#MeToo: ‘సోషల్ మీడియా లేకుంటే నా గోడు ఎవరూ వినేవారు కాదు’

గత కొద్ది రోజులుగా మీటూ ఉద్యమం దేశాన్ని కుదిపివేస్తోంది. సినీ నటులు, పాత్రికేయులు, రచయితలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫేక్‌న్యూస్ విషయంలో సోషల్ మీడియాపై ప్రభుత్వం నిఘా పెంచుతున్న సమయంలోనే ఈ ఆరోపణల క్రమం మొదలైంది. ఈ అంశాలపై బీబీసీ ప్రతినిధి డెవీనా గుప్తా అందిస్తున్న కథనం ఇది.

టీవీ ప్రొడ్యూసర్ వింతా నందా నోరు విప్పడానికి 20 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. కొద్దిరోజులుగా దేశంలో సంచలనంగా మారిన మీటూ ఉద్యమం వల్ల ఇప్పుడు ఆమె వేదనను అందరూ వింటున్నారు.

''సోషల్ మీడియానే లేకుంటే నా గోడును ఎవరూ వినేవారు కాదు. అది చరిత్రలో కలిసి పోయేది'' అని ఆమె బీబీసికి చెప్పారు.

తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించిన ఆమెకు సినీ పరిశ్రమ అండగా నిలిచింది. కానీ 14 ఏళ్ల కిందట ఒక ప్రముఖ పత్రిక ద్వారా తన గోడును వెల్లబోసుకున్నా ఎవరూ వినలేదు.

ఆ రాత్రి బలవంతంగా నోట్లో మద్యం పోయడం, తనకు గుర్తుందని.. క్షణం వదలకుండా తనను వేధించారని, మరుసటి రోజు మధ్యాహ్నం తెలివి వచ్చేటప్పటికి తనకు చాలా నొప్పిగా ఉండిందని.. మంచం మీద నుంచి లేవలేకపోయినట్లు ఆమె ఆ పోస్టులో రాశారు.

''నేను ఏడుస్తూ ఉండిపోయాను. కన్నీళ్లు ధారలు కట్టాయి. ఇవాళ నేను నోరువిప్పాను. మద్దతు లభిస్తుందని నాకు కచ్చితంగా తెలుసు '' అని చెప్పారు.

హిందీ చిత్రాల్లో నైతిక విలువలుగల పాత్రల్లో ఎక్కువగా నటించిన అలోక్ నాథ్‌పై ఆమె ఆరోపణలు చేశారు. వాటిని తోసిపుచ్చిన అలోక్ న్యాయవాదులు ఆమెపై పరువు నష్టం దావా వేశారు. మరిన్ని ఆరోపణలు వస్తుండటంతో అలోక్‌ను నిషేధిస్తామంటూ ఆర్టిస్ట్ అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి.

అయితే, సోషల్ మీడియా ద్వారా చేసే ఆరోపణలు, మీడియాలో జరిగే చర్చలకు చట్టబద్ధత ఉండదని లాయర్ నిమన్యు శర్మ చెప్పారు. అవి కోర్టుల్లో నిలవవని తెలిపారు.

యూట్యూబ్ ద్వారా పేరు తెచ్చుకున్న ఒక కమెడియన్‌ తనకు అశ్లీల చిత్రాలు పంపినట్లు మహిమ ఆరోపించారు. ఆన్‌లైన్ ప్రపంచాన్ని సెన్సార్ చేయలేమంటున్నారు ఈ 27 ఏళ్ల రచయిత్రి.

''ఎదుటివారిని అవమానించాలనే ఉద్దేశంతో కావాలని ఆరోపణలు చేసే వారు చాలా కొద్దిమంది మాత్రమే. ఇక్కడ మనం చూడాల్సింది మొత్తం చిత్రాన్ని. ఇంకా ఎంత మంది మహిళలు మౌనం వీడి ప్రపంచానికి తమ అనుభవాల్ని వినిపిస్తారో చూడాల్సే ఉంది'' అని తెలిపారు.

దాదాపు 25 కోట్ల మంది సోషల్ మీడియా వినియోగదార్లు ఉన్న భారతదేశంలో... సోషల్ మీడియాపై ప్రభుత్వం మరిన్ని ఆంక్షల్ని, నిబంధల్ని విధించాలని చూస్తున్న సమయంలో... మీటూ ఉద్యమం ఇందులో భాగమైన సోషల్ మీడియా కంపెనీలకు ఓ రకంగా ఉపయోగపడుతోందనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)