ప్రపంచంలో కరోనావైరస్ కేసులు అత్యధికంగా నమోదైన దేశాల్లో ఏడో స్థానానికి భారత్

కరోనావైరస్ పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానానికి చేరుకుంది.

జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సమాచారం ప్రకారం భారత్‌లో ఇప్పటివరకూ మొత్తంగా 1,90,609 కేసులు నమోదయ్యాయి. 5,408 మంది మరణించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గణాంకాల ప్రకారం కూడా కరోనావైరస్ కేసుల సంఖ్య అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఏడో స్థానానికి వెళ్లింది. భారత్‌లో మొత్తంగా 1,82,143 కేసులు నమోదయ్యాయని, 5,164 మంది చనిపోయారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా, బ్రెజిల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

అమెరికాలో కరోనావైరస్‌తో మరణించినవారి సంఖ్య లక్ష దాటింది. కేసుల సంఖ్య 17 లక్షలు దాటింది.

మరోవైపు బ్రెజిల్ 5 లక్షలకుపైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 30 వేలకుపైగా మంది మరణించారు.

దేశంలో కొత్తగా 8వేల కేసులు

భారత ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం వెల్లడించిన సమాచారం ప్రకారం గత 24 గంటల్లో 8,392 కేసులు నమోదయ్యాయి.

మొత్తం కేసుల సంఖ్య 1,90,535. వీటిలో 93,322 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 91,818 మంది కోలుకున్నారు. 5,394 మంది మరణించారు.

కేసులు అత్యధికంగా ఉన్న ఐదు రాష్ట్రాలు ఇవే...

  • మహారాష్ట్ర - కేసులు: 67,655; కోలుకున్నవారు: 29,329; మరణాలు: 2,286.
  • తమిళనాడు - కేసులు: 22,333; కోలుకున్నవారు: 12,757; మరణాలు: 173.
  • దిల్లీ - కేసులు: 19,844; కోలుకున్నవారు : 8,478; మరణాలు: 473.
  • గుజరాత్ - కేసులు: 16,779; కోలుకున్నవారు: 9,919; మరణాలు:1,038.
  • రాజస్థాన్ - కేసులు: 8,831; కోలుకున్నవారు: 5,927; మరణాలు: 194.

నేటి నుంచి లాక్‌డౌన్ తొలగింపు

భారత్‌లో లాక్‌డౌన్‌ ఉపసంహరణ సోమవారం మొదలైంది. ఏయే కార్యకాలాపాలను అనుమతించాలి, వేటిని నిలిపి ఉంచాలనే విషయమై నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే వదిలేసింది.

కరోనావైరస్ కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో జూన్ 30 వరకూ లాక్‌డౌన్ పొడగించారు.

దిల్లీలో జూన్ 8 నుంచి కొన్ని షరతుల మధ్య హోటళ్లు, షాపింగ్ మాళ్లు, రెస్టారెంట్లు, సెలూన్లు తెరుచుకోనున్నాయి.

నేటి నుంచి 200 ప్రత్యేక రైళ్లు

కొన్ని ఎంపిక చేసిన‌ మార్గాల్లో సోమవారం నుంచి ప్ర‌త్యేక రైళ్లు ప‌రుగులుతీయ‌బోతున్నాయి. ప్ర‌యాణికుల మ‌ధ్య‌ క‌రోనావైర‌స్ వ్యాప్తించ‌కుండా రైల్వే ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది.

తొలి రోజు 1.45 ల‌క్ష‌ల మంది ఈ రైళ్ల‌లో ప్ర‌యాణించ‌బోతున్న‌ట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. జూన్ 30 వ‌ర‌కు మొత్తంగా 25,82,671 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

వ‌ల‌స కూలీల కోసం మే 12 నుంచీ 30 ప్ర‌త్యేక‌ శ్రామిక్ రైళ్ల‌ను రైల్వే న‌డిపిస్తోంది. వాటికి అద‌నంగా ఈ 200 రైళ్లు ప‌రుగులు తీస్తాయి.

ప్ర‌త్యేక రైళ్ల‌లో ఏసీతోపాటు నాన్-ఏసీ కోచ్‌లు ఉంటాయి. జ‌న‌ర‌ల్ బోగీల్లోనూ కూర్చుని ప్ర‌యాణించేందుకు రిజ‌ర్వేష‌న్ చేయించుకోవాలి. అన్‌రిజ‌ర్వుడ్ బోగీలంటూ ఏమీ ఉండ‌వు.

మే 22 నుంచీ ఈ రైల్‌ టికెట్ల‌ బుకింగ్ మొద‌లైంది. అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ స‌మయాన్ని 30 రోజుల నుంచి 120 రోజుల‌కు పెంచారు.

ప్ర‌యాణికుల తొలిచార్ట్‌ను నాలుగు గంట‌ల ముందే సిద్ధంచేస్తారు. రెండో చార్ట్‌ను రెండు గంట‌ల ముందు సిద్ధంచేస్తారు. ఇదివ‌ర‌కు 30 నిమిషాల ముందే సిద్ధంచేసేవారు.

క‌రోనావైర‌స్ కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌త్యేక రైలు సేవ‌ల‌పై ఝార్ఖండ్‌, ఆంధ్రప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు అభ్యంత‌రం వ్య‌క్తంచేశాయి. దీనికి సంబంధించి రాష్ట్రాల‌తో రైల్వే ప్ర‌తినిధులు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు రైల్వే అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)