రోహిత్: వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు

భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ.. అరుదైన రికార్డు నమోదు చేశాడు. వన్డే క్రికెట్ మ్యాచ్‌లో మూడో ద్విశతకం నమోదు చేశాడు.

ఇంతకు ముందు .. ఆస్ట్రేలియా, శ్రీలంకలపై ద్విశతకాలు చేశాడు.

ఒక్క శ్రీలంకపైనే రెండు ద్విశతకాలు చేయడం గమనార్హం. తాజా మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచిన రోహిత్ 208 పరుగులు చేశాడు.

భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 392 పరుగులు చేసింది. ఇందులో రోహిత్ శర్మ ఒక్కరే 208 పరుగులు చేశాడు.

50 ఓవర్లు ముగియడానికి 12 బంతులే మిగిలిన సమయంలో రోహిత్ స్కోర్ 184. అప్పటికి రోహిత్ 13 ఫోర్లు.. 9 సిక్సర్లు నమోదు చేశాడు.

ఆ తర్వాత వరుస బౌండరీలతో ద్విశతకాన్ని సాధించాడు.

49వ ఓవర్లో మొదటి బంతిని రోహిత్ సింగిల్ గా మలచగా.. పాండ్య రెండో బాల్‌ను ఫోర్ గా మలిచాడు. తర్వాత సింగిల్ తీసి ఇచ్చాడు.

ఆ వెంటనే రోహిత్ 48.4వ బాల్‌ను సిక్సర్‌గా మలవగా.. స్కోరు 190 అయింది.

తర్వాత బంతికి సింగిల్ తీసి.. తదుపరి ఓవర్ కోసం రోహిత్ సిద్ధమయ్యాడు. అందుకే ఆఖరు బంతికి రెండు పరుగులు తీసి.. ఆఖరు ఓవరును తానే ఆడేందుకు సిద్ధమయ్యాడు.

తర్వాత 49వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచి.. రెండో బంతికి రెండు పరుగులు తీశారు. దీంతో మొత్తం స్కోరు 198 అయింది.

మొత్తానికి అభిమానుల తీవ్ర ఉత్కంఠ మధ్య 49.3 ఓవర్లపుడు 200 పూర్తి చేశాడు.

మొత్తం 12 సిక్సర్లు .. 13 ఫోర్లు కొట్టాడు.

ఒకే ఒక్కడు

అంతర్జాతీయ వన్డేలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) చేసిన రికార్డు రోహిత్ శర్మ పేరిటే ఉంది.

2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు చేశాడు. ఇందుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికైంది.

2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులు చేశాడు. ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నిలిచింది.

భారత్ తరపున గతంలో సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లు వన్డేలలో ద్విశతకాలు సాధించారు.

అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో తొలి ద్విశతకం సచిన్ బ్యాటు నుంచి జాలు వారింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 200 పరుగులు సాధించాడు.

2011లో వీరేంద్ర సెహ్వాగ్ వెస్టిండీస్‌పై 219 పరుగులు చేశాడు.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)