వైఎస్ జగన్: ‘కాపులు బీసీలా.. ఓసీలా? చంద్రబాబే చెప్పాలి’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, ys jagan/fb
కాపులకు అన్ని విధాలుగా ఎప్పుడూ అండగా ఉంటామని, ఎన్నికల్లో వారికి ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారని సాక్షి వెల్లడించింది.
మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మాదిరిగానే కాపు కార్పొరేషన్‌కు ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కేటాయించి పూర్తిగా ఖర్చు చేస్తామని చెప్పారు. అందుకే ఈ ఏడాది తొలి బడ్జెట్‌లో రూ.2 వేల కోట్లు కేటాయించామని, ఆ మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేస్తామన్నారు.
విపక్ష నేత చంద్రబాబు మాదిరిగా అబద్ధపు హామీలు ఇచ్చి కాపులను మోసం చేసే అలవాటు తనకు లేదని సీఎం స్పష్టం చేశారు. తాను ఏదైనా నేరుగా మాట్లాడతానని, అమలు చేయగలిగే హామీలే ఇస్తానని చెబుతూ మనస్సాక్షి చంపుకుని రాజకీయాలు చేయనని విస్పష్టంగా ప్రకటించారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాలుగో రోజు మంగళవారం కాపు రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని చంద్రబాబు చెబుతూ అవి అమలు చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
దీనికి సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇస్తూ కాపుల సంక్షేమానికి తాము నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చంద్రబాబు కాపులను ఏ విధంగా మోసం చేసిందీ సాదోహరణంగా వివరించారు. ఈ చర్చలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఇలా సాగింది.
కాపు రిజర్వేషన్లపై ఎలా మోసం చేశారన్నది చంద్రబాబు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, చంద్రబాబు అందులో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు.
అసలు కాపులు బీసీలా? ఓసీలా? ఏదో చెప్పలేని అద్వానపు స్థితిలో చంద్రబాబు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ పరంగా ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది. అందులో ఏ కులానికి పడితే ఆ కులానికి వేరేగా రిజర్వేషన్లు ఇచ్చే అధికారం ఎవరికీ లేదు. ఫార్వర్డ్ కులాలన్నింటిలోని ఈబీసీలందరికీ ఆ 10 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అంతేగానీ అందులో ఓ కులానికి 5 శాతమో మరెంతో వేరేగా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదు.
కోర్టులో ఎవరైనా చాలెంజ్ చేస్తే అది అమలు కాదని తెలిసినా చంద్రబాబు మోసం చేశారు. కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. చంద్రబాబు నిర్వాకం వల్ల కాపులకు నష్టం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్‌లో ఈబీసీలకు సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని జగన్ పేర్కొన్నట్లు సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, chandrababu/fb
'తెలంగాణ పాలకులతో జగన్ ప్రభుత్వం లాలూచీ'
ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి ప్రాజెక్టుల్ని నిలిపివేసి, గోదావరి జలాల తరలింపు పథకాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామి కావాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం అవివేకమని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారని ఈనాడు పేర్కొంది.
''తెలంగాణలో కాలువల ద్వారా నాగార్జునసాగర్ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోయడానికి రూ.50 కోట్లకుపైగా అయ్యే వ్యయంలో ఏపీ ఎందుకు వాటా చెల్లించాలి? అదే మొత్తంతో ఏపీలోని ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలి. రాష్ట్రంలోని ప్రాజెక్టుల్ని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా పక్క రాష్ట్ర నేతలతో మిలాఖత్ అవడమేంటి? తెలంగాణ పాలకులతో లాలూచీ పడి రాష్ట్ర సొమ్ము దుబారా చేసే హక్కు జగన్‌కి ఎవరిచ్చారు? పెట్టుబడి మనది, ప్రయోజనం మరో రాష్ట్రానికా?'' అని ఆయన ధ్వజమెత్తారు.
చంద్రబాబు మంగళవారం శాసనసభ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అంతకు ముందు పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సాయంత్రం పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోను ఆయన మాట్లాడారు.
''జగన్ తన చెట్టుని తానే నరుక్కుంటున్నారు. పోలవరంపై వైకాపా నేతల మాటల్లోనే పొంతన లేదు. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్ర ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాలేదు. సహాయ, పునరావాస కార్యక్రమాలు రాష్ట్రం పరిధిలోనివేనని కేంద్రం అంటోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా మాట్లాడటం లేదు'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
''కాపులకు రిజర్వేషన్లపై మనల్ని తప్పుపడదామని ప్రయత్నించిన వైకాపాకి గట్టి కౌంటర్ ఇవ్వడంతో దిమ్మతిరిగి మరోమాట మాట్లాడలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టేయడంతో ప్రయత్నామ్నాయం చూడలేకపోయారు.
కేంద్రం తీసుకువచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ తెదేపా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని గట్టిగా చెప్పేసరికి జగన్ గొంతు మూగబోయింది'' అని శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు. ''శాసనసభలో ప్రభుత్వ అసత్య ప్రచారాన్ని, ఆరోపణల్ని సమర్థంగా తిప్పికొట్టడంలో మరింత రాటుదేలాలి.
సభలో మనం ఇస్తున్న కౌంటర్లతో వైకాపా సభ్యులు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడానికి ఆరు నెలల సమయం ఇద్దామమనుకున్నా. వైకాపా సభ్యులు హుందా మరచి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలోను, బయటా వారి నడవడికే ప్రజల్లో అభాసుపాలు చేస్తోంది'' అని ఆయన పేర్కొన్నారని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Telanganacmo/fb
తెరపైకి తెలంగాణ మున్సిపల్ సర్వీస్
కొత్త మున్సిపల్ చట్టంలో కీలక ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. ఉద్యోగుల సర్వీసు రూల్స్‌కు సంబంధించి ప్రస్తుతం విడివిడిగా ఉన్న నిబంధనలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని భావిస్తోందని సాక్షి పేర్కొంది.
ఇప్పటివరకు అర్బన్ అథారిటీలు, జీహెచ్‌ఎంసీ, నగరపాలక సంస్థల్లోకి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు బదిలీపై వచ్చే అవకాశం ఉండేది కాదు. కానీ ప్రతిపాదిత చట్టం ప్రకారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ, పట్టణాభివృద్ధి సంస్థలు... ఏవైనా ఒకటే సర్వీసు రూల్స్ ద్వారా ఏ ఉద్యోగి ఎక్కడికైనా బదిలీపై వెళ్లే సౌలభ్యాన్ని కల్పించనుంది.
ఈ క్రమంలో జోనల్, మల్టీజోనల్ మౌలిక సూత్రాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. దీన్ని 'తెలంగాణ మున్సిపల్ సర్వీసెస్'గా నిర్వచిస్తూ కొత్త చట్టంలో పొందుపర్చనుంది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా మున్సిపల్ చట్టం-2019 బుధవారం కేబినెట్ ముందుకు రానుంది. రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ఆమోదముద్ర పడనుంది.
పౌరసేవల్లో పారదర్శకత..అధికారుల్లో జవాబుదారితనం.. ప్రజాప్రతినిధుల్లో అంకితభావం.. స్థూలంగా ఇదీ కొత్త పురపాలకచట్ట నిర్వచనం. ఇల్లు కట్టినా.. కూల్చినా, పుట్టినా.. గిట్టినా అమ్యామ్యాలు సమర్పించుకుంటే తప్ప ధ్రువపత్రాలు చేతికందని పరిస్థితి నగర/పురపాలికల్లో నెలకొంది.
ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి, పురపాలనను గాడిలో పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పురచట్టాన్ని తేవాలని నిర్ణయించడం తెలిసిందే. పురపాలనలో అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం కల్పిస్తున్న ఈ చట్టంలో మరో ముఖ్య సంస్కరణను కూడా ప్రవేశపెట్టనున్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధిలో ఆయా పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలనూ భాగస్వామ్యులను చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రతి మున్సిపాలిటీకి ఓ అభివృద్ధి సలహా కమిటీని ఏర్పాటు చేయాలని చట్టంలో ప్రతిపాదిస్తున్నారు. ఈ కమిటీలో పట్టణాల్లోని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఔత్సాహికులకు అవకాశం కల్పించి వారి సలహాలను కూడా స్వీకరించనున్నారని సాక్షి తెలిపింది.

ఫొటో సోర్స్, Telangana state police/fb
హైదరాబాద్‌లో నైజీరియన్లపై నజర్
హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్లపై పోలీస్‌శాఖ నజర్ పెట్టిందని నమస్తే తెలంగాణ వెల్లడించింది. నగరంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడుతున్నా నైజీరియన్లే కీలక నిందితులుగా ఉంటున్నారని విచారణలో తేలడంతో.. వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.
మయన్మార్ రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారులతోపాటు నైజీరియన్లు, ఇతర విదేశీయులుండే ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ వారి వివరాలు సేకరిస్తున్నది. అందులోభాగంగా మంగళవారం దాదాపు 15 ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించారు.
70 మంది విదేశీయులను విచారించగా, 23 మంది వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించామని సీపీ అంజన్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే అక్రమంగా హైదరాబాద్‌లో ఉంటున్న 93 మంది విదేశీయులను గుర్తించి వారి పాస్‌పోర్టులను సైతం రద్దు చేసినట్టు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి ఇటీవల మీడియాతో చెప్పారు.
దక్షిణాఫ్రికా, కెన్యా, నైజీరియా వంటి దేశాల నుంచి ఉన్నతవిద్య, పర్యాటకం, వ్యాపారం పేరిట భారత్‌లోకి ప్రవేశిస్తున్న నైజీరియన్లు, క్రమంగా దేశంలోని పెద్దపెద్ద నగరాలను అడ్డాగా మత్తుమందుల వ్యాపారం చేస్తున్నారు.
రాష్ట్రంలో నమోదవుతున్న సైబర్‌నేరాల వెనుక నైజీరియన్ల హస్తం ఉంటున్నది. అమాయకులైన కస్టమర్లకు ఫోన్ చేసి క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డుల వివరాలను తెలుసుకోవడం.. తర్వాత వాటిని క్లోనింగ్ చేసి డబ్బు కొల్లగొట్టే స్థాయినుంచి ఫిషింగ్ మెయిల్స్ పంపేవరకు వీరి నేర విధానం ఎప్పటికప్పుడు మారుతున్నది.
ఫేక్ మెయిల్ ఐడీలు, ఫేస్‌బుక్ అకౌంట్లు, ఇన్‌స్టాగ్రాం అకౌంట్లు సృష్టించి వాటిలో అందమైన అమ్మాయిల ఫొటోలను పెట్టి కవ్విస్తున్నారు. చాటింగ్‌లోకి దింపి, అవసరాలు ఉన్నాయని, విదేశాల నుంచి ఖరీదైన బహుమతులు పంపాను.. కస్టమ్ డ్యూటీ కట్టాలని, విదేశాల్లోజాబ్స్ ఇప్పిస్తామని ఇలా రకరకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని నమస్తే తెలంగాణ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








