You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నాలుగేళ్ల వయసులో నాన్నను చివరిసారి చూశాను.. మళ్లీ 20 ఏళ్ల తరువాత వాట్సాప్ కలిపింది’
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
''మళ్లీ నాన్నను కలుసుకుంటామన్న ఆశ వదులుకున్నాం. ఆయన నన్ను గుర్తుపట్టారు'' అంటూ పాతికేళ్ల ఆ కుర్రాడు తన తండ్రి పాదాలు పట్టుకుని కన్నీరుమున్నీరవుతున్నాడు.
బెంగళూరులోని ఒక ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ వద్ద కనిపించిన ఆ దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది.
మా నాన్నను మళ్లీ మాకు ఇచ్చింది సోషల్ మీడియానే అంటూ తన చేతిలోని మొబైల్ ఫోన్‌ను చూసుకుంటున్నాడు.
ఆయన ఎందుకంతగా సోషల్ మీడియాకు థాంక్స్ చెబుతుననాడో తెలియాలంటే.. తొలుత మహవీర్ సింగ్ చౌహాన్(48) గురించి తెలుసుకోవాలి.
మహవీర్ సింగ్‌ది రాజస్తాన్‌లోని భూస్వామ్య కుటుంబం. వ్యాపారంలో తీవ్రంగా నష్టపోవడంతో 1998లో ఆయన ముంబయి నుంచి వెళ్లిపోయారు.
రాజస్తాన్‌లోని జాలోర్ జిల్లా ఝాబ్ గ్రామంలో ఉంటున్న తన కుటుంబసభ్యులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆయన కనిపించకుండాపోయారు.
ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్న మహవీర్ సింగ్ అక్కడ అనేక చిన్నచిన్న పనులు చేస్తూ బతుకీడ్చారు. కొన్నాళ్లు డ్రైవరుగా.. మరికొన్నాళ్లు ఫొటోగ్రాఫర్‌గా.. ఇంకొన్నాళ్లు బెంగళూరు సమీపంలోని దొడ్డబళ్లాపూర్‌లోని ఒక గులాబీ తోటలో సూపర్‌వైజర్‌గా పనిచేశారు.
మొన్న శనివారం ఆయన ఒక కాలు, ఒక చేయి పనిచేయని స్థితిలో నేలపై పడిఉండడంతో ఆయనతో పాటు పనిచేసే రవి అనే సహోద్యోగి చూశారు.
మహవీర్ సింగ్ మిత్రుడైన కిశోర్ సింగ్ అనే ఒక ఫొటోగ్రాఫర్‌కు రవి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా.. మహవీర్‌ను దగ్గర్లోని ఒక ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. అక్కడ వారు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్‌కు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడి తీసుకెళ్లారు.
డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా..
మహవీర్ సింగ్ ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలనుకున్నారు కిశోర్ సింగ్. అయితే, మహవీర్ ఎన్నడూ తన కుటుంబం గురించి చెప్పకపోవడంతో ఆ వివరాలు ఎవరికీ తెలియలేదు.
దీంతో కిశోర్ సింగ్.. మహవీర్‌తో స్నేహంగా ఉండే మరికొందరిని సంప్రదించారు. వారిలో గోవర్ధన్ గిరి ఒకరు. గోవర్ధన్ గిరి తన వద్ద అందుబాటులో ఉన్న మహవీర్ డ్రైవింగ్ లైసెన్సును కిశోర్ సింగ్‌కు పంపించారు.
హిందీలో ఉన్న ఆ లైసెన్సులో మహవీర్ తండ్రి పేరు, వాళ్ల స్వగ్రామం, జిల్లా పేర్లు ఉన్నాయి.
వెంటనే కిశోర్.. జాలోర్ జిల్లా నుంచే వచ్చిన తనకు తెలిసిన మరో వ్యక్తిని సంప్రదించారు. మహవీర్ వివరాలు, ఆయన పరిస్థితిని వివరిస్తూ ఒక మెసేజ్ ఆయనకు పంపించి రాజస్థాన్‌కు చెందిన పరిచయస్థులందరికీ పంపించాలని కోరారు. అందులో కిశోర్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. శనివారం సాయంత్రం 5.30కి ఆ మెసేజ్‌ను గోవర్ధన్ గిరికి పంపించగా.. అక్కడికి 10 నిమిషాల తరువాత నుంచి మహవీర్ బంధువులు, మిత్రులు, పరిచయస్థుల నుంచి కాల్స్ వచ్చాయి.
చివరికి మహవీర్ కుమారుడు ప్రద్యుమ్న నుంచి కూడా ఫోన్ వచ్చింది. గత 20 ఏళ్లుగా తమ తండ్రి కోసం ఎదురుచూస్తున్నామని ప్రద్యుమ్న చెప్పారు.
అనంతరం ప్రద్యుమ్న వెంటనే బయలుదేరి బెంగళూరు వచ్చారు. ఆదివారం బెంగళూరుకు చేరుకున్న ప్రద్యుమ్న 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్'లో ఉన్న తన తండ్రి పాదాలను తాకారు. ఆయన కంటి నుంచి జలధార ఆగలేదు.
''నాకు నాలుగేళ్ల వయసున్నప్పుడు నాన్న వెళ్లిపోయారు. మళ్లీ ఇదే కలవడం'' అంటూ ఆయన గద్గద స్వరంతో చెప్పారు.
''మళ్లీ నాన్నను కలుసుకుంటామన్న ఆశ వదులుకున్నాం. ఆయన నన్ను గుర్తుపట్టారు'' అంటూ ప్రద్యుమ్న చిన్నపిల్లాడిలా సంతోషపడ్డారు.
ప్రద్యుమ్నకు ఒక తమ్ముడు ఉన్నారు. తాను, తమ్ముడు ఎన్నడూ తండ్రి గురించి తల్లిని అడిగేవారం కాదని.. ఆమెకు కూడా తెలియదు కాబట్టి అడిగి బాధపెట్టడం ఇష్టం లేకపోయిందని ప్రద్యుమ్న చెప్పారు.
కాగా.. మహవీర్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన వెన్నుపూస కుంచించుకుపోవడంతో అవయవాలు సరిగా పనిచేయడం లేదని వైద్యులు చెప్పారు.
తండ్రిని కలుసుకున్నందుకు ఆనందంగా ఉన్నా ఆయన ఆరోగ్య పరిస్థితిని చూసి బాధగా ఉందని ప్రద్యుమ్న ఆవేదన చెందారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)