You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: టెస్ట్‌లు ఎక్కువ చేసినంత మాత్రాన కంట్రోల్ కాదు - బీబీసీ ఇంటర్వ్యూలో పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి
దేశంలో కరోనావైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు.
మరి ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు మార్గం ఉందా? ఉంటే.. ఎప్పటికి ఇది మనల్ని వదిలిపోతుంది? అప్పటి వరకు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు?
ఈ అంశాలపై పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కె. శ్రీనాథ రెడ్డి ‘బీబీసీ’తో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన కోవిడ్-19 టీమ్‌కు టెక్నికల్ డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోవిడ్ సలహాదారుగా వ్యవహరిస్తున్న శ్రీనాథ రెడ్డి బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ ఇంటర్వ్యూ చేశారు. ఆ వివరాలు ఇవీ..
జీఎస్ రామ్మోహన్: నమస్తే డాక్టర్‌గారు...
శ్రీనాథ్ రెడ్డి: నమస్కారమండీ
జీఎస్ రామ్మోహన్: ఈ కరోనావైరస్ ఇబ్బందుల నుంచి మనం ఎప్పటికి బయటపడొచ్చు?
శ్రీనాథ్ రెడ్డి: ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఏ దేశాలైతే తాము ముందుగా వైరస్‌ను పారదోలామని ప్రకటించుకున్నాయో ఆ దేశాలలో కూడా తిరిగి అది వ్యాపిస్తోంది.
స్పెయిన్, ఫ్రాన్స్, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా ఇలా చాలా ప్రాంతాలలో మళ్లీ వైరస్ వ్యాపిస్తోంది. బ్రిటన్‌లోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అందుకని, పూర్తిగా ఏ దేశమూ దీనిపై విజయం సాధించిందని అనుకోడానికి వీల్లేదు.
ఇది ఫస్ట్ వేవ్ అనుకన్నా, సెకండ్ వేవ్ అనుకున్నా, దాని వ్యాప్తి మాత్రం ఆగలేదు. ఇక చలికాలం వచ్చిన తర్వాత ఉత్తర ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ప్రస్తుతం చలికాలం ఉన్న దక్షిణ ప్రాంతంలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి.
వాతావరణాన్ని బట్టి వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగా ఉంది. కాబట్టి వచ్చే ఏప్రిల్ వరకు వేచి చూడాలి. అప్పటి పరిస్థితిని బట్టి మనం వైరస్ మీద విజయం సాధించామా లేదా అన్నది అర్థమవుతుంది.
వ్యాక్సిన్ వచ్చినా రాకున్నా, ఇప్పటికైతే వైరస్ ప్రవర్తనలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. స్పెయిన్, బ్రిటన్‌లాంటి దేశాలలో వైరస్ మళ్లీ విజృంభిస్తున్నా, మరణాలు చాలా తక్కువగా ఉన్నాయి. వ్యాధి తీవ్రత తక్కువగానే ఉంది. ఆసుపత్రులకు తాకిడి తగ్గింది. వీటినిబట్టి చూస్తే వైరస్ స్వభావం మారిందని, ప్రభావం తగ్గిందని అనుకోవచ్చు.
జీఎస్ రామ్మోహన్: మీరు సీజన్స్ గురించి ప్రస్తావించారు. అయితే ఈ సమయంలో మనం ఒక విషయం చర్చించాలి. మనదేశంలో మరణాల రేటు తక్కువ ఉండటానికి కారణం మన దేశంలోకి వచ్చింది కొంచెం తక్కువ ప్రభావం ఉన్న వైరస్ అని అంటున్నారు. శాస్త్రవేత్తల నుంచి కూడా ఆ మాట వినిపించింది. అలాగే ఎండాకాలం వస్తే వైరస్ ప్రభావం తగ్గుతుంది అన్న చర్చ కూడా నడిచింది. అది ఎంత వరకు నిజం?
శ్రీనాథ్ రెడ్డి: మిగిలిన కరోనా వైరస్‌లు శీతాకాలంలో పెరగడం, ఎండకాలంలో తగ్గడంలాంటి స్వభావంతో ఉంటాయి. కాబట్టి ఇది కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ అంచనా నిజం కాలేదు. వేసవిలో కూడా కేసులు పెరిగాయి.
వాస్తవానికి వైరస్‌లు జంతువుల నుంచి మనుషుల్లోకి చేరిన తర్వాత వాటి స్వభావం తీవ్రంగా కూడా మారుతుంది. ఇక శీతాకాలంలో కేసులు పెరగడానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. ఈ కాలంలో మనుషుల్లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే వైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
జీఎస్ రామ్మోహన్: ఇటీవల సీరో టెస్టుల రిపోర్టులనుబట్టి చూస్తే ఇప్పుడు చెబుతున్న దానికన్నా అనేకరెట్లు అంటే 80 నుంచి 130రెట్లు అధికంగానే కేసులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది మే నాటికే దాదాపు 64లక్షల కేసులుండొచ్చని సీరో సర్వేలనుబట్టి అర్ధమవుతోంది. దీన్ని ఎలా చూడాలి. అదే నిజమైతే దేశంలో ఇప్పటికే దాదాపు 50కోట్లమందికి వైరస్ సోకినట్లు అనుకోవచ్చా ?
శ్రీనాథ్ రెడ్డి: సీరో సర్వేలో తప్పుడు పాజిటివ్ కేసులు వచ్చే అవకాశం చాలా ఉంది. వేరే కరోనా వైరస్‌లను కూడా ఇది పాజిటివ్‌గానే చూపుతుంది. లేబరేటరీలో జరిగినంత సెన్సిటివ్ పరీక్షలు, ఫలితాలు ఈ సీరో సర్వేలలో రావు. అందువల్ల సీరో సర్వేలో కనిపించిన ప్రతి కేసును ఇన్‌ఫెక్షన్ అనుకోడానికి లేదు.
అయితే దానిలో సగవంతయినా ఇన్‌ఫెక్ట్ అయ్యుండటం మంచి వార్తే. ఎందుకంటే మరణాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి వైరస్ మనమీద తక్కువ ప్రభావం చూపిందని అర్ధం చేసుకోవాలి.
జీఎస్ రామ్మోహన్: అంటే హెర్డ్ ఇమ్యూనిటీ పెరుగుతుందంటారా ? తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలలో సీరో సర్వేలు జరిగాయి. కొన్ని చోట్ల హెర్డ్ ఇమ్యూనిటీ 28 శాతానికి పైగా ఉన్నట్లు రిపోర్టులు వచ్చాయి. దాని ప్రభావం ఏంటి ?
శ్రీనాథ్ రెడ్డి: హెర్డ్ ఇమ్యూనిటీ గురించి అర్ధం చేసుకోవాలంటే హెర్డ్ ఇమ్యూనిటీ ప్రభావ స్థాయి ఎంతో కూడా తెలుసుకోవాలి.
వైరస్ వచ్చిన కొత్తలో దాని తీవ్రతనుబట్టి హెర్డ్ ఇమ్యూనిటీ ప్రభావ స్థాయి 60-70శాతం వరకు ఉంటుందనుకున్నారు.
అంటే ఒక సముదాయంలో 60-70శాతంమందికి వైరస్ సోకి, వాళ్లు కోలుకున్నట్లయితే అక్కడ హెర్డ్ ఇమ్యూనిటీ ఉన్నట్లు లెక్క.
ఒకసారి ఇమ్యూనిటీ సాధించుకున్నవారు మిగిలినవారు ఈ వ్యాధి బారిన పడకుండా రక్షణ గోడలుగా నిలుస్తారు. వైరస్ వ్యాప్తి ఆగిపోతుంది. అందువల్ల మిగిలిన 30-40 శాతం మంది ఆ సముదాయంలో ఉన్నంత వరకు వైరస్‌బారిన పడరు.
కానీ వారు బయటకు వెళితే వారికి వైరస్ సోకవచ్చు. కాబట్టి దేశం మొత్తానికి 50శాతంమందికో, 60శాతం మందికో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేదాక వేచి చూడటం కుదరదు.
రెండు, మూడు నెలల్లోనే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని ఆశించలేం. రెండు, మూడు సంవత్సరాలు కూడా పట్టొచ్చు.
యూరప్‌లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందనుకున్న ప్రాంతంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. పైగా ఒకసారి ఇమ్యూనిటీ వచ్చిన వారిలో అది ఎన్నాళ్లు ఉంటుందో కూడా చెప్పలేం.
జీఎస్ రామ్మోహన్: దేశంలో కేసులు సంఖ్య రోజుకు లక్ష వరకు ఉంటోంది. ప్రభుత్వాలు మొదటి నుంచి తీసుకుంటున్న చర్యల దశ దిశ సరైన మార్గంలోనే ఉందంటారా ?
శ్రీనాథ్ రెడ్డి: లాక్‌డౌన్ తొలిదశ బాగానే ఉంది. కానీ నిబంధనలు సడలించడం మొదలు పెట్టిన తర్వాత కేసులు పెరిగాయి.
మనకు జబ్బు రాదులే అన్నట్లు జనం భయంలేకుండా తిరగడం మొదలు పెట్టారు. దీంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. జనం గుంపులుగా చేరడాన్ని అరికట్టలేదు.
జీఎస్ రామ్మోహన్: మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఎత్తున కేసులు పెరగడానికి కారణమేంటి ? ఈ దశకు రాకుండా ఉండాలంటే ఏం చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది? ఏం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది ?
శ్రీనాథ్ రెడ్డి: మొదటి నుంచి టెస్టులు ఎక్కువగా చేసి, వైరస్ సోకినవారిని ఎప్పటికప్పుడు ఐసోలేషన్‌కు పంపి ఉన్నట్లయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆసుపత్రుల మీద పెట్టిన శ్రద్ద ప్రాథమిక సేవలపై పెట్టకపోవడం వల్ల ఇలా జరిగింది.
ఇక రెండోది ఇదేదో భయంకరమైన వ్యాధి అని ఎక్కువగా ప్రచారం జరిగింది. దీంతో చాలామంది తమలో వైరస్ లక్షణాలున్నా బయటకు చెప్పుకోలేదు. కోవిడ్ లక్షణాలున్న వారిని కొందరు వెలివేసినట్లు ప్రవర్తించారు.
మృతదేహాల విషయంలో కొంతమంది ప్రవర్తించిన తీరు చూశాక చాలామంది తమలో ఉన్న వైరస్ లక్షణాలకు చికిత్స చేయించుకోడానికి భయపడ్డారు.
జీఎస్ రామ్మోహన్: చెబుతున్నదానికంటే ఎక్కువ మరణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా ?
శ్రీనాథ్ రెడ్డి: కేసుల సంఖ్యను కొంచెం తక్కువ చేసి చూపించి ఉండొచ్చు. చాలా దేశాలలో ఇలాగే జరిగింది. ఎందుకంటే కొంతమంది ఈ మరణాలు బయటపెట్టలేదు. డాక్టర్లు కూడా కొన్నిచోట్ల ఈ విషయం బయటపకుండా కప్పిపెట్టే ప్రయత్నం చేశారు.
కానీ మిగతా దేశాలతో పోలిస్తే మృతుల సంఖ్య మాత్రం మన దేశంలో తక్కువగానే ఉంది. ఇండియాలో ప్రతి పదిలక్షలమందికి 55 మంది చనిపోయారు. కానీ బ్రిటన్‌లో పదిలక్షలమందిలో 630మంది చనిపోయారు.
బ్రిటన్‌లో మొదట తక్కువ మరణాలే నమోదయ్యాయి. ఆసుపత్రి బయట మరణాలు లెక్కించలేదు. కేవలం ఆసుపత్రి మరణాలనే చెప్పారు.
మరణాల విషయంలో ఇతర దేశాలకు, భారతదేశానికి మధ్య ఇంత తేడా ఉండటానికి కారణం కేవలం చావులను తక్కువ చేసి చూపించడం కాదు. దక్షిణాసియాలో మరణాలు రేటు తక్కువే.
మన గ్రామీణ ప్రాంతాలో డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్‌లాంటి వ్యాధులు తక్కువ కాబట్టి మరణాలు కూడా తక్కువే.
జీఎస్ రామ్మోహన్: తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉంది, వాటి వ్యూహాలను మీరు ఎలా చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ టెస్టులు చేస్తుండగా, తెలంగాణాలో తక్కువగా ఉంది. ఎవరికి వారు తమ వ్యూహం సరైందని అనుకుంటున్నారు...
శ్రీనాథ్ రెడ్డి: దేశవ్యాప్తంగా నమోదైన మరణాల రేటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మరణాల రేటు తక్కువ. ఉన్నంతలో కేసుల మేనేజ్‌మెంట్ బాగానే ఉందనిపిస్తోంది.
జీఎస్ రామ్మోహన్: టెస్టింగ్ అంత ముఖ్యం కాదని, ఇతర అంశాలపై దృష్టి పెట్టామని తెలంగాణ ప్రభుత్వం అంటుంటే, మాకు టెస్టులే కీలకమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఏది సరైన వ్యూహమంటారు.
శ్రీనాథ్ రెడ్డి: టెస్టులు ఎక్కువ జరిగితే కేసులు ఎక్కువ ఉంటాయి. తక్కువ జరిగితే తక్కువ ఉంటాయి. అది నిజం. కానీ టెస్టులు ఎక్కువ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఎలాంటి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నది ముఖ్యం.
కేవలం టెస్టుల మీదే ఆధారపడటం అంటే ఈ మధ్య అమెరికాకు చెందిన కొందరు నిపుణులు చెప్పినమాట గుర్తొస్తోంది. ఇది ఎలా ఉంటుందంటే వెదర్ రిపోర్టులు చదువుకుంటూ మేం వాతావరణ మార్పులను అడ్డుకోగలం అన్నట్లుగా ఉంటుది. కాబట్టి ఇంకా తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి.
జీఎస్ రామ్మోహన్: ఆ చర్యలేంటి. రెండు రాష్ట్రాలు వాటి మీద ఎలా పని చేస్తున్నాయి.
శ్రీనాథ్ రెడ్డి: మన ఆరోగ్య వ్యవస్థ ముందు నుంచీ బలహీనంగానే ఉంది. ఒంటి కాలి మీద కుంటుతూ నడిచే వ్యక్తిని రేసులో పరిగెత్తి పతకం సాధించమంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి కూడా అలాగే ఉంది.
వైద్య వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆ పని చేయాలి. ఇది మనకు పాఠంలాంటిది. ఉన్నంతలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో లభించే వసతులను ఏ స్థాయిలో వాడుకోగలమన్నది ముఖ్యం.
జీఎస్ రామ్మోహన్: వ్యాధి తీవ్రత ఏంటో తెలిశాక, మనం దానికి తగిన రీతిలో సన్నద్ధులమై ఉన్నామా ?
శ్రీనాథ్ రెడ్డి: దిల్లీ ఉదాహరణ తీసుకుంటే.. అక్కడ మేం వేల పడకలను సిద్ధం చేశామని ప్రభుత్వం చెప్పుకొంది. కానీ తర్వాత తెలిసిందేంటంటే..చాలా తక్కువమందికి ఐసీయూలు అవసరమయ్యాయి. ఇంకా తక్కువమందికి వెంటిలేటర్లు కావలసి వచ్చాయి.
అందుకే ఇప్పుడు వైఖరి మార్చుకుని 80 శాతంమంది ఇంట్లోనే చికిత్స పొందవచ్చని చెబుతోంది. ఆక్సీమీటర్లు ఇస్తాం, వైద్య సిబ్బందిని పంపిస్తామని అంటోంది.
కరోనా ఆరంభంలో ప్రజలు కూడా భయపడ్డారు. ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరినీ ఐసోలేషన్‌కు పంపించాలనుకుంది. దీనివల్ల బెడ్ల కొరత ఏర్పడింది. అందుకే వైఖరి మార్చుకోవడం అన్నది అవసరం.
కేవలం సీరియస్ కేసులను మాత్రమే ట్రీట్ చేయడం, మిగిలిన వారికి జాగ్రత్తలు చెప్పి ఇంటి వద్దే ట్రీట్‌మెంట్ ఇవ్వడం అనేది సరైన వ్యూహం.
జీఎస్ రామ్మోహన్: ప్రాణం దగ్గరికొచ్చేసరికి ఎవరైనా భయపడి పోతారు. అయితే ప్రాణానికి అవసరమైన ఒక సౌకర్యం అందుకోలేని విషాదాన్ని ఎలా చూడాలి ? కొన్ని సౌకర్యాల విషయంలో కొనగలిగిన వారు, కొనలేని వారు అన్న తేడా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ఆసుపత్రులు చేర్చుకోడానికే లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ఏం చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది.
శ్రీనాథ్ రెడ్డి: ముందు నుంచి మంచి వైద్య వ్యవస్థను తయారు చేసి ఉంటే.. డబ్బుతో సంబంధం లేకుండా మేం వైద్యం అందించగలం అన్న భరోసాను ముందు నుంచీ కల్పించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఇవి కూడా చదవండి:
- అక్షరాస్యతలో బిహార్ కంటే వెనుకబడ్డ ఆంధ్రప్రదేశ్.. అసలు కారణాలేంటి?
- అఫ్గాన్ శాంతి చర్చలు: తాలిబాన్లతో కాల్పుల విరమణకు ప్రభుత్వ ప్రతిపాదన
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా..
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)