You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విశాఖ హిందుస్తాన్ షిప్‌యార్డ్ ప్రమాదం: మూడేళ్లుగా మూలనపడిన క్రేన్‌ను రిపేరు చేయాలనుకుంటే 11 మంది ప్రాణాలు పోయాయి
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
వరుస ప్రమాదాలు విశాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మూడు నెలల్లోనే ఎన్నో భారీ ప్రమాదాలు జరిగాయి.
తాజాగా హిందుస్తాన్ షిప్‌యార్డ్ చరిత్రలోనే పెను ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నపాటి తప్పిదం వల్ల జరిగిన ఈ ప్రమాదం 11 మంది ప్రాణాలు తీసింది.
ఈ ఘటనకు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దర్యాప్తు కోసం రెండు కమిటీలను వేసింది.
మరోవైపు బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఆదివారం జరిగిన చర్చల అనంతరం మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది.
విశాఖ కేంద్రంగా స్వాతంత్ర్యానికి ముందే, 1941లో హిందుస్తాన్ షిప్ యార్డును ప్రారంభించారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలో దీని నిర్వహణ సాగుతోంది. అప్పటి నుంచి స్వల్ప ఘటలు మినహా ఎప్పుడూ భారీ ప్రమాదాలు జరగలేదు.
కానీ, ఇప్పుడు ఇక్కడ మొదటిసారి భారీ క్రేన్ కుప్పకూలడంతో, దానిపైన ఉన్న 10 మంది, క్రేన్ కింద నలిగిపోయిన మరో కార్మికుడు మృతిచెందాడు. ఈ ప్రమాదం యార్డులో కలకలం రేపింది. బాధితుల కుటుంబాలను విషాదంలో ముంచింది.
మూడేళ్లు మూలన ఉన్న క్రేన్
ఈ ప్రమాదం ఆగస్టు 1న ఉదయం 11.40 సమయంలో జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు క్రేన్ క్యాబిన్‌లో 10 మంది సిబ్బంది ఉన్నారు. సాధారణంగా ఒకేసారి అంత మంది క్యాబిన్‌లో ఉండరని యార్డులో విధులు నిర్వహిస్తున్న ఒక సీనియర్ ఇంజినీర్ తెలిపారు.
పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆయన ప్రమాదం నేపథ్యాన్ని వివరించారు.
“షిప్ యార్డ్ 2015లో అనుపమ్ క్రేన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో ఆ క్రేన్‌ను విశాఖకు తీసుకొచ్చారు. కానీ, అది ఉపయోగించడానికి పనికిరాదని అప్పట్లోనే తేల్చిన అధికారులు, దానిని వాడకుండా వదిలేశారు. ఇప్పుడు అవసరాల కోసం దానిని ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో గ్రీన్ ఫీల్డ్, లీడ్ ఇంజనీర్స్, స్క్వాడ్-7 సంస్థలతో కలిసి దానిని సరిచేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ట్రయల్స్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మా కళ్లముందే అది కూలిపోతుంటే చాలా భయం వేసింది. ఎప్పుడూ అలాంటి దృశ్యాలు చూడలేదు. అధికారులు తగిన శ్రద్ధ పెట్టకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయ"ని చెప్పారు.
హిందుస్తాన్ షిప్ యార్డ్ అవసరాల కోసం 50కి పైగా క్రేన్లు ఉపయోగిస్తున్నారు. అందులో 70 టన్నుల సామర్ధ్యం ఉన్న 9 క్రేన్లు ఉన్నాయి. ఇప్పుడు ముంబయికి చెందిన అనుపమ్ క్రేన్స్ తయారు చేసిన ఇది కూడా వినియోగంలోకి వస్తే మొత్తం 10 క్రేన్లు అవుతాయి.
తాజాగా ప్రమాదానికి కారణమైన క్రేన్ విలువ 17.75 కోట్ల రూపాయలని షిప్ యార్డ్ అధికారులు చెబుతున్నారు. అయితే గత మూడేళ్లుగా అనుపమ్ క్రేన్స్ సంస్థ దీనిని వినియోగంలోకి తీసుకొచ్చేలా తగిన మార్పులు ఎందుకు చేయలేదన్నది తెలియడం లేదు.
దీనికి సంబంధించి షిప్‌యార్డ్ సీఎండీ కార్యాలయ సహాయకుడిని బీబీసీ సంప్రదించగా, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న విషయాల గురించి తాము మాట్లాడలేమని ఆయన చెప్పారు.
నోరుమెదపని కాంట్రాక్టు సంస్థలు
ప్రమాదం కారణాలు, మృతుల కుటుంబాలకు పరిహారం విషయంపై కూడా కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఎలాంటి స్పందనా లేదు.
దీనిపై బీబీసీ లీడ్స్ ఇంజినీర్స్ సంస్థను కూడా సంప్రదించింది. వారు ప్రస్తుతం తాము ఏమీ చెప్పలేమన్నారు.
షిప్‌యార్డ్ కార్మిక సంఘాల నేతలు, కాంట్రాక్ట్ సంస్థల మధ్య చర్చలు జరిగిన తర్వాత తుది నిర్ణయం చెబుతామని అంటున్నారు. మిగిలిన సంస్థలు కూడా దీనిపై ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదు. వారు కనీసం బాధిత కుటుంబాలను పరామర్శించడానికి కూడా రాలేదని వారు చెబుతున్నారు.
చిన్న పిల్లలతో ఎలా బతకాలి
షిప్ యార్డ్ ప్రమాదంలో చనిపోయిన వారిలో పశ్ఛిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ వారు ఉన్నారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని పెనికెలపాడు నుంచి 20 ఏళ్ల క్రితం గాజువాక వెళ్ళి షిప్ యార్డులో కాజువల్ వర్కర్‌గా చేరిన ఐబీసీవీ వెంకటరమణను ఐదేళ్ల క్రితమే పర్మినెంట్ చేశారు.
ప్రమాదంలో అతడు చనిపోవడంతో అతని భార్య, కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 13 ఏళ్ల లోపు ఇద్దరు ఆడపిల్లలను ఎలా పోషించాలనంటూ ఆమె కన్నీళ్లు పెడుతున్నారు.
వెంకటరమణ కుటుంబాన్ని ఆదుకోవాలని వారి సమీప బంధువు నాగమణి డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోర్ట్ ట్రస్టులో పనిచేస్తున్నఆమె భర్త కూడా ప్రమాదవశాత్తూ క్రేన్ మీద పడడంతో చనిపోయారు.
భర్త చనిపోయిన తర్వాత తనకు ఉద్యోగం ఇవ్వడం వల్ల జీవితంపై ఒక భరోసా ఏర్పడిందని ఆమె చెప్పారు.
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండలానికి చెందిన గుగులోత్ జగన్మోహన్ రావు కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు. ఆయన 15 ఏళ్ళుగా షిప్ యార్డులో టెక్నికల్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు క్రేన్ క్యాబిన్‌లో ఉన్న ఆయన జారిపడడంతో మరణించారని ధ్రువీకరించారు.
పశ్చిమ బెంగాల్ ఖరగ్‌పూర్‌కి చెందిన భాస్కర్ రావు 10 ఏళ్ళ క్రితం విశాఖకు వలస వచ్చారు. గ్రీన్ ఫీల్డ్ కంపెనీలో మెకానికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయన చనిపోవడంతో తమ కుటుంబానికి దిక్కు లేకుండా పోయిందని భార్య లోకేశ్వరి రోదిస్తున్నారు.
మృతుల్లో మిగిలిన వారిలో ఎక్కువమంది వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు ఉపాధి కోసం వచ్చినవారే ఉన్నారు.
విచారణ కోసం రెండు కమిటీలు
హిందుస్థాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదంపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. మల్కాపురం పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏసీపీ టి.మోహన్ రావు బీబీసీకి చెప్పారు.
“ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించాం. ముందు జాగ్రత్తగా షిప్ యార్డు దగ్గర పోలీసులను పెట్టాం. ఉద్రిక్తతలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎవరెవరిపై చర్యలు తీసుకునేదీ, కేసు విచారణ తర్వాతే తేలుతుంది” అన్నారు.
మరోవైపు, ఈ ప్రమాద కారణాలు తెలుసుకోడానికి రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. ఏయూ మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు, మరో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. వారితోపాటూ షిప్ యార్డ్ సీఎండీ సహా ఏడుగురు డైరెక్టర్లతో అంతర్గత కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మూడు నాలుగురోజుల్లోనే వీరి నివేదిక వస్తుందని కలెక్టర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ చొరబాట్లకు గట్టిగా జవాబు ఇచ్చే భారత్ చైనాపై మౌనంగా ఎందుకు ఉంటోంది? దెబ్బకు దెబ్బ తీయవచ్చా? అడ్డంకులేంటి?
- రిలయన్స్ జియో 5జీ వస్తోంది.. కానీ భారతీయులు ఎన్నాళ్లు ఎదురు చూడాలి?
- కరోనావైరస్: లాక్డౌన్ తర్వాత వైరస్ బారిన పడకుండా... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్: మాస్కులు ఎక్కువ సేపు ధరిస్తే ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందా? శాఖాహారం తింటే వైరస్‌ను అడ్డుకోవచ్చా?
- ఇండియా లాక్డౌన్: వైజాగ్, కోల్‌కతా మినహా దేశమంతా విమాన సర్వీసులు... ప్రయాణంలో పాటించాల్సిన నిబంధనలేంటంటే?
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
- కరోనావైరస్: యూట్యూబ్‌లో తప్పుదోవ పట్టించే వీడియోలు చూస్తున్న కోట్ల మంది యూజర్లు
- కరోనావైరస్: పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసే మనుషులు ఏడు రకాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)