ఇండియా లాక్‌డౌన్: రేషన్ కోసం లైన్‌లో నిల్చున్న మహిళ మృతి

    • రచయిత, సమీరాత్మజ్ మిశ్ర
    • హోదా, బీబీసీ కోసం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూం జిల్లాలో రేషన్ షాపు ముందు లైన్‌లో నిలబడ్డ శమీమ్ బానో అనే ఓ మహిళ మృతి చెందారు.

పోస్టుమార్టం నివేదిక ఇంకా రాలేదు. గుండెపోటుతో ఆమె మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆ రేషన్ షాపుకు రెండు రోజులుగా శమీమ్ 1.5 కిలో మీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు.

శమీమ్‌ది సాలార్పుర్‌ బ్లాకులోని ప్రహ్లాద్‌పుర్ గ్రామం. ఆమె భర్త దిల్లీలో ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ఆయన ఇప్పుడు అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు.

గురువారం రేషన్ షాపు ముందు శమీమ్ లైన్‌లో నిలబడ్డారు. కానీ, ఆమె వంతు రాలేదు. దీంతో మరుసటి రోజు ఉదయం 8 గంటలకే వచ్చి, మళ్లీ లైన్‌లో నిలబడ్డారు.

11 గంటల సమయంలో బాగా ఎండగా ఉంది. ఒక్కసారిగా శమీమ్ స్పృహ తప్ప పడిపోయారు. పక్కనున్నవాళ్లు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ, మార్గమధ్యంలోనే ఆమె చనిపోయారు.

ఈ ఘటన తర్వాత ఆ గ్రామంలో రేషన్ పంపిణీ నిలిపివేసి, జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు.

జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లా ఆహార పంపిణీ అధికారి (డీఎస్‌ఓ) రామేంద్ర ప్రతాప్ ఈ ఘటనపై విచారణ జరిపారు.

పంపిణీలో ఆలస్యం

‘‘లైన్‌లో నిల్చున్న పది నిమిషాలకే ఆ మహిళ స్పృహ తప్పి పడిపోయారు. రోజూ 40-50 మందికి రేషన్ పంచుతున్నట్లు మా విచారణలో తేలింది. లైన్‌లో నిల్చున్నవాళ్లకు రేషన్ రాకపోవడమంటూ ఉండదు. ఉదయం పది గంటలకే ఈ ఘటన జరిగింది. మండుటెండ ఉందని కూడా అనలేం’’ అని డీఎస్ఓ రామేంద్ర ప్రతాప్ అన్నారు.

11 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, అప్పటివరకూ 8-10 మందికి రేషన్ పంపిణీ పూర్తైందని రేషన్ షాపులో పనిచేస్తున్న గణేశ్ ప్రసాద్ చెప్పారు.

‘‘సామాజిక దూరం పాటించడం కోసం వృత్తాలు గీశారు. ఉదయం 8 గంటలకే రేషన్ పంపిణీ మొదలుపెట్టాం. సర్వర్ వేగంగా లేదు. అందుకే రేషన్ పంపిణీ నెమ్మదిగా సాగుతోంది. లైన్‌లో 30-35 మంది తర్వాతి స్థానంలో ఆ మహిళ నిల్చొని ఉన్నారు’’ అని ఆయన వివరించారు.

మూడు గంటల్లో ఎక్కువలో ఎక్కువ పది మందికి రేషన్ పంపిణీ పూర్తైందని, ముందు రోజు కూడా అదే పరిస్థితి ఉందని ప్రహ్లాద్‌‌పుర్ గ్రామవాసులు అంటున్నారు.

‘‘రేషన్ షాపు బయట అందరూ ఎండలోనే నిల్చొని ఉన్నారు. 15వ తేదీ నుంచి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ రోజు కూడా అందరూ వచ్చారు. కానీ, రేషన్ దొరకలేదు. మరుసటి రోజు రోజంతా నేను లైన్‌లో ఉన్నా, అతికష్టం మీద 20-25 మంది రేషన్ పొందగలిగారు. శుక్రవారం ఆ మహిళ మరణించాక, రేషన్ పంపిణీ ఆగిపోయింది’’ అని గ్రామానికి చెందిన దేవీ దీన్ చెప్పారు.

రేషన్ పంపిణీ సమయంలో సూపర్వైజర్లు లేరని అక్కడివాళ్లు అంటున్నారు. సూపర్వైజర్లు లేకుండా పంపిణీ చేయకూడదు.

‘ఆమెకు రేషన్ కార్డు లేదు’

శమీమ్ తీవ్ర పేదరికం అనుభవిస్తున్నారని ప్రహ్లాద్‌పుర్ గ్రామ సర్పంచి సర్వజీత్ అన్నారు.

‘‘శమీమ్ భర్త దిల్లీలో ఉంటారు. ఆమె పిల్లలతో కలిసి గ్రామంలో ఒంటరిగా ఉంటున్నారు. ఆమెకు రేషన్ కార్డు గానీ, బ్యాంకు ఖాతా గానీ లేవు. అందుకే ఇతర సాయాలు అందలేదు. రేషన్ రావాలని ఆమెకు పీహెచ్‌హెచ్ కార్డు ఇప్పించాం. ముందు కూడా ఆమెకు ఆ కార్డుతో రేషన్ వచ్చింది’’ అని ఆయన చెప్పారు.

శమీమ్ కుటుంబం ఇప్పుడు ఘటన గురించి బయటకు ఏమీ మాట్లాడటం లేదు. శమీమ్‌కు గానీ, దిల్లీలో ఉంటున్న శమీమ్ భర్తకు గానీ ఫోన్ లేదని, ఘటనపై పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని సర్వజీత్ అన్నారు.

సర్వర్లు నెమ్మదిగా పనిచేస్తుండటం వల్ల రేషన్ కోసం ఎండలో జనం లైన్లలో గంటలు గంటలు వేచిచూడాల్సిన పరిస్థితి జిల్లా అంతటా ఉందని స్థానిక పాత్రికేయుడు చితరంజన్ సింగ్ అన్నారు.

‘‘గంటల తరబడి నిల్చుంటే వాళ్ల వంతు వస్తుంది. లైన్లు కట్టకుండా రేషన్ పంచే ఏర్పాట్లేవీ చేయలేదు. ఉష్ణోగ్రత 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటుతోంది. అనవసరంగా అందరినీ లైన్‌లో నిలబెట్టే కన్నా, టోకెన్ వ్యవస్థ పెట్టి, పది పది మందిని పిలవాలని జిల్లా అధికారులకు సూచన చేసినా... వాళ్లు దాన్ని పట్టించుకోలేదు’’ అని ఆయన అన్నారు.

ప్రహ్లాద్‌పుర్ ఘటన తర్వాత జిల్లా అంతటా టోకెన్ల పద్ధతిలో రేషన్ పంపిణీ చేయాలని యంత్రాంగం ఆదేశించిందని, రేషన్ షాపుకు తక్కువ మందినే పిలుస్తున్నారని చితరంజన్ సింగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)