You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తాను తవ్విన గోతిలో ‘యోగి’ పడిపోయారా?
- రచయిత, శరత్ ప్రధాన్
- హోదా, సీనియర్ జర్నలిస్ట్
మన ప్రజాస్వామ్యంలో ఎన్‌కౌంటర్ అనేది ఇప్పుడు చాలా సాధారణమైన విషయం. నేరస్తుల గుండెల్లోకి నేరుగా తూటాలు దించేందుకు పోలీసులు వాడే శక్తిమంతమైన 'ఆయుధమే' ఎన్‌కౌంటర్. అయితే వీటిలో చాలా వరకు బూటకమనేది అనేక మంది వాదన.
హద్దు మీరుతున్న హింసను హింసతోనే అణచి వేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్లు అనిపిస్తోంది. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడుకునేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఎన్‌కౌంటర్లే ఏకైక మార్గంగా కనిపిస్తున్నట్లు ఉంది.
పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు అధికారులూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.
ఈ ఆరు నెలల యోగి పాలనలో ఈ విధంగా 433 'హత్యలు' జరిగినట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీటిని ప్రభుత్వం తమ పాలన విజయాలుగా చెప్పుకొంటోంది. శాంతి భద్రతలు మెరుగుపడుతున్నాయడానికి సాక్ష్యాలుగా చూపుతోంది.
మాట నిలబెట్టుకుందా..?
దాదాపు 22 కోట్ల జనాభాతో దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్.. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలతో తరచూ పతాక శీర్షికల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ నేర సంస్కృతి కట్టడి చేస్తామని ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ (భాజపా) హామీ ఇచ్చింది.
అయితే ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్యలో 3,000 అత్యాచార కేసులు నమోదైనట్లు క్రైం రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2,376 మాత్రమే. ఈ ఏడాది హత్యలు స్వల్పంగా తగ్గినప్పటికీ దాడులు, దోపిడీలు భారీగా పెరిగాయి. దళితులు, మహిళలపై నేరాలు పెచ్చుమీరాయి.
'యాంటీ రోమియో స్క్వాడ్'ను ఏర్పాటు చేసినప్పటికీ మహిళలపై నేరాలు ఏ మాత్రం తగ్గలేదు.
ఇవి కూడా చదవండి:
యోగిని కలవరపెడుతోంది ఇదేనా?
పెరుగుతున్న నేరాలు యోగిని కలవర పెడుతున్నాయని అధికారులు బీబీసీతో చెప్పారు. ఎన్‌కౌంటర్ అనేది దీనికి పరిష్కారంగా ఆయనకు కనిపిస్తోంది. 80వ దశకంలో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కూడా ఇదే విధంగా వ్యవహరించారు.
బందిపోట్లను పోలీసులు విచక్షణారహితంగా చంపుతున్నా చూసిచూడనట్లు ఉండి పోయారు. చివరకు రోజురోజుకు పెరిగిపోయిన హత్యలు నాడు విశ్వనాథ్ ప్రభుత్వం మెడకు చుట్టుకుని ఆయన పదవీకాలం మధ్యలోనే దిగి పోవాల్సి వచ్చింది.
45 ఏళ్ల యోగికి ఈ విషయాలు తెలియకుండా ఉంటాయని అనుకోలేం. ఓ మఠానికి మహంత్‌గా, 5 సార్లు ఎంపీగా ఎన్నికైన యోగి, దేశంలో ఒక విలక్షణ రాజకీయ వేత్తగా ఖ్యాతికెక్కారు.
దిల్లీని తాకుతున్న సెగ
ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న నేరాల సెగ ఇప్పుడు దిల్లీని తాకుతోంది. ఈ సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పనితీరుపై ప్రభావం పడొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులతో బీబీసీ మాట్లాడినప్పుడు ఈ ఎన్ కౌంటర్లు ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజారుస్తున్నట్లు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
''ఈ హత్యల వల్ల పోలీసుల ఖాతాలో ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగొచ్చు. కానీ ప్రభుత్వ విశ్వసనీయత మాత్రం మసకబారి పోతోంది'' అని ఓ యువ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.
తన పాలనలో 433 హత్యలు జరిగాయన్నట్టుగా యోగికి అర్థం కాగానే 'ఎన్‌కౌంటర్' నిర్వచనాన్ని మార్చారని అధికారులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారీ ఎవరో ఒకరు చనిపోయారని భావించనక్కర్లేదని ఆయన చెప్పారు.
''433 ఎన్‌కౌంటర్లలో 19 మంది నేరస్తులు మాత్రమే చనిపోయారు. 89 మంది గాయపడ్డారు'' అని చివరకు ప్రభుత్వం తేల్చింది. పోలీసుల్లో 98 మంది గాయపడగా, ఒకరు మరణించినట్లు అధికార గణంకాలు వెల్లడిస్తున్నాయి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)