You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వచ్చే ఎన్నికల్లో మహిళల ఓట్లే విజేతలను నిర్ణయిస్తాయా?
- రచయిత, మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్
- హోదా, బీబీసీ కోసం
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో ఇప్పుడు రాజకీయ నేతలు తమకు అధికారం కావాలంటే మహిళల మాట వినాల్సిందే అని అర్థం చేసుకున్నారు.
దీనిలో భాగంగానే ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా పార్టీలు బాలికలకు ఉచిత విద్య, పేద వధువులకు నగదు సహాయం, మహిళలకు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు మొదలైన హామీలు ఇచ్చాయి.
అందువల్లే రానున్న సాధారణ ఎన్నికల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని చేపట్టే ప్రచారాలే ఎన్నికల్లో జయాపజయాలను నిర్ణయిస్తాయని భావిస్తున్నారు.
ఇదంతా ఎలా సాధ్యమైంది?
దీనికి కారణం, పురుషాధిక్య, సంప్రదాయ సమాజంలో మహిళా ఓటర్ల ప్రభావం క్రమంగా పెరుగుతుండడమే.
లింగ సమానత్వం విషయంలో భారతదేశం చాలా వెనుకబడి ఉంది.
ఓట్ల విషయంలోనూ ఇది ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో మహిళలను పోలింగ్ కేంద్రాలకు రప్పించడం చాలా కష్టం.
దీనికి అనేక కారణాలున్నాయి.
భారతదేశంలో మహిళలు ఓటరుగా నమోదు చేసుకోవడమే తక్కువ. నమోదు చేసుకున్నా, గతంలో వాళ్లు ఓటు వేయడానికి బైటికి వెళ్లాలి అంటే వాళ్ల పెద్దలు నొసలు చిట్లించేవారు.
కొన్ని దశాబ్దాలుగా ఎన్నికల్లో ఓటు వేసే మహిళల శాతం పురుషుల శాతంతో పోలిస్తే 6-10 శాతం తక్కువగా ఉంది. దానికి తోడు భారతదేశంలో ప్రతి వేయి మంది పురుషులకు కేవలం 943 మంది మహిళలే ఉన్నారు.
ఈ సమస్యలన్నీ ఉన్నా, ఇటీవలి కాలంలో మాత్రం ఓటు వేసే స్త్రీపురుషుల శాతం మధ్య తేడా చాలా తక్కువైంది.
2004లో ఓటు వేసిన స్త్రీపురుషుల మధ్య తేడా 8.4 శాతం ఉండగా, 2014 నాటికి అది 1.8 శాతానికి తగ్గింది.
2012 నుంచి 2018 మధ్యభాగం వరకు జరిగిన 30 ప్రాంతీయ ఎన్నికల్లో మూడింట రెండొంతుల రాష్ట్రాలలో మహిళా ఓటర్లే పురుష ఓటర్ల కన్నా ఎక్కువగా ఓటు వేశారు.
బిహార్ ఉదాహరణ
ఉత్తర భారతదేశంలోని బిహార్ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో ఒకటి.
2015 ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్రంలో ఓటు వేసిన మహిళల సంఖ్య పురుషులకన్నా 7 శాతం ఎక్కువ.
ఆ రాష్ట్ర మహిళలు భర్తల తాగుడుతో విసిగిపోయారు.
ఎన్నికల సందర్భంగా వారు కోరింది ఒక్కటే - మద్య నిషేధం అమలు చేయమని.
ఆ ఎన్నికల్లో విజయం సాధించిన నితీష్ కుమార్, వారి కోరికను నెరవేర్చారు. రాష్ట్రంలో మద్యపానం, అమ్మకాలను నిషేధించారు.
వారి విజ్ఞప్తి మేరకు తీసుకువచ్చిన మద్యనిషేధం రాష్ట్రంలోని 10 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపుతోంది.
మద్యనిషేధం కారణంగా ఆ రాష్ట్రంలో గృహహింస, చిన్నచిన్న నేరాలు తగ్గిపోయాయని, డబ్బు వృధా తగ్గిందని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కార్లు, ట్రాక్టర్ల కొనుగోలుకు అవసరమైన నగదు లభ్యత పెరిగిందని వెల్లడించింది.
బిహార్ ఉదాహరణతో మేధా పాట్కర్‌లాంటి సామాజిక కార్యకర్తలు మహిళలపై హింసకు మద్యమే అతి పెద్ద కారణంగా పేర్కొంటూ ఇతర రాష్ట్రాలలో కూడా మద్యనిషేధం తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఎందుకు మహిళలు గతంలోకన్నా ఎక్కువగా ఓట్లు వేస్తున్నారు?
దేశంలో హఠాత్తుగా మహిళల్లో రాజకీయ చైతన్యం రావడానికి కారణమేంటి?
మహిళా అక్షరాస్యత పెరగడం ఖచ్చితంగా ఎక్కువ మంది మహిళలను పోలింగ్ బూత్‌లకు రప్పించింది. కానీ అది నెమ్మదిగా పెరిగింది. అయితే ఒక్క దశాబ్దం కాలంలోనే ఓటు వేసే మహిళల సంఖ్య ఇంత వేగంగా పెరగడానికి కారణమేంటి?
మహిళలపై జరిగిన హింసాత్మక సంఘటనలకు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడం వల్ల మహిళలు తమ భద్రత, హక్కుల కోసం ఓటు హక్కును ఉపయోగించుకోవడం చాలా అవసరమని భావించి ఉండవచ్చు.
దాంతో పాటు భారత ఎన్నికల కమిషన్ ఓటు వేయడానికి వెళ్లే మహిళలకు ఎదురయ్యే బెదిరింపులు, హింసను అరికట్టడంలో చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
దేశంలోని 9 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లలో ఇప్పుడు గతంలోకన్నా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది.
దాంతో పాటూ పూర్తిగా మహిళా అధికారులే నిర్వహించే పోలింగ్ స్టేషన్లు, మహిళలకు ప్రత్యేక క్యూలు మొదలైన ప్రయోగాలు కూడా విజయవంతమయ్యాయి.
2019 ఎన్నికల్లో రికార్డు సృష్టిస్తారా?
2019 ఎన్నికల్లో దేశ చరిత్రలోనే మొదటిసారిగా సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే మహిళల శాతం పురుష ఓటర్ల శాతాన్ని దాటి పోయే అవకాశం ఉంది.
దీని వల్ల రాజకీయ నాయకుల ప్రచార సరళిలోనే కాదు, ఆ తర్వాత ప్రభుత్వ విధానాలలోను అనేక మార్పులు రావచ్చు.
2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఆయన ప్రభుత్వం లక్షలాది పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఇచ్చింది.
మరో పథకం కింద ప్రతి కుటుంబానికి ఒక బ్యాంక్ అకౌంట్ తెరిచేలా చేశారు. ఇలా తెరిచిన కొత్త అకౌంట్లలో సగభాగం ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉన్న మహిళల పేరిటే ఉన్నాయి.
భవిష్యత్ చిత్రం
భారతదేశంలో మహిళా సాధికారత చాలా నెమ్మదిగా, కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తింటూ జరుగుతోంది.
పని ప్రదేశంలో మహిళల ప్రాతినిధ్యం విషయానికి వస్తే 131 దేశాల జాబితాలో భారతదేశం 121 స్థానంలో ఉంది.
పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులలో కేవలం ఎనిమిది శాతం మందే మహిళలు. గెలుస్తున్న వారిలో మహిళలు 11.5 శాతం మందే.
ఇది ముందు ముందు మారనుంది. మహిళా కార్యకర్తల కారణంగా రాజకీయ పార్టీలపై మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఒత్తిడి పెరుగుతోంది.
మహిళా ప్రజా ప్రతినిధుల వల్ల ఎక్కువ అభివృద్ధి, తక్కువ అవినీతిలాంటి లాభాలు ఉంటాయని ఇటీవలి పరిశోధన వెల్లడిస్తోంది.
ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యంలో లింగ సమానత్వం ఇంకా చాలా దూరంలోనే ఉన్నా.. బ్యాలెట్ బాక్స్, అధికార కేంద్రాలలో ఇప్పటికే వాళ్ల ప్రభావం కనిపిస్తోంది.
(మిలన్ వైష్ణవ్ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ పీస్‌లో దక్షిణాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జేమీ హింట్సన్ ఇదే సంస్థలో జూనియర్ ఫెలోగా ఉన్నారు)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)