You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అండర్ 19 క్రికెట్ ఫైనల్స్: ఆసీస్‌పై భారత జట్టు ఘనవిజయం
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత యువ జట్టు అద్భుత విజయం సాధించి చాంపియన్‌గా అవతరించింది. మొత్తంగా నాలుగోసారి ప్రపంచ చాంపియన్‌గా గెలిచి రికార్డు నెలకొల్పింది.
ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను 216 పరుగులకు కుప్పకూల్చిన భారత యువ క్రీడాకారులు.. 38.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 220 పరుగులు చేసి ఘన విజయం సాధించారు.
న్యూజిలాండ్‌లోని మౌంట్ మాంగనీలో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన భారత్ ఫీల్డింగ్ చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. భారత యువ బౌలర్లు విజృంభించటంతో 47.2 ఓవర్లలో 216 పరుగులకే కుప్ప కూలింది.
ఆసీస్ ఓపెనర్లు బ్రయంత్ (14), ఎడ్వర్డ్స్ (28), ఆ తర్వాత వచ్చిన సారథి సంఘా (13) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయారు.
అనంతరం జొనాథన్ మెర్లో (76) ఒంటరి పోరాటంతో ఆసీస్ స్కోరు 200 పరుగులు దాటింది.
చివరి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయటంతో ఆసీస్ జట్టు 47.2 ఓవర్లలో 216 పరుగులకు పరిమితమైంది.
భారత బౌలర్లలో ఇషాన్ పోరెల్, శివ సింగ్, నగర్ కోటి, అనుకూల్ రాయ్ తలా రెండు వికెట్లు తీశారు. శివమ్ మావికి ఒక వికెట్ లభించింది.
అనంతరం 50 ఓవర్లలో 217 పరుగుల లక్ష్యంతో భారత జట్టు ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు పృథ్వీ షా, మన్‌జోత్ కల్రాలు బ్యాటింగ్‌కు వచ్చారు. నాలుగు ఓవర్లలో స్కోరు 23 పరుగుల వద్ద ఉన్నపుడు వర్షం పడటంతో ఆటను 20 నిమిషాల పాటు నిలిపివేశారు.
వర్షం తగ్గి ఆట మళ్లీ మొదలయ్యాక ఓపెనర్లిద్దరూ స్థిరంగా ఆటకొనసాగించారు. 12వ ఓవర్‌లో నాలుగో బంతికి భారత జట్టు కెప్టెన్ పృథ్వీ షా 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విల్ సదర్‌లాండ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికి భారత జట్టు 71 పరుగులు చేసింది.
అనంతరం శుభం గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి జట్టు స్కోరు వికెట్ నష్టానికి 125 పరుగులకు చేరింది. ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో జట్టు స్కోరు 131 పరుగుల వద్ద ఉండగా పరం ఉప్పల్ బౌలింగ్‌లో శుభం గిల్ ఔటయ్యాడు. గిల్ 30 బంతులు ఆడి 31 పరుగులు జోడించాడు.
ఆ తర్వాత వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
ఓపెనర్ మన్జోత్ కాల్రా ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో రెండో బంతికి సెంచరీ పూర్తిచేసుకున్నాడు. మొత్తం 102 బంతుల్లో 101 పరుగులు సాధించాడు. అదే ఓవర్‌లో ఐదో బంతిని హార్విక్ దేశాయ్ బౌండరీకి తరలించి మ్యాచ్‌ను ముగించాడు. అతడు 61 బంతుల్లో 47 పరుగులు చేశాడు.
అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ పోటీల్లో భారత యువ జట్టు చాంపియన్‌గా నిలవటం ఇది నాలుగోసారి.
అంతకుముందు 2000, 2008, 2012 ప్రపంచ కప్ పోటీల్లో భారత జట్టు మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది.
2006, 2016 పోటీల్లోనూ భారత జట్టు ఫైనల్స్‌కు చేరినా 2006లో పాకిస్తాన్ చేతిలో, 2016లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది.
మొత్తంగా ఆరుసార్లు ఫైనల్స్ ఆడిన భారత్ నాలుగు సార్లు చాంపియన్‌గా అవతరించి రికార్డు నెలకొల్పింది.
ఆస్ట్రేలియా జట్టు 1988, 2002, 2010 పోటీల్లో మూడు సార్లు విజేతగా నిలిచింది.
పాకిస్తాన్ జట్టు 2004, 2006 వరల్డ్ కప్ పోటీల్లో చాంపియన్ అయింది.
ఇంగ్లండ్ (1998), దక్షిణాఫ్రికా (2014), వెస్ట్ ఇండీస్ (2016) ఒక్కోసారి చాంపియన్‌గా అవతరించాయి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)