You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమరావతి - సకల జనుల సమ్మె: 'మహిళలను నడిరోడ్లపై ఈడ్చేస్తారా.. నెట్టేసి గాయాల పాలు చేస్తారా' -చంద్రబాబు
అమరావతి పరిరక్షణ పేరుతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సకల జనుల సమ్మె పేరుతో నిరసనలు చేపట్టారు. సచివాలయానికి వెళ్లే దారిని దిగ్బంధించారు.
పలువురు ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం, తోపులాట జరిగాయి. కొందరు మహిళలు గాయపడ్డారు. గాయపరిచి, మహిళలను అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ పలుచోట్ల రోడ్డుపై ఆందోళనలు చేశారు.
అమరావతి ఆందోళనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదని తుళ్లూరు ఏఎస్పీ చక్రవర్తి తెలిపారు.
"సకల జనుల సమ్మెకు అనుమతి లేదు. ప్రజాస్వామ్యంలో భావాలను వ్యక్తం చేసుకోవచ్చు. కానీ ఆందోళనలు అదుపు తప్పితే చర్యలు తప్పవు. మహిళల్ని అరెస్ట్ చేయలేదు. పోలీసులు ఏ మహిళల్నీ గాయపరచలేదు. ఎవరికైనా గాయమైతే యాదృచ్ఛికంగానే తప్ప, కావాలని ఎవరినీ గాయపర్చలేదు" అని ఆయన చెప్పారు.
"సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌కి అంతరాయం లేకుండా చూడాలని మహిళల్ని కోరాం. మహిళలు ఒప్పుకోకపోవడంతో వారిని అక్కడి నుంచి తరలించాల్సి వచ్చింది. ప్రజలందరూ మాకు సహకరించాలి. మేము వారికి సహకరిస్తాం. ప్రస్తుతం ఇక్కడ ప్రశాంత వాతావరణం కొనసాగుతోంది" అని ఏఎస్పీ చక్రవర్తి వివరించారు.
మరో 4వేల కోట్లు పెడితే రాజధాని పూర్తి: చంద్రబాబు
మహిళల పట్ల జగన్ ప్రభుత్వ తీరు సరికాదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.
"అమరావతి అభివృద్ధికి ఇప్పటికే రూ.10వేల కోట్ల వరకు ఖర్చు చేశాం. మరో నాలుగైదు వేల కోట్లు ఖర్చు పెడితే రాజధాని సిద్ధమై పోతుంది. ఇప్పటికే హైకోర్టు ఉంది. సచివాలయం, అసెంబ్లీ, డీజీపీ ఆఫీస్, అధికారులకు భవనాలు అన్నీ ఉన్నాయి. 5 వేల నివాస గృహాలు దాదాపు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో రాజధానితో మూడు ముక్కలాట ఆడుతున్నారు" అంటూ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశంలో చంద్రబాబు విమర్శించారు.
"ముంపు ప్రమాదం అని, ఫౌండేషన్ ఖర్చు ఎక్కువ అని, ఒకే సామాజిక వర్గమని, ఇన్‌సైడ్ ట్రేడింగ్ అని రకరకాల దుష్ప్రచారం అమరావతిపై చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా ఇన్‌సైడ్ ట్రేడింగ్ కాదా? బినామీలని జగన్మోహన్‌రెడ్డి విమర్శించడం హాస్యాస్పదం. ఆయన ఇల్లు ఎవరి పేరుమీద ఉంది? బినామీల పేరుతో ఉన్న ఇంట్లో ఉంటూ ఇతరులపై గడ్డలేస్తే అవి మీకే తగులుతాయి" అని చంద్రబాబు అన్నారు.
విశాఖను అంతర్జాతీయ నగరం చేయాలనుకున్నాం
"ఇప్పటి ప్రభుత్వానికి అభివృద్ధి చేయడం తెలియదు. వికేంద్రీకరణ అసలు తెలియదు. విశాఖలో రూ.70వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టడానికి అదానీ గ్రూపు ముందుకొచ్చింది. పర్యటక రంగం అభివృద్ధికి లులూ కంపెనీని తీసుకొచ్చాం. ఇప్పుడు అవన్నీ వెనక్కి పోయాయి. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. ఆదాయం లేక పిల్లలకు స్కాలర్‌షిప్పులు కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం సంక్షోభం దిశగా వెళుతోంది" అని విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు అబద్ధాలు నమ్మితే నష్టపోతారు: కొడాలి నాని
చంద్రబాబు విమర్శలను పాలక వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రబాబు తీవ్ర అసహనంతో దుష్ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.
"రాజధాని విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ చంద్రబాబు మాత్రం ఉలిక్కిపడుతున్నారు. అసహనంతో వాస్తవాలను విస్మరించి దుష్ప్రచారం చేస్తున్నారు. బీసీజీ రిపోర్ట్ వచ్చింది. హైపవర్ కమిటీ భేటీ జరగుతుంది. ఈలోగా రైతులను రెచ్చగొట్టి, మీడియా ముందుకొచ్చి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే స్థితిలో లేరు" అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఏపీ రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఏం సూచించింది
- "ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా?".. సీఎం జగన్ వ్యాఖ్యలపై అమరావతి రైతుల నిరసన
- తొలిసారి విమానం ఎక్కాడు.. ఇంజిన్లోకి లక్కీ కాయిన్లు విసిరాడు
- గుజరాత్ పంట పొలాలపై పాకిస్తాన్ మిడతల ‘సర్జికల్ స్ట్రైక్’... 8 వేల హెక్టార్లలో పంట నష్టం
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': వైద్య రంగంలో అద్భుత విజయాలు
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- కృత్రిమ మేథస్సు ప్రమాదవశాత్తూ మనల్నే అంతం చేసేస్తుందా, ఎలా?
- భారత్‌లో ‘దేవతల గుహ’: వెళ్తే తిరిగిరాలేరు.. ఎందుకు? ఏముందక్కడ?
- "ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది"
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
- జపాన్: బడి మానేస్తున్న చిన్నారుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఎందుకు?
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)