You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కారు చౌకగా ఇల్లు... ఇటలీలో ‘80 రూపాయలకే ఇల్లు’ పథకం
- రచయిత, ఆండ్రియా సవోరోని నెరీ
- హోదా, బీబీసీ వర్క్‌లైఫ్
ఇటలీలో ఇల్లు కొనుక్కోవాలనుకుందా? ధర ఒక యూరో మాత్రమే, అంటే భారత కరెన్సీలో అటూఇటుగా రూ.80.
ఆ దేశంలో ఉన్న సిసిలీ ద్వీపంలోని సంబూకా అనే గ్రామం ఈ ‘ఒక్క యూరోకే ఇల్లు పథకం’ ప్రకటించింది.
నగరాలు, విదేశాలకు ప్రజలు వలస వెళ్లిపోతుండటం కారణంగా యూరప్‌లోని చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.
ప్రస్తుతం సంబూకా కూడా ఇదే సమస్య ఎదుర్కొంటోంది. ఆ గ్రామంలో ఉండేవారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పుడు ఆ గ్రామ జనాభా సుమారు 5,800 మాత్రమే.
జనాభా పెంచేందుకు ఆ గ్రామ పాలక సంస్థ ఓ ఉపాయం ఆలోచించింది. ఖాళీగా ఉన్న పాతబడిపోయిన, శిథిలావస్థకు చేరిన ఇళ్లను యజమానుల దగ్గరి నుంచి కొనుగోలు చేసింది.
వాటిని కొత్తవారికి ఒక్క యూరో ధరకే అమ్మాలని నిర్ణయించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడివారైనా ఈ ఇళ్లను కొనుక్కొని, సంబుకాలో నివసించవచ్చు.
అయితే, కొనుగోలు విషయంలో ఓ షరతు ఉంది.
కొన్నవారు మూడేళ్లలోగా ఆ ఇళ్లకు మరమ్మతులు చేయించుకోవాలి.
ఈ పనులకు ఖర్చు భారీగానే అయ్యే అవకాశం ఉంది.
‘ఒక్క యూరోకే ఇల్లు’ పథకానికి మంచి స్పందన వచ్చింది. దీన్ని వినియోగించుకుని, మిగతా ప్రాంతాల నుంచి వచ్చి సంబూకాలో కొందరు నివాసం ఉంటున్నారు.
తాము విక్రయించిన 16 ఇళ్లను విదేశీయులే కొనుగోలు చేసినట్లు సంబూకా మేయర్ లియనార్డో సికాసియో చెప్పారు.
తమ ప్రణాళిక విజయవంతమైందని, ఈ పథకాన్ని వినియోగించుకుని వివిధ దేశాలకు చెందిన కళాకారులు సంబూకాకు వచ్చారని ఆయన వివరించారు.
‘‘ఇళ్లు కొన్నవారిలో కొందరు సంగీతకారులు, నాట్యకారులు, పాత్రికేయులు, రచయితలు ఉన్నారు. వాళ్లకు మంచి అభిరుచులు ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వాళ్లు గొప్పగా ఆస్వాదిస్తారు’’ అని సంబూకా డిప్యుటీ మేయర్, ఆర్కిటెక్ట్ జోసెఫ్ కైసియోపో వ్యాఖ్యానించారు.
ప్రపంచం నలుమూలల నుంచి తమ గ్రామంలో ఉండేందుకు జనాలు వస్తుండటం ఆనందం కలిగిస్తోందని స్థానికురాలు మారిసా మోంటల్బోనో అన్నారు. ఇప్పటివరకూ గ్రామంలో 60 ఇళ్లు అమ్ముడయ్యాయని చెప్పారు.
‘ఒక్క యూరోకే ఇల్లు’ పథకంతో సంబూకాకు మంచి ప్రచారం వచ్చింది. ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి గ్రామంలోని 40 ఇళ్లు మార్కెట్ ధరకే అమ్ముడుపోయాయి.
సంబూకాలో ఇళ్లు కొనుక్కున్నవారిలో విదేశీయులతోపాటు ఇటలీ నుంచి వలసవెళ్లిపోయినవారు కూడా ఉన్నారు.
గ్లోరియా ఓరిజీ అనే మహిళ కూడా వారిలో ఒకరు.
‘‘ఇటలీలోని మిలాన్‌లో నేను నివసించేదాన్ని. ఆ తర్వాత చాలా ఏళ్లు ఫ్రాన్స్‌లో ఉన్నా. కానీ, ఇటలీలో ఇల్లు తీసుకోవాలన్న కోరిక ఎప్పుడూ ఉండేది. సంబూకాలో ఉండే ప్రకృతి సౌందర్యం నాకు చాలా ఇష్టం’’ అని ఆమె వివరించారు.
‘‘సంబూకా ప్రజలు ఆత్మీయంగా ఉంటారు. మనసువిప్పి మాట్లాడతారు. అందుకే ఈ గ్రామంలో ఇల్లు కొనాలని నిర్ణయించుకున్నా. ఇక్కడికి వచ్చిన మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా. కానీ, ఆ తర్వాత నా జీవనశైలి చాలా మెరుగైంది’’ అని గ్లోరియా ఓరిజీ చెప్పారు.
తమ గ్రామంలో ఖాళీగా ఉన్న ఇళ్లు తిరిగి జనంతో నిండిపోతుండటంపై సంబూకా మేయర్ లియనార్డో సికాసియో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇటలీలోని మిగతా గ్రామాలు కూడా సంబుకా నుంచి ప్రేరణ పొందుతున్నాయి. ఒక్క యూరోకే ఇల్లు’ పథకం లాంటివి తెచ్చే ఆలోచనలు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఇక చరిత్రను తిరగరాయాల్సిందేనా?
- వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'
- బెంగాల్లో అక్రమంగా ఉంటున్న అందరినీ 'బయటకు గెంటేస్తాం'- అమిత్ షా
- మహాత్మా గాంధీ: అహింసతో స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది నిజమేనా!
- గాంధీజీ లండన్‌లో చేతికర్రతో డాన్స్ చేసిన వేళ...
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- చైనా అభివృద్ధిలో విజేతలెవరు... అక్కడి పాఠ్య పుస్తకాల్లో కనిపించని చరిత్ర ఏంటి?
- ది జోకర్: నవ్వించాల్సినవాడు ఇంత విలన్ ఎందుకయ్యాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)