మహారాష్ట్ర: ఫడణవీస్ బలపరీక్ష ఎప్పుడో రేపు తేలుతుంది

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అసెంబ్లీలో బల పరీక్షకు ఎప్పుడు రావాలో సుప్రీం కోర్టు మంగళవారం తేల్చనుంది.

మహారాష్ట్ర రాజకీయ ఘటనాక్రమాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చెబుతూ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై ఆదివారం ప్రారంభమైన విచారణ సోమవారం కూడా కొనసాగింది.

అన్ని పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును మంగళవారానికి రిజర్వు చేసింది.

శనివారం (నవంబర్ 23) ఉదయం అకస్మాత్తుగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు తోడుగా ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

సుప్రీం తీర్పు రిజర్వు చేయడంతో ఫడణవీస్ సర్కారుకు బలాన్ని నిరూపించుకునేందుకు మరో రోజు గడువు లభించినట్లైంది.

162 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతు ప్రకటిస్తూ ఇచ్చిన లేఖలను గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీకి సమర్పించినట్లు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల కూటమి తెలిపింది.

సోమవారం సుప్రీం కోర్టులో 80 నిమిషాల పాటు వాదనలు నడిచాయి.

కూటమి తరఫున వాదిస్తూ న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ.. 48 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలను కోర్టుకు చూపించారు.

''మాకు 48 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వాళ్లు 54 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెబుతున్నారు. ఇదెలా సాధ్యమవుతుంది. సుప్రీం కోర్టు దీన్ని చూసీచూడనట్లుగా వదిలేస్తుందా? బలం నిరూపించుకునేందుకు వారు సిద్ధంగా ఉంటే, ఆలస్యం ఎందుకు?'' అని ఆయన వ్యాఖ్యానించారు.

శివసేన తరఫున ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు.

''ఉదయం 5.17కు రాష్ట్రపతి పాలన తొలగించారు. అంత తొందర ఏముంది? ఉదయం ఎనిమిది గంటలకు ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేయాల్సినంత అత్యవసర పరిస్థతి ఏం ఏర్పడింది? తమకు బలం ఉందని వారు చెప్పుకుంటున్నప్పుడు, బల పరీక్ష నుంచి వారిని ఎందుకు కాపాడుతున్నారు?'' అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీకి మద్దతిస్తున్నట్లు తెలియజేస్తూ అజిత్ పవార్ నవంబర్ 22న లేఖను పంపినట్లు గవర్నర్ కార్యాలయం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

ఆ లేఖను కూడా ఆయన కోర్టుకు సమర్పించారు.

ఎన్సీపీకి చెందిన 54 మంది ఎమ్మెల్యేల మద్దతు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్‌లకు ఉందని ఫడణవీస్ తరఫున న్యాయవాది ముకుల్ రోహ్తగీ కోర్టుకు తెలిపారు.

''ఒక పవార్ అటువైపు ఉన్నారు. మరో పవార్ మావైపు ఉన్నారు. ఇదొక కుటుంబ కలహం కావొచ్చు. మేం కాదు, వాళ్లు బేరసారాలకు పాల్పడుతున్నారు. 170 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మేం గవర్నర్‌ వద్దకు వెళ్లాం. ఆయన మాకు అవకాశం ఇచ్చారు'' అని రోహ్తగీ అన్నారు.

ఈ ప్రక్రియలో గవర్నర్‌ను విమర్శించాల్సిన అవసరం లేదని, బల పరీక్ష జరిగే తీరుతుందని చెప్పారు.

సోమవారం ఉదయం 10.30కు రెండు రకాల పత్రాలు కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అవి..

1.దేవేంద్ర ఫడణవీస్ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్‌కు ఇచ్చిన ఎమ్మెల్యేల మద్దతు లేఖ

2.గవర్నర్ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానిస్తూ పంపిన అన్ని పత్రాలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)