కరోనావైరస్: లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోందా?

కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఈనెల 15తో ముగుస్తోందా? అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్‌, ఆ తర్వాత దాన్ని తొలగించడం అనుమానాలకు ఆస్కారమిచ్చింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు.

రాబోయే కొన్ని వారాల్లో టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటీన్‌ల పైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

దేశంలో, వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 వ్యాప్తి, తీసుకుంటున్న చర్యలపై సమీక్షించేందుకు మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

దేశంలో కరోనావైరస్ కేసుల పెరుగుదల, నిజాముద్దీన్ మర్కజ్ ద్వారా వైరస్ వ్యాప్తి, సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.

అత్యవసర వైద్య పరికరాలు, మందులు, మందుల తయారీకి అవసరమైన సామగ్రిని తగిన స్థాయిలో సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు మోదీ సూచించారు.

లాక్‌డౌన్ ముగుస్తోందా?

అయితే, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ చేసిన ఓ ట్వీట్ అనుమానాలకు తావిచ్చింది.

"లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోంది. కానీ, దానర్థం వీధుల్లో స్వేచ్ఛగా తిరగొచ్చని కాదు. వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో మనందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సామాజిక దూరం పాటించడం, లాక్‌డౌన్ మాత్రమే కోవిడ్-19ను ఎదుర్కొనే మార్గాలు" అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే, కాసేపటికే దీన్ని తొలగించారు. హిందీ భాషను సరిగా అర్థం చేసుకోలేని ఓ అధికారి ఈ ట్వీట్‌ను పోస్ట్ చేశారని, అందువల్ల దీన్ని తొలగిస్తున్నామని పెమా ఖండూ వివరణనిచ్చారు.

కానీ, ఏప్రిల్ 15నుంచి రైలు టిక్కెట్లు, విమాన టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించడం చూస్తుంటే లాక్‌డౌన్ ముగిసి, ప్రజా రవాణాను తిరిగి ప్రారంభిస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ రైలు టిక్కెట్ల బుకింగ్‌ను ప్రారంభించింది. చాలామంది బుక్ చేసుకున్నారనేది కూడా అందుబాటులో ఉన్న టికెట్ల సంఖ్య, వెయిటింగ్ లిస్టులను చూస్తుంటే అర్థమవుతోంది.

దేశీయంగా విమాన ప్రయాణాలకు కూడా కొన్ని వెబ్‌సైట్లలో బుకింగ్ ప్రారంభమైంది.

అయితే ప్రభుత్వం తరపు నుంచి లాక్‌డౌన్ ఎత్తివేయడంపై గానీ, ప్రజా రవాణాకు అనుమతి విషయంలో కానీ ఎలాంటి సమాచారం లేదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)