You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోవధ వదంతులు.. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో రాళ్లదాడి.. ఇన్‌స్పెక్టర్ మృతి
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో కొందరు ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి చేయడంతో ఒక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మరణించారు.
స్థానిక జర్నలిస్టు సుమీత్ వర్మ ప్రకారం.. హిందూ సంస్థ కార్యకర్తలుగా చెప్పుకునే కొంతమంది ఆందోళనకారులు గోవధలకు నిరసనగా ఈ దాడికి పాల్పడ్డారు.
ఇవాళ ఉదయం జరిగిన రాళ్ల దాడిలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌తో పాటు ఒక ఆందోళనకారుడు కూడా మరణించారు.
గోవధ వదంతులు
ఈ రాళ్ల దాడి సైనా పోలీస్ స్టేషన్ పరిధిలోని చింగ్రావటి పోలీస్ ఔట్‌పోస్టు వద్ద చోటు చేసుకుంది.
గోవధ జరిగిందన్న ఆరోపణలతో హిందూ సంస్థలకు చెందిన కొందరు కార్యకర్తలు జంతు కళేబరాలతో చింగ్రావటి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఆ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ నెలకొంది.
ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీకి పాల్పడ్డంతో దానికి ప్రతిగా వాళ్లు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సుబోధ్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించగా, ఆయన ఆసుపత్రిలో మరణించారు.
ఈ సంఘటనలో ఒక పోలీసు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.
పోలీసులతో జరిగిన ఘర్షణలో ఇద్దరు హిందూ సంస్థల కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ ఝా స్పందిస్తూ.. ''ఉదయం 11 గంటల సమయంలో గోవధ జరిగిందని ఆరోపిస్తూ కొంతమంది బులంద్‌షహర్-సైనా రోడ్డుపై ఆందోళనకు దిగారన్న వార్తలు అందాయి. పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లగా, నిరసనకారులు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అనంతరం జరిగిన ఘర్షణల్లో ఎస్‌హెచ్‌ఓ సుబోధ్ కుమార్ మరణించారు'' అని వివరించారు.
ఈ సంఘటన నేపథ్యంలో బులంద్‌షహర్‌లో పోలీసులను భారీగా మోహరించారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)