You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బిహార్ వరదలు: పట్నాలో వీఐపీల ఇళ్ళు మాత్రం సేఫ్
- రచయిత, నీరజ్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ కోసం
గత ఏడు రోజులుగా బిహర్ రాజధాని పట్నా నగరం సగానికి పైగా మునిగిపోయింది. 72 గంటల్లో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పడవలు రోడ్లపైకి రావడం కనిపించింది. ప్రజలు నీళ్లలో గడపాల్సి వస్తోంది. వర్షం ఆగినా రోడ్లపై నీరు అలాగే ఉండిపోయింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఎత్తైన భవనాలపైకి వెళ్లారు. వరద నీటిలో చిక్కుకున్న జంతువులు సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే, వరద ముప్పు వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంగీకరించడం లేదు.
కానీ, వరద నీరు తగ్గుతున్న కొద్దీ సందేహాలు మరింత తీవ్రమవుతున్నాయి.
బేవుర్, రామకృష్ణ నగర్, ఇంద్రపురి, శివపురి, కంకర్‌బాగ్ వంటి అనేక నివాస ప్రాంతాల్లో ఆరు నుంచి ఏడు అడుగుల వరకు నీళ్లు నిలిచిపోయాయి.
చాలా రోజుల నుంచి నీళ్లు నిలిచిపోవడంతో నగరంలో అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి.
నీళ్లు ఎక్కువ సమయం ఎందుకు నిలిచిపోతున్నాయి?
వాతావరణ మార్పుల వల్ల అధికంగా వర్షాలు పడ్డాయని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెబుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేనందువల్లే ఇది జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కంకర్‌బాగ్‌లో వారం రోజుల నుంచి జలమయమైన తన ఇంట్లో నుంచి సీనియర్ జర్నలిస్ట్ లవ కుమార్ మిశ్రా దీనిపై మాట్లాడుతూ, ''అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయడానికి సిద్ధంగా లేనందువల్ల నీళ్లు బయటకు వెళ్లడం లేదు'' అని విమర్శించారు.
ఇంట్లో నీటిని తోడే పంపులు కూడా నీటిలోనే మునిగిపోయాయి. వర్షం తగ్గిన రోజు (సోమవారం) విలాస్ పూర్‌లోని ఎస్‌ఈసీఎల్ సంస్థ భారీ పంపులతో వీఐపీ ప్రాంతాల్లో నీటిని తోడి వేసే పనులు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి నితీశ్, మంత్రుల నివాసాల వద్ద చేరిన నీటిని తోడేశారు'' అని ఆయన పేర్కొన్నారు.
''వరద సమయంలో అధికారులు ప్రముఖుల ఇళ్లను కాపాడటంలో తరించారు. ఇతర రాష్ట్రాల నుంచి హెచ్‌పీ యంత్రాలను తీసుకు వచ్చి సహాయ చర్యలు ప్రారంభించారు. లోతట్టు ప్రాంతాలలో చర్యలు చేపట్టే విషయంలో స్థానిక సంస్థలు, ఇతర విభాగాల అధికారులకు మధ్య సరైన సమన్వయం లేదు'' అని చెప్పారు.
నగరం మునిగింది.. వీఐపీ ప్రాంతంలో దుమ్ములేస్తోంది
మేము మొదట నీటిలో మునిగిపోయిన ప్రాంతాలను చూసిన తరువాత, నరగంలో ప్రముఖులు నివసించే ప్రాంతానికి చేరుకున్నాం.
ఏడో రోజు (గురువారం) కూడా, కదమ్కువాన్ ప్రాంతంలో భారీగా నీరు నిలిచిపోయింది. పడవ ద్వారా సహాయక చర్చలు చేపడుతున్నారు. కంకర్‌బాగ్‌లో చాలా చోట్ల మూడు నుంచి నాలుగు అడుగుల లోతులో నీరు నిలిచిపోయింది.
ఇక ముఖ్యమంత్రి సహా మంత్రుల నివాసాలున్న రాజేంద్ర చౌక్‌లో మాత్రం నీళ్లు కనిపించడం లేదు. కార్లు వేగంగా వెళుతుండటంతో దుమ్ము ఎగిసిపడుతోంది.
వీఐపీల ప్రాంతం.. మిగిలిన ప్రాంతం
ముఖ్యమంత్రి నివాసం నుంచి కిలోమీటరు దూరంలో 1 అన్నే రోడ్ వద్ద హజ్ భవన్ ఉంది. ఇది వీఐపీ ప్రాంతాన్ని, సాధారణ ప్రాంతాన్ని వేరు చేస్తుంది.
ఇక్కడున్న వందలాది మురికివాడలు నీట మునిగాయి. అక్కడ ప్రాథమిక పాఠశాల చుట్టూ నల్లటి నీరు చేరింది. మురికివాడల్లోని ప్రజలు తమ సామాన్లతో రోడ్డున పడ్డారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు వారికి ఆహార పదార్థాలను అందిస్తున్నాయి. ఈ రహదారిలో ప్రముఖుల నివాసాలు లేవు.
ప్రముఖులుండే ప్రాంతం ఎందుకు నీట మునగలేదు?
కొంతమంది యువకులు దేశరత్న మార్గ్‌ను అన్నే రోడ్‌కు అనుసంధానించే కూడలిపై నిలబడ్డారు. వారిలో ఒకరైన అంగద్ బీబీసీతో మాట్లాడుతూ, ''ప్రధాన రహదారిపై ఒక్క నిమిషం కూడా నీరు నిలిచిలేదు. కానీ, మా మురికివాడలు నీళ్లలో మునిగిపోయాయి. ఎందుకంటే ఇది లోతట్టు ప్రాంతం. రహదారిపై నీళ్లు నిలిచిపోకుండా అధికారులు వెంటనే యంత్రాలను తీసుకొచ్చి నీళ్లను తోడేశారు. చెత్తను తొలగించారు. ఇప్పుడు నీళ్లు పోయాయి. ఇక్కడ సహాయక చర్యలు వెంటనే ప్రారంభించారని మీరు అనుకోవచ్చు. కానీ, ఇది ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి నివాసాలు ఉండే ప్రాంతానికి, గవర్నర్ హౌస్‌కు పక్కనే ఉంది'' అని ఆయన చెప్పారు.
ఎత్తైన భూభాగం
పట్నా మొత్తం మునిగిపోతున్నప్పుడు వీఐపీ ప్రాంతం మాత్రం ఎందుకు జలమయం కాలేదు?
పట్నాలోని నిట్ సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేస్తున్న ఎన్ఎస్ మౌర్య దీనిపై మాట్లాడుతూ, ''ఈ నగరం మూడు వైపులా నదులతో చుట్టుముట్టి ఉంది. జలమయమైన ప్రాంతాలన్నీ లోతట్టు ప్రాంతాలు. రాజేంద్ర నగర్ ఇంతకు ముందు రిజర్వాయర్‌గా ఉండేది. అయితే ఇప్పుడు అక్కడ నివాసాలు వచ్చాయి. కాలనీలు ఏర్పడ్డాయి. ఈ లోతట్టు ప్రాంతాల కంటే వీఐపీ ప్రాంతం ఎక్కువ ఎత్తులో ఉంది. అందువల్లే అక్కడ నీరు నిలవడం లేదు'' అని విశ్లేషించారు.
ఇన్టాక్ (ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చర్ హెరిటేజ్) పట్నా కన్వీనర్ జేకే లాల్ మాట్లడుతూ '' ప్రముఖులుండే ప్రాంతం ఎత్తైన ప్రదేశంలో ఉంది. మిగిలిన ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ రద్దీ చాలా తక్కువ. నగరంలో పాత డ్రైనేజీ వ్యవస్థ ధ్వంసమైంది. కానీ, ఇక్కడ అలాగే కొనసాగుతోంది'' అని చెప్పారు.
ఇక్కడ మెరుగ్గా డ్రైనేజీ వ్యవస్థ
బ్రిటిష్ కాలంలో దీనికి 'న్యూ పట్నా' అని పేరు పెట్టారు. 1911లో కింగ్ జార్జ్-5 ఒడిశా, బీహర్‌లతో కూడిన కొత్త ప్రావిన్స్‌ను ఒకే లెఫ్టినెంట్ గవర్నర్‌తో ఏర్పాటు చేయనున్నట్లు దిల్లీ కోర్టులో ప్రకటించారు. ఈ ప్రావిన్స్ రాజధానిగా పట్నాను ప్రకటించారు.
1912లో లార్డ్ హార్డింగ్ ఒడిశా, బీహర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్నప్పుడు, బ్రిటిష్ వారు కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా ఈ ప్రాంతం(ప్రస్తుతం వీఐపీలు ఉండే ప్రాంతం)లో గవర్నర్ హౌస్ కట్టడానికి పునాది వేశారు. ఈ భవనం 1917 లో పూర్తయింది. ప్రారంభంలో ఇది 100 ఎకరాల్లో విస్తరించి ఉండేది. అయితే, 1970 లో జంతు ప్రదర్శనశాల కోసం దీని నుంచి కొంత భూమి కేటాయించారు.
సీనియర్ జర్నలిస్ట్ లవ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ''1967 వరదలలో, గవర్నర్ హౌస్ మార్గ్, దేశరత్న మార్గ్ ప్రతిచోటా వరదలు వచ్చాయి. ఆ తరువాత ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడింది. ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం ఎప్పుడూ వరద ముప్పుకు గురికాలేదు'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)