You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సంక్రాంతి గంగిరెద్దులు: "డూడూ బసవన్నా... అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు"
- రచయిత, వి శంకర్
- హోదా, బీబీసీ కోసం
తెలుగు వారి ముఖ్యమైన పండుగల్లో ఒకటి సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో సంక్రాంతి జరుపుకుంటారు.
సంక్రాంతి సమయంలో తెలుగు పల్లెలన్నీ పాడిపంటలతో కళకళలాడుతుంటాయి. ఈ సంబరాల్లో రంగవల్లులు, పిండివంటలతో పాటు డూడూ బసవన్నలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది.
ఈ పండుగ వేళ వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన ఎద్దుల్లో బలిష్టమైన ఎద్దును ఎంచుకుని తాడిపెద్దుగా ప్రకటించేవారు. భవిష్యత్ సంపద పెంచే జంతువుగా తాడిపెద్దుకి ఆదరణ ఉండేది. అదే సమయంలో తాడిపెద్దులలో కొన్ని కాలం తీరిన ఎద్దులను గంగిరెద్దులుగా మార్చేవారు.
కొందరు ఈ గంగిరెద్దులను అందంగా అలంకరించడం, వాటిని ఊరూరా తిప్పి, విన్యాసాలు చేయడాన్ని జీవనోపాధిగా మార్చుకున్నారు.
వ్యవసాయం ఆధునికతను సంతరించుకున్నా సంప్రదాయంగా వచ్చిన గంగిరెద్దులాట మాత్రం ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కనిపిస్తోంది.
ఈ గంగిరెద్దులకు ముందుగానే శిక్షణనిస్తారు. ఆభరణాలు, రంగురంగుల వస్త్రాలను గంగిరెద్దుకు అలంకరిస్తారు.
"డూడూ బసవన్నా... అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు" అంటూ డోలు, సన్నాయి ఊదుతూ ఇంటింటికీ తిరుగుతారు.
ధనుర్మాసం నెలరోజులూ ఇలా సంచార జీవితం గడుపుతారు. రోజుకో ఊరిలో గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తారు.
తమతో పాటు గంగిరెద్దులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఇంకా చెప్పాలంటే తమకన్నా గంగిరెద్దుకి మెరుగైన సదుపాయాలను కల్పిస్తారు. వాటికోసం దోమతెరలను కూడా కడతారు. గ్రామాల్లోని రైతులు ధన, ధాన్య రూపాల్లో ఇచ్చే సహాయాన్ని అందుకుంటారు. వారిని ఆశీర్వదిస్తూ ముందుకు సాగుతారు.
రానురాను గంగిరెద్దులకు ఆదరణ తగ్గుతోందని, పోషణ భారమవుతోందని పొట్టియ్య అనే కళాకారుడు తెలిపారు. కానీ వారసత్వంగా వచ్చిన ఈ కళను వదిలేయలేక ఇంకా కొనసాగిస్తున్నామని ఆయన అన్నారు.
గంగిరెద్దులాట సంప్రదాయాలకు అద్దంపట్టే కళారూపమని సాంస్కృతిక పరిశోధకుడు రామకృష్ణ పేర్కొన్నారు. సంక్రాంతి అంటేనే సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసుకోవడమని, అందులో గంగిరెద్దులకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆయనన్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)