You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ఐఫోన్ నన్ను 'గే'గా మార్చింది' అంటూ యాపిల్ కంపెనీపై కేసు వేసిన రష్యన్... 10 లక్షల పరిహారానికి డిమాండ్
ఐఫోన్లోని ఒక యాప్ తనను స్వలింగ సంపర్కుడిగా మార్చిందని ఆరోపిస్తూ యాపిల్ సంస్థపై ఒక రష్యన్ కేసు పెట్టారు. దీనివల్ల తనకు మానసికమైన, నైతికపరమైన హాని జరిగిందని, ఇందుకు పరిహారంగా పది లక్షల రూబుళ్లు (10.97 లక్షల రూపాయలు) చెల్లించాలని డిమాండ్ చేశారు.
'గేకాయిన్' క్రిప్టో-కరెన్సీకి సంబంధించిన ఒక ఘటనతో తనకు ఇలా జరిగిందని ఆయన ఆరోపించారు. ఐఫోన్లో యాప్ ద్వారా తాను బిట్‌కాయిన్‌కు ఆర్డర్ ఇచ్చానని, కానీ 'గేకాయిన్' అనే క్రిప్టో కరెన్సీ తనకు వచ్చిందని ఫిర్యాదులో చెప్పారు.
తనకు అందిన గే కాయిన్ క్రిప్టో కరెన్సీపై "ప్రయత్నించకుండా అభిప్రాయానికి రావొద్దు" అనే నోట్ ఉందని ఫిర్యాదిదారు ఆరోపించారు. ప్రయత్నించకుండా దేనిపైన అయినా అభిప్రాయానికి ఎలా రాగలనని తాను అనుకున్నానని, అందుకే స్వలింగ సంపర్కం సంబంధాల ప్రయత్నాలు చేయాలని నిర్ణయించుకొన్నానని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
"ఇప్పుడు నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఈ విషయం మా తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా జీవితం దెబ్బతింది. నేనెప్పటికీ తిరిగి సాధారణంగా ఉండలేను" అని ఆయన ఆరోపించారు. యాపిల్ తప్పుడు పనితో తనను హోమోసెక్సువాలిటీ వైపు నడిపించిందన్నారు.
17న విచారణ
నగదుకు ఆన్‌లైన్ రూపం మాదిరి 'క్రిప్టో కరెన్సీ' అనేది వర్చువల్ మనీ. బిట్‌కాయిన్, గే కాయిన్ అనేవి రెండు క్రిప్టోకరెన్సీలు. ఫిర్యాదిదారు ఒక థర్డ్ పార్టీ యాప్‌పై ఆర్డర్ ఇచ్చారు.
యాపిల్‌పై ఆయన సెప్టెంబరు 20న కేసు వేశారు. కేసుపై కోర్టు ఈ నెల 17న విచారణ జరపనుంది.
ఈ అంశంపై స్పందన కోసం యాపిల్‌ను బీబీసీ సంప్రదించగా, ఆ సంస్థ నుంచి స్పందన రాలేదు.
రష్యాలో స్వలింగ సంపర్కం నేరం కాదు, కానీ..
రష్యాలో స్వలింగ సంపర్కం నేరం కాదని 1993లో ప్రకటించారు. కానీ ఇప్పటికీ స్వలింగ సంపర్కం పట్ల చులకనభావం, వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి.
స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించే సమాచార వ్యాప్తిని నిషేధిస్తూ 2013లో రష్యా చట్టం తీసుకొచ్చింది.
అధికారికంగా చూస్తే మైనర్లలో "సంప్రదాయేతర జీవనశైలిని ప్రోత్సహించడాన్ని" ఈ చట్టం నిషేధిస్తుంది. వాస్తవానికి ఎల్‌జీబీటీ వాదాన్ని ఇది నిషేధిస్తుంది. ఈ వాదాన్ని వ్యాప్తిచేస్తున్న అనేక మందిపై గత సంవత్సరం దాడి చేసి, చంపేశారు.
ఇవి కూడా చదవండి:
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- ఉత్తర్ ప్రదేశ్‌లో వరదలు: ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసి ఎలా ఉంది...
- ఐఫోన్ అంత స్మార్ట్ ఎలా అయ్యింది?
- ఐఫోన్11: భారత మార్కెట్లో యాపిల్ ఫోన్ల ఆధిపత్యం సాధ్యమేనా
- స్మార్ట్ ఫోన్లు మన మాటలు, సంభాషణలను రహస్యంగా వింటున్నాయా?
- ఐఫోన్ టెన్ ఎస్ : ఈ-సిమ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ఉపయోగపడుతుంది?
- యాపిల్: 12 ఏళ్ల పాటు నష్టాలు చూసిన ఈ కంపెనీ నేడు ప్రపంచంలో నం.1
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- మాంసం తింటే క్యాన్సర్ వస్తుందనే ప్రచారం నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)