మానస సరోవర్ యాత్రలో విషాదం.. కాకినాడవాసి మృతి

మానససరోవర్

ఫొటో సోర్స్, Getty Images

మానస సరోవర యాత్రకు వెళ్లిన భారతీయుల్లో వందలాది మంది తీవ్రమైన మంచు వర్షం కారణంగా నేపాల్, టిబెట్‌లలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.

వారిలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన యాత్రికులూ ఉన్నారు. అందులో ఒకరు మృతిచెందారు.

కాకినాడకు చెందిన గ్రంథి వీర వెంకట సత్య లక్ష్మీనారాయణ సుబ్బారావు(57) యాత్ర పూర్తిచేసుకుని తిరిగివస్తూ మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

గ్రంథి సుబ్బారావు

ఫొటో సోర్స్, Grandhi Babji

ఫొటో క్యాప్షన్, గ్రంథి సుబ్బారావు

ఇంజినీరుగా పనిచేస్తున్న సుబ్బారావు, మరో 37 మంది జూన్ 20న యాత్రకు వెళ్లగా వారిలో 34 మంది ముక్తిధామ్ దర్శనం తరువాత తిరిగొచ్చేశారు.

సుబ్బారావు దంపతులు, ఆయన సోదరి, బావ అక్కడి నుంచి మానససరోవర్ వెళ్లారని ఆయన సమీప బంధువు బాబ్జీ బీబీసీతో చెప్పారు.

సుబ్బారావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

ఆయన మరణవార్త వినడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

కాగా భారత్‌కు చెందిన మానససరోవర్ యాత్రికుల్లో 525 మంది నేపాల్‌లోని సిమికోట్‌లో, 550 మంది హిల్సాలో.. మరో 500 మంది టిబెట్‌లో చిక్కుకుపోయినట్లుగా భారత విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ తన ట్వీట్‌లో వెల్లడించారు.

వీరిలో సుమారు 100 మంది తెలుగువారు ఉన్నట్లు దిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

సహాయ చర్యల కోసం సైన్యాన్ని పంపించాలని విదేశాంగశాఖను కోరినట్లు ఆయన చెప్పారు. తెలుగువారందరినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

మరోవైపు మానస సరోవర్ యాత్రలో చిక్కుకున్న తెలంగాణ యాత్రికులు సురక్షితంగా ఉన్నట్లు తెలంగాణ భవన్ అధికారులు తెలిపారు.

వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన సుమారు 65 మంది చిక్కుకున్నారని.. వారిని సురక్షితంగా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి తెలిపారు.

మృతుడు సుబ్బారావుకు చెందిన పాస్‌పోర్ట్

ఫొటో సోర్స్, I&PR, Govt of AP

ఫొటో క్యాప్షన్, మృతుడు సుబ్బారావుకు చెందిన పాస్‌పోర్ట్

నేపాల్‌గంజ్‌కు రేపు ఏపీ బృందం

సుబ్బారావు మృతదేహానికి నేపాల్‌గంజ్‌లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వస్థలానికి తీసుకొస్తారని.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బృందాన్ని బుధవారం నేపాల్‌గంజ్ పంపిస్తున్నట్లు ఏపీ భవన్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ 'బీబీసీ'తో చెప్పారు.

మంగళవారం మధ్యాహ్నం 3.30 వరకు ఉన్న సమాచారం ప్రకారం 100 మంది భారతీయ యాత్రికులను సిమికోట్ నుంచి నేపాల్‌గంజ్‌కు తరలించారు. మరో 104 మందిని హిల్సాకు హెలికాప్టర్ల ద్వారా తీసుకొచ్చారు.

వీరిని తరలించేందుకు సిమికోట్ నుంచి నేపాల్‌గంజ్‌కు ఏడు విమానాలు నడుపుతున్నారు.

ఆర్టీజీఎస్

ఫొటో సోర్స్, RTGS,APGovt

అమరావతి నుంచి సహాయ ఏర్పాట్ల పర్యవేక్షణలో ఆర్టీజీఎస్

మరోవైపు ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది.

రాజధాని అమరావతి కేంద్రంగా 'రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్' విభాగ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబు.ఎ నేతృత్వంలోని సిబ్బంది ఏపీ భవన్, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు.

మంగళవారం ఉదయం బాధితుల్లో కొందరితో మాట్లాడామని, ఆ తరువాత వారు నెట్‌వర్క్ సమస్యల కారణంగా సెల్‌ఫోన్లో అందుబాటులోకి రాలేదని ఆర్టీజీఎస్ వర్గాలు తెలిపాయి.

ఏపీ నుంచి 100 మందికిపైగా చిక్కుకుపోయారని.. కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన యాత్రికులు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

విజయవాడ చిట్టినగర్‌కు చెందిన మురళి అనే యాత్రికుడితో మాట్లాడగా తమ బృందంలోని వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పారని.. దీంతో బాధితులకు సత్వరమే మందులు చేరేలా, వైద్యులు కూడా వెళ్లేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)