Kumbh Mela: 12 కోట్ల మంది తరలి వచ్చే భారీ వేడుకకు ఘనమైన ఏర్పాట్లు

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి, ప్రయాగ్‌రాజ్ నుంచి

ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా 'కుంభమేళా'కుపేరుంది. ప్రయాగ్‌రాజ్‌(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధ కుంభమేళా సందడి మొదలైంది.

జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ మహా ఉత్సవంలో భాగంగా దాదాపు 12 కోట్ల మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమంలో స్నానాలు ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం.

మరి కోట్లాది మంది భక్తులు పాల్గొనే ఈ మహోత్సవానికి ఏర్పాట్లు ఎలా చేశారు?

తొలి రోజు కోటిన్నర నుంచి 2 కోట్ల మందికి సరిపోయేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

అయితే, అధికారులకు అసలైన సవాల్ ఫిబ్రవరి 4. త్రివేణి సంగమం వద్ద స్నానాలకు అది అత్యంత పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఆ ఒక్క రోజే మూడు కోట్ల మంది తరలివస్తారని అంచనా.

ఇది అర్ధ కుంభ మేళా. ఇది ఆరేళ్లకోసారి జరుగుతుంది. 12 ఏళ్లకోసారి పూర్ణ కుంభ మేళా జరుగుతుంది. 144 ఏళ్లకోసారి (12 పూర్ణ కుంభ మేళాల తర్వాత) మహా కుంభమేళా నిర్వహిస్తారు. 2013లో మహా కుంభమేళా జరిగింది.

అయితే, ఇప్పుడు జరుగుతున్నది పేరుకు మాత్రమే అర్ధ కుంభ మేళా. దీనికి 2013 మహా కుంభమేళా కంటే ఎక్కువ మంది తరలివస్తారని అంచనా.

వచ్చిన పర్యటకులు ఎక్కడుండాలి?

పర్యటకుల కోసం నది పరిసర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో గుడారాలు ఏర్పాటు చేసింది. ఆ గుడారాల్లో అన్ని రకాల వసతులు కల్పించారు.

ఈ ఉత్సవంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసేందుకు వేలాది మంది అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.

ఇక్కడ ఏర్పాట్లు చేసేందుకు ఏడాది నుంచి పనిచేస్తున్నామని సీనియర్ అధికారి రాజీవ్ బీబీసీకి చెప్పారు.

దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు వేసిన టెంట్ల కోసం దాదాపు 6,000 సంస్థలు స్థలాన్ని కేటాయించాయని ఆయన తెలిపారు.

దాదాపు, 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మేళా జరుగుతుందని ఆయన వివరించారు.

అక్కడికి ఎలా చేరుకోవాలి?

ఎన్నో శతాబ్దాలుగా కుంభమేళా జరుగుతోంది. కానీ, గత కొన్ని దశాబ్దాల క్రితం నుంచే ఈ మేళాను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. 2001లో తొలిసారిగా ఇక్కడ మహా కుంభ మేళా జరిగింది.

ఈ భారీ వేడుక నిర్వహణ కోసం ఈసారి రూ.2,800 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

ఈ మేళా కోసం ఏడాది కాలంగా అలహాబాద్‌లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. విమానాశ్రయాన్ని ఆధునీకరించారు.

పెద్దఎత్తున రోడ్ల విస్తరణ చేపట్టారు. కొత్త ఫ్లై ఓవర్లు నిర్మించారు. మేళా జరిగే ప్రాంతంలో 300 కిలోమీటర్ల రోడ్లు వేశారు. దాదాపు 5 లక్షల కార్లకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.

దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.

"కుంభమేళా జరిగే సమయంలో దాదాపు 35 లక్షల మంది రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. అలహాబాద్‌ చుట్టుపక్కల ఉన్న 8 స్టేషన్లను విస్తరించాం, సౌకర్యాలను మెరుగుపరిచాం" అని రైల్వే విభాగం అధికార ప్రతినిధి అమిత్ మాలవ్య వివరించారు.

ఈ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్‌లో గత కుంభ మేళా సందర్భంగా తొక్కిసలాట జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.

స్టేషన్‌లో కొత్తగా చేసిన ఏర్పాట్లను నన్ను తీసుకెళ్లి చూపించారు.

కొత్తగా ఓ ప్లాట్‌ఫారం, ఒక ప్లాట్‌ఫారం నుంచి మరో ఫ్లాట్‌ఫారం మీదకు వెళ్లేందుకు పాదచారుల కోసం భారీ వంతెన నిర్మించారు.

కుంభమేళా సందర్భంగా ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఇతర ప్రాంతాల నుంచి 5000 మంది సిబ్బందిని రప్పించామని ఆయన చెప్పారు.

పోలీసు భద్రత

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. 30 వేల మందికి పైగా పోలీసులతో పాటు, పారామిలిటరీ బలగాలను కూడా మోహరించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం వేలాది మంది పోలీసులు రంగంలోకి దిగారు.

"తొక్కిసలాటలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు గట్టి చర్యలు చేపట్టాం. తనిఖీల కోసం ప్రత్యేకంగా చెక్‌పోస్టులు, సెక్యూరిటీ బారికేడ్లు ఏర్పాటు చేశాం" అని సీనియర్ పోలీసు అధికారి కవింద్ర ప్రతాప్ సింగ్ వివరించారు.

జనాల కదలికలను పరిశీలించేందుకు తొలిసారిగా కృత్రిమ మేధను (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్) వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారు.

1,000 సీసీ కెమెరాలతో ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు? ఎక్కడ దారి మళ్లించాలి? అన్నది నిర్ణయిస్తామని పోలీసు శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు చేసేందుకు భారీ సంఖ్యలో మైకులు ఏర్పాటు చేశారు. తాజా సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విటర్‌లోనూ పెడతామని అధికారులు చెబుతున్నారు.

ఆహారం ఎలా?

చాలామంది పర్యటకులు ఒకటి రెండు పూటలకు ఆహార పదార్థాలు వెంట తెచ్చుకుంటారు.

కొందరు భక్తులు ఈ మేళా పూర్తయ్యే దాకా ఇక్కడ ఏర్పాటు చేసిన క్యాంపుల్లో నెల రోజులూ ఉంటారు.

అలాంటి వారికి ఆహార పదార్థాలు, నిత్యావసర సరకులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. బియ్యం, పిండి, చక్కెర, కిరోసిన్ వంటి సరకులు పంపిణీ చేసేందుకు 5 గోదాములు, 160 దుకాణాలు ఏర్పాటు చేశారు.

మత సంస్థలు ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉండేవారికి ఆ సరకులన్నీ ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇతర ప్రాంతాల్లో ఉండే పేదలకు రాయితీ ధరలకే అందిస్తామని ఉత్తరప్రదేశ్ పౌర సరఫరాల శాఖ అధికారి అప్రితా ఉపాధ్యాయ్ చెప్పారు.

రాయితీ సరుకుల సరఫరాకు సంబంధించి ఇప్పటికే 1,50,000 మంది కోసం కూపన్లు పంపిణీ చేశారు. వారికి 2 కిలోల బియ్యం, 3 కిలోల పిండి, 7.5 కిలోల చక్కెర, 4 లీటర్ల కిరోసిన్ అందిస్తారు.

పరిశుభ్రమైన నీరు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

వైద్య సదుపాయాలు

కుంభమేళా జరిగే ప్రాంతంలో ఒక 100 పడకల ఆస్పత్రితో పాటు, 10 చిన్న ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. అవి డిసెంబర్ 1 నుంచే పనిచేస్తున్నాయి.

193 మంది వైద్యులు, మరో 1,500 మందికి పైగా నర్సులు, దంత వైద్యులు, అందుబాటులో ఉంటారు. అంతేకాదు, 80 మంది ఆయుర్వేద వైద్యులు కూడా సేవలు అందిస్తున్నారని అధికారులు తెలిపారు.

86 అంబులెన్సులు, 9 రివర్ అంబులెన్సులు, ఒక ఎయిర్ అంబులెన్సు కూడా అందుబాటులో ఉంచినట్లు వైద్యాధికారి డాక్టర్ పాలివాల్ తెలిపారు.

టాయిలెట్ల మాటేమిటి?

ఈ మేళా జరిగే ప్రదేశంలో 1,22,000 టాయిలెట్లు, 20,000 చెత్త బుట్టలు ఏర్పాటు చేశారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 22,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో ఉంటారని అధికారులు తెలిపారు.

అయితే, టాయిలెట్లు ఏర్పాట్లు చేశారు కానీ, వాటిలో నీళ్లు ఉండట్లేదన్న విమర్శలు వచ్చాయి. ఆ సమస్యను ఇప్పటికే పరిష్కరించామని, ఇక ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూస్తామని డాక్టర్ పలివాల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)