్ ఉత్తరంలో ఉన్నాయి. గాంధీజీ 'హిందూ స్వరాజ్'కి కూడా ఇదే ప్రేరణ.
గాంధీ తన ఉపన్యాసం, ఆ తరువాత చర్చల సారాంశాన్ని 'కన్ఫెషన్స్ ఆఫ్ ఫెయిత్' అనే కరపత్రంగా 1909లో తన స్నేహితులకు పంచిపెట్టారు. 1909 నవంబర్ 10న టాల్‌స్టాయ్‌కి గాంధీ రెండో ఉత్తరం రాశారు. ఈ ఉత్తరంతో పాటు అప్పటికే జోసెఫ్ డోక్ అనే క్రైస్తవ మతగురువు గాంధీపై రాసిన గాంధీ తొలి జీవిత చరిత్రను (ఎం.కె.గాంధీ: యాన్ ఇండియన్ పేట్రియాట్ ఇన్ సౌత్ ఆఫ్రికా) కూడా టాల్‌స్టాయ్‌కి పంపించారు.
అయితే, టాల్‌స్టాయ్ అనారోగ్యం వల్ల ఈ ఉత్తరం, గాంధీ జీవిత చరిత్ర త్వరగా చదవలేకపోయారు. ఆయన కొంతకాలం తర్వాత ఇవి చదివి ఆనందించారని ఆయన డైరీల ఆధారంగా తెలుస్తోంది. టాల్‌స్టాయ్ 1910 నవంబర్ 20న మరణించారు.
అహింసా యుత పోరాటం అనేది ప్రాథమికంగా టాల్‌స్టాయ్ ప్రతిపాదించిన సిద్దాంతమే. అయితే 1906-07లలో సౌత్ ఆఫ్రికాలో గాంధీ తాను చేస్తున్న పోరాటానికి అహింసాయుత, లేదా శాంతియుత పోరాటం అనే పదాన్ని అంత తేలికగా అంగీకరించలేక పోయారు. చాలా కాలం ఆలోచించి, మంగన్‌లాల్ లాంటి వారి సలహాతో చివరికి ఆ పోరాట రూపం - "సత్యాగ్రహం" అనే పదాన్ని సంతరించుకుంది.
"సత్యాగ్రహం" అంటే సత్యాన్ని వదలకుండా బలంగా, విశ్వాసంతో పట్టుకోవడం. సత్యంలో అంతర్భాగం అహింస. ఎందుకంటే హింసలో ఆయుధపు ఔన్నత్యం ఎక్కువై, మనిషి అతని సిద్దాంతం దిగువ స్థాయికి వస్తుంది. అయితే మీరు నమ్మిన సిద్దాంతం సత్యంతో కూడినదైతే, మీకు ఆయుధం అవసరం లేదు.
మీ సత్యమే బలమైన ఆయుధం. కేవలం బలహీనుడికి ఆయుధం కావాలి. శారీరక మానసిక బలం ఉన్న వారు తమ మరింత బలమైన హేతువుతో ఎదుటి వారిని జయించగలరు.
వారికి హింస, ఆయుధం అవసరం లేదు. ఇది టాల్‌స్టాయి పాసివ్ రెసిస్టెన్స్‌ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకుపోయిన గాంధీజీ విధానం.
రస్కిన్ రాసిన ''అన్‌టూ దిస్ లాస్ట్'' చదివి గాంధీ ఫినిక్స్ ఆశ్రమాన్ని 1904 అక్టోబరులో స్థాపించారు. 1909 జూన్ 23న గాంధీ ఇంగ్లండ్ వెళ్లారు. ఆ ప్రయాణం ముఖ్య ఉద్దేశం ఇంగ్లండ్‌లోని మేధావులకు, రాజకీయ నాయకులకు దక్షిణాఫ్రికాలోని భారతీయుల స్థితిగతులను తెలియజేసి వారి సహాయన్ని కోరడం. అయితే, ఇదే సమయంలో ఇంగ్లండ్‌లోని చాలామంది విప్లవకారులతో కలిసి భారత దేశపు స్వాతంత్ర్య ఉద్యమం గురించి చర్చించారు. తిరుగు ప్రయాణంలో ఆయన హిందూ స్వరాజ్ రాశారు. 1910 మే 30న దక్షిణాఫ్రికా తిరిగివచ్చాక టాల్‌స్టాయ్ ఫార్మ్ నెలకొల్పారు. రస్కిన్, టాల్‌స్టాయ్, థోరోల సాహిత్య ప్రభావం ఈ ఆశ్రమాలను నెలకొల్పడంలో, నిర్వహణంలో ఎంతో ఉంది. హింద్ స్వరాజ్ ఒక రకంగా టాల్‌స్టాయ్ ఆలోచనల కొనసాగింపు. టాల్‌స్టాయ్ పాసివ్ రెసిస్టెన్స్‌కి బదులుగా గాంధీ సూచించిన సత్యాగ్రహం ఒక విధంగా యాక్టివ్ రెసిస్టెన్స్. దీనినే ఎరిక్‌సన్ అనే ఫ్రాయిడ్ సైకాలజిస్ట్ మిలిటెంట్ నాన్ వయోలెన్స్ అన్నారు.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- మహాత్మా గాంధీ మతం ఏమిటి? గాంధీ దృష్టిలో దేవుడు ఎవరు?
- ఆర్ఎస్ఎస్తో గాంధీకి ఉన్న అసలు బంధం ఏమిటి?
- 'గాంధీ జాత్యహంకారి'
- కశ్మీర్లో ఒక్కసారే పర్యటించిన గాంధీ.. అప్పుడు ఆయన ఏమన్నారు?
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
- పెరియార్ : దక్షిణాది రాష్ట్రాలు భారతదేశంలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)