You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టెక్నాలజీ షో-2019: ఫోల్డబుల్ ఫోన్... కర్టెన్‌లో చుట్టేయగలిగే టీవీ... ప్రపంచాన్ని మార్చేసే ఆవిష్కరణలు
150 దేశాలు..
4,500 సంస్థలు
24 విభాగాలకు చెందిన ఉత్పత్తులు
250 సమావేశాలు..
1,82,000 మంది టెక్ ప్రతినిధులు
25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రదర్శన..
ఇవన్నీ కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్)-2019 గణాంకాలు. తయారీ సంస్థలు, పంపిణీదారులు, విక్రేతలు, కొనుగోలుదారులు, ఇంజినీర్లు, విశ్లేషకులు.. ఒకరేమిటి? ప్రపంచం నలుమూలల నుంచీ సాంకేతికరంగానికి చెందినవారు హాజరైన భారీ కార్యక్రమం ఇది. ఏటా నిర్వహించేదే అయినా ఏదో విశిష్టత. అందుకేనేమో దీన్ని టెక్ ప్రియులంతా పండుగలా భావిస్తారు.
ఈ ఏడాది జనవరి 8 నుంచి 11 వరకు అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో నిర్వహించిన సీఈఎస్-2019 భవిష్యత్ టెక్నాలజీలను, సమీప భవిష్యత్‌లో రానున్న గాడ్జెట్లను ప్రపంచానికి పరిచయం చేసింది.
ఏటా జనవరిలో నిర్వహించే ఈ ప్రదర్శనలో అనేక విభాగాలకు చెందిన కొత్త ఎలక్ర్టానిక్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తారు. ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ సంస్థలు ఈ ప్రతిష్ఠాత్మక షోలో కొత్త ఆవిష్కరణలతో సందడి చేశాయి.
ప్రధాన ఆకర్షణలు
* పూర్తిగా మడతపెట్టగలిగే స్మార్ట్ ఫోన్
రోయోల్ సంస్థ ఫ్లెక్సిపాయ్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెస్తోంది. సీఈఎస్-2019లో దీన్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేసింది. ఇప్పటికే చైనాలో విక్రయాలు ప్రారంభించారు. త్వరలో మిగతా దేశాల్లోనూ అందుబాటులోకి తేనుంది.
* కర్టెన్‌లా చుట్టేసే టీవీ
ఎల్‌జీ సిగ్నేచర్ సిరీస్ ఓలెడ్ టీవీ ఆర్(65ఆర్9) ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 65 అంగుళాల తెర ఉన్న ఈ టీవీ దిగువన ఒక బాక్స్ ఉంటుంది. టీవీ చూడడం పూర్తయ్యాక దీన్ని రోల్ చేసి ఆ బాక్స్‌లో సర్దేయొచ్చు. ఇలాంటి టెక్నాలజీ ఇదే ప్రథమం.
టీవీ పూర్తిగా చూడాలంటే మొత్తం తెరవాలి.. లేదంటే సగం వరకు, అంతకంటే తక్కువ భాగం వరకు కూడా మడత విప్పి చూసుకునే వీలుంది.
* 219 అంగుళాల భారీ టీవీ
శాంసంగ్ సంస్థ వాల్ 2.0 పేరుతో భారీ టీవీని లాంచ్ చేసింది. ఏకంగా 2019 అంగుళాల తెర కలిగి ఉండడం దీని ప్రత్యేకత.
* 8కే టీవీలు
శాంసంగ్, పానసోనిక్, టీసీఎల్ వంటి పలు సంస్థలు ఈ షోలో 8కే టెక్నాలజీ టీవీల సాంకేతికతలను పరిచయం చేశాయి.
* కార్లలో అమెజాన్ అలెక్సా
అమెజాన్ సంస్థకు చెందిన వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ అలెక్సాను తొలిసారి కార్లలో వినియోగించుకునేలా రూపొందించారు. ఎలక్ట్రిక్ కార్ల సంస్థ బైటాన్ రూపొందించిన కారులో దీన్ని వినియోగించారు. ఈ ఏడాది చివరినాటికి ఇలాంటి కార్ల ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఎవరు నిర్వహిస్తారు?
కంజ్యూమర్ టెక్నాలజీ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. టెక్నాలజీ రంగంలోని దిగ్గజ సంస్థల నుంచి చిన్నాచితకా సంస్థల వరకు అన్నీ ఇక్కడకొస్తాయి. తమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. త్వరలో అందుబాటులోకి తేబోయే నూతన సాంకేతికతలనూ ఆవిష్కరిస్తాయి. సాంకేతిక రంగానికి చెందిన వందలాది సెమినార్లు.. సభలు, సమావేశాలు జరుగుతాయి.
1967 నుంచి..
మొట్టమొదటిసారి సీఈఎస్ 1967లో న్యూయార్క్2లో జరిగింది. అంతకుముందు వరకు ఏటా షికాగోలో నిర్వహించే మ్యూజిక్ షోలోనే ఇలాంటి టెక్ ప్రదర్శనలు జరిగేవి. తొలిసారి 1967లో ఇలా ప్రత్యేకంగా కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్ షోను నిర్వహించారు.
ఆ తరువాత 1978 నుంచి 94 మధ్య ఏడాదికి రెండు సార్లు నిర్వహించేవారు. జనవరిలో లాస్ వెగాస్ లో.. జూన్ లో షికాగోలో నిర్వహించేవారు. 1995 నుంచి దాన్ని ఏడాదికి ఒకసారికే పరిమితం చేశారు.
ఎన్నో ఆవిష్కరణలకు వేదిక
ప్రపంచాన్ని మార్చేసిన ఎన్నో ఆవిష్కరణకు సీఈఎస్ వేదికగా నిలిచింది.
* వీడియో క్యాసెట్ రికార్డర్(వీసీఆర్) - 1970
* లేజర్ డిస్క్ ప్లేయర్ - 1974
* కాంపాక్ట్ డిస్క్ ప్లేయర్(సీడీ ప్లేయర్) - 1981
* డిజిటల్ వెర్సటైల్ డిస్క్(డీవీడీ) - 1996
* హైడెఫినిషన్ టెలివిజన్(హెచ్‌డీ టీవీ) - 1998
* శాటిలైట్ రేడియో - 2000
* ప్లాస్మా టీవీ - 2001
* బ్లూ రే డీవీడీ - 2003
* ఐపీ టీవీ - 2005
* ఓలెడ్ టీవీ - 2008
* ట్యాబ్లెట్లు, నోట్ బుక్స్, ఆండ్రాయిడ్ పరికరాలు - 2010
* డ్రైవర్2లెస్ కార్ టెక్నాలజీ - 2013
* 3డీ ప్రింటర్లు, వేరబుల్ టెక్నాలజీస్ - 2014
* 4కే యూహెచ్‌డీ, వర్చువల్ రియాలిటీ ఉత్పత్తులు - 2015
మళ్లీ ఎప్పుడు?
* 2020లో జనవరి 7 నుంచి 10 వరకు
* 2021లో జనవరి 6 నుంచి 9 వరకు
* 2022లో జనవరి 5 నుంచి 8 వరకు
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)