You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో బీబీసీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: ఉత్తర ప్రదేశ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయా, లేదా?
ఉత్తర ప్రదేశ్‌లో బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయా, లేదా? అక్కడ మహిళలపై నేరాల సంఖ్యలో మార్పు ఉందా? బీజేపీకి ఎంతమంది నాయకులు?... ఇలాంటి అనేక అంశాల గురించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే...
యూపీలో ఎన్‌కౌంటర్లపై...
యోగి: మా ప్రభుత్వంలో ఒక్క బూటకపు ఎన్‌కౌంటర్ కూడా జరగలేదని నా అభిప్రాయం.
సుప్రీంకోర్టు, హ్యూమన్ రైట్స్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను అక్షరాలా పాటించాలనే స్పష్టమైన నిర్దేశాలు ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఉన్నాయి.
ముఖ్యమంత్రిగానూ, రాష్ట్ర హోంశాఖను కూడా నేనే చూస్తున్నందు వల్ల కూడా నేను వారికి ఈ విషయం స్పష్టంగా తెలియజేశాను.
కానీ ఎవరైనా పోలీసులపై కాల్పులకు పాల్పడితే, దానికి జవాబుగా ఎదురుకాల్పులు జరగకుండా మీరు పోలీసులను అడ్డుకోలేరు.
బీబీసీ: తమపై బాగా ఒత్తిళ్లు ఉన్నట్టు కొన్ని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో..
యోగి: అలా ఏమీ కాదు, రెండేళ్ల క్రితం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉండేవి? మీరు అక్కడి గ్రామాలకు వెళ్లి అడగండి. మహిళలపై ఎలాంటి ఘోరాలు జరిగేవి? ఎలాంటి పరిస్థితులవి?
నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడం పోలీసుల పని. చట్టం పరిధిలోనే వారు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పోలీసులు చట్టప్రకారమే నడచుకుంటున్నారు. అలాగే నడచుకోవాలి కూడా.
బీబీసీ: కొన్ని కేసుల్లో పోలీసులు, అధికారులు కూడా చాలా ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. వాళ్లు కొన్ని నష్టాల్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బులంద్‌షహర్‌లో జరిగిన ఘటననే తీసుకుంటే, గోహత్య ఉదంతంలో కోపోద్రిక్తులైన ఒక గుంపు ఒక పోలీసు అధికారినే బాహాటంగా హత్య చేసింది.
యోగి: అది ఒక ఘటన మాత్రమే. ఆక్రోశం రెండు వైపులా ఉండటం సహజమే. అయితే, ఆ ఘటనను నివారించగలిగే వాళ్లం. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ ఘటనలో ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో వ్యక్తి కూడా మృతి చెందాడు. ఈ ఘటనలన్నింటిపై మేం లోతుగా దర్యాప్తు చేపట్టాం.
బీబీసీ: మీరు అధికారంలోకి రావడంతోనే గోహత్య విషయంలో కఠిన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో చాలా వధ్యశాలల్ని మీరు మూసేయించారు. దీనికి సంబంధించి రెండు ప్రశ్నలు - మొదటిది, ఈ కారణంతో కొన్ని చిన్న చిన్న గ్రూపుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ధోరణి పెరగలేదా? ఎవరు ఆవుల్ని తీసుకెళ్తున్నారో రోడ్లపై తనిఖీలు వాళ్లే చేస్తున్నారు?
యోగి: ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి అనుమతి ఎవరికీ లేదు. అయితే, రెచ్చగొట్టే చర్యలు ఎక్కడైనా జరిగినట్టయితే అలాంటి చోట్లలో సహజంగానే ఆక్రోశం వెల్లువెత్తడం కనిపిస్తుంది. దాన్ని కూడా నిలువరించే ప్రయత్నం చేస్తున్నాం. కఠినంగా అడ్డుకునేందుకు చర్యలు చేపడుతున్నాం.
బీబీసీ: ఇలాంటి వాటితో ఇతర మతాల వారిలో భయాలు తలెత్తాయి కదా?
యోగి: ఎలాంటి భయాలూ లేవు. బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్లర్లు జరిగినపుడు మైనారిటీ మతస్థుల్లో కూడా అభద్రతా భావం బలపడుతుంది. దాదాపు గత రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో ఎలాంటి మత కల్లోలాలూ జరగలేదు.
బీబీసీ: 2014 ఎన్నికలను నరేంద్ర మోదీ ఎన్నికలుగా భావించారు. 2019 ఎన్నికలను నరేంద్ర మోదీ అనంతర బీజేపీ ఎన్నికలుగా చూడొచ్చంటారా?
యోగి: బీజేపీకి ఒక నాయకుడున్నారు. పార్టీకి ఏకఛత్ర నాయకత్వం ఉంది. అది మోదీజీనే. పార్టీ మోదీ వెంటే ఉంది. ఆయన నాయకత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తుంది. బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
ఇవి కూడా చదవండి
- BBC INVESTIGATION: అలీగఢ్‌లో ముస్లిం యువకుల ఎన్కౌంటర్లో వాస్తవమెంత?
- యాపిల్ ఉద్యోగి కాల్చివేత: యూపీలో విచ్చలవిడి 'ఎన్కౌంటర్ల'కు ఇదొక ఉదాహరణ
- ‘యోగి’ తాను తవ్విన గోతిలో తానే పడ్డారా?
- గ్రౌండ్ రిపోర్ట్: మీరట్‌లో ‘దళితులపై హిట్ లిస్ట్’ నిజానిజాలు
- గ్రౌండ్ రిపోర్ట్: అనుమానం వస్తేనే.. కొట్టి చంపేస్తారా?
- ‘మా చావులకు కూడా మేమే సాక్ష్యాలు తీసుకురావాలా?’
- అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలు సాధ్యమేనా.. ఎవరేమంటున్నారు?
- చెరువులో 80 టన్నులు బంగారం
- మోదీపై రాహుల్ వేస్తున్న నిందలు సరే... నిజాలెక్కడ
- మీ పిల్లలకు టేబుల్స్ సులభంగా నేర్పించాలనుకుంటున్నారా.. ఈ పద్ధతి పాటించండి
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)