You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోషల్: 'చివరకు ఓ వరల్డ్ కప్.. రాహుల్ ద్రవిడ్ పేరిట!'
భారత అండర్-19 క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెల్చుకున్న తర్వాత సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.
సోషల్ మీడియాలో ప్రముఖులు, క్రీడాభిమానులు అభినందనల సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ట్విటర్‌లో టాప్-10 ట్రెండ్స్‌లో 9 ట్రెండ్స్ భారత జట్టు విజయానికి సంబంధించినవే.
చాలా మంది ఈ విజయానికి గాను భారత జట్టుతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
గెలుపు తర్వాత స్టేడియంలో భారత జట్టు ఘనంగా విజయోత్సవం జరుపుకుంది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా సీనియర్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి, సచిన్ తెందూల్కర్ సహా చాలా మంది క్రీడా ప్రముఖులు, సినీ తారలు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.
"మన యువ క్రికెటర్లు సాధించిన ఈ విలక్షణ విజయానికి నేను చాలా సంతోషిస్తున్నా. అండర్-19 ప్రపంచ కప్ గెల్చుకున్నందుకు నా అభినందనలు. భారతీయులందరూ ఈ విజయం పట్ల గర్వపడుతున్నారు" అని ప్రధానమంత్రి మోదీ రాశారు.
రాష్ట్రపతి కోవింద్ కూడా టీం కెప్టెన్ పృథ్వీషా, తదితర ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు.
భారత సీనియర్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక ఫొటో పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు. "అండర్-19 కుర్రాళ్లు సాధించిన అద్భుత విజయం ఇది. దీన్ని మైలురాయిలా భావించండి. ఇంకా చాలా దూరం సాగాల్సి ఉంది. ఈ ఆనందపు క్షణాలను ఆస్వాదించండి."
సచిన్ తెందూల్కర్ ఒక వీడియో పోస్ట్ చేసి అభినందనలు తెలిపారు.
కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ కూడా క్రికెట్ టీంకు, కోచ్ ద్రవిడ్‌కు అభినందనలు తెలిపారు.
"ఈ కుర్రాళ్లు ఎంతో సురక్షితమైన చేతుల్లో ఉన్నారు. రాహుల్ ద్రవిడ్ సురక్షితమైన చేతులు. భారత క్రికెట్ భవిష్యత్తులో ఈ కుర్రాళ్లు సాధించిన విజయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. మన దగ్గర ఎంతో ప్రతిభ ఉంది" అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సురేష్ రైనా, రవి శాస్త్రి, ఆర్. అశ్విన్, జహీర్ ఖాన్ కూడా భారత జట్టును అభినందనల్తో ముంచెత్తారు.
సురేష్ రైనా కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెర వెనుక నిరంతరం శ్రమించి టీం తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించేలా రాటు దేల్చారని ఆయన అన్నారు.
క్రికెట్ ఎక్స్‌పర్ట్ మోహన్‌దాస్ మీనన్ ఈ విజయానికి పూర్తి క్రెడిట్ రాహుల్ ద్రవిడ్‌కే దక్కుతుందని ట్వీట్ చేశారు. "చివరకు ఓ వరల్డ్ కప్.. రాహుల్ ద్రవిడ్ పేరిట. ఈ గెలుపులో ఆయనదే కీలకపాత్ర."
"తమ స్కోరుతో వయసును అధిగమించారు! 'ద వాల్' ద్వారా శిక్షణ పొందడం వల్లే ఈ జట్టు శిఖరాన్ని చేరుకోగలిగింది. ఎంత గొప్ప విజయం. అభినందనలు రాహుల్ ద్రవిడ్. భారతీయుడైనందుకు గర్వంగా ఉంది" అని సినీ నటుడు సునీల్ షెట్టీ ట్వీట్ చేశారు.
గెలుపు సాధించాక టీం కెప్టెన్ పృథ్వీషా భారత అభిమానులను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారు.:
భారత జట్టు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో ఓడించింది.
మన్‌జోత్ కాల్రా (101), హార్విక్ దేశాయి (47)ల అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా, భారత జట్టు అస్ట్రేలియా నిర్దేశించిన 2017 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలోనే, కేవలం రెండు వికెట్లను కోల్పోయి చేరుకోగలిగింది.
భారత్ అండర్-19 వరల్డ్ కప్ గెల్చుకోవడం ఇది నాలుగోసారి. ఇంతకు ముందు 2000, 2008, 2012లలో భారత్ ప్రపంచ కప్ గెల్చుకుంది.
టీం సభ్యులకు బీసీసీఐ నగదు పురస్కారాలు ప్రకటించింది. టీం కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు 50 లక్షలు, ఒక్కో ఆటగాడికి 30 లక్షల చొప్పున అందజేస్తారు.
సపోర్ట్ స్టాఫ్‌లోని ప్రతి సభ్యుడికీ 20 లక్షల నగదు పురస్కారం అందజేస్తారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)