ప్రెస్‌రివ్యూ: 'రిటైర్డ్ ప్రొఫెసర్ కొలువు కోసమే కొలువుల కొట్లాట' - కోదండరామ్‌పై కేటీఆర్ విమర్శ

ఫొటో సోర్స్, facebook/tjac
'మణులడిగామా? మాణిక్యాలడిగామా? నీ కుర్చీ ఏమన్నా అడిగామా? తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడగాల్సి రావడమే సిగ్గుచేటు’ అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు.
'సోమవారం టీజేఏసీ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ క్రీడా మైదానంలో నిర్వహించిన కొలువుల కోసం కొట్లాట బహిరంగ సభలో కోదండరాం ప్రసంగించారు. ఉద్యోగ ఖాళీల భర్తీపై ప్రభుత్వం అన్నీ తప్పుడు లెక్కలే చెబుతోందని, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైనా ఇప్పటివరకు ఫలితాలు రాలేదన్నారు. ‘తెలంగాణలో పాలన ఒక కుటుంబం పాలైపోయింది. నీ అరాచకాలు ఇంక సాగనివ్వను. ఎన్ని ఆంక్షలు విధించినా ఆగేది లేదు’ అని హెచ్చరించారు. ‘రాజకీయ నిరుద్యోగం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అంటుంటే నవ్వొస్తోంది. రాజకీయమంటే తప్పుడు పనా? అయితే నువ్వూ పదవి నుంచి బయటికొచ్చి మాట్లాడు' అని సీఎంను ఉద్దేశించి కోదండరాం అన్నట్లు ఆంధ్రజ్యోతి పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/nandrurajiv sarma
'హెరిటేజ్'కు లబ్ధి చేకూర్చేలా చంద్రన్న మాల్స్
'చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని కిరాణా వ్యాపారాన్ని పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే భారీ దోపీడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా 'హెరిటేజ్' రిటైల్ వ్యాపారానికి లబ్ధి చేకూర్చే సరికొత్త ఎత్తుగడకు ప్రభుత్వం తెరతీసింది' అంటూ సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్‌లో ఓ కథనాన్ని ప్రచురించింది.
'చంద్రన్న విలేజ్ మాల్స్ పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ.. అదే సమయంలో ఏటా రూ. 72,600 కోట్ల వ్యాపారాన్ని గంపగుత్త్తగా కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పనుంది. రాష్ట్రంలో ఉన్న 29 వేల రేషన్ షాపులన్నీ దశల వారీగా రిలయన్స్, వాల్‌మార్ట్, ప్యూచర్ రిటైల్ సంస్థలకు అప్ప చెప్పి తెల్ల రేషన్ కార్డున్న ప్రతి పేదవాడు కూడా భవిష్యత్తులో ఆ మాల్స్‌లోనే సరుకులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఫ్యూచర్ రిటైల్ వ్యాపారంలో చంద్రబాబు కుటుంబ సంస్థ 'హెరిటేజ్ రిటైల్' భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. విలేజ్ మాల్స్ పేరుతో పైకి డిస్కౌంట్ రేట్లకే సరుకులు అందిస్తామంటున్నా.... వేల కోట్ల కిరాణా వ్యాపారాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది' అని సాక్షి తెలిపింది.
'క్లినికల్ ట్రయిల్స్'కు పేద యువకులు బలి
'ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఔషధ ప్రయోగాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కంపెనీల వలలో చిక్కి వేలాది మంది పేదలు విలవిల్లాడుతున్నారు' అని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
'5- 10 వేలలోపు సంపాదించేవారు.. ఒక్క ప్రయోగానికి వెళ్తే 15 నుంచి 20 వేలు సంపాదించవచ్చనే ఆశతో ఇందుకు అంగీకరిస్తున్నారు. తొలుత, ఫార్మా కంపెనీలు ఏజెంట్లను నియమించుకొని, వారి ద్వారా పేదలను ప్రలోభపెట్టి ప్రయోగాలకు ఒప్పించేవి. ఔషధాల తయారీ దశలో జంతువులపై వివిధ రకాల ప్రయోగాలు నిర్వహించి, మూడో దశలో మనుషులపై వాటి ప్రభావాలను పరీక్షిస్తారు. ఇవన్నీ నిబంధనల మేరకు జరగాలి. కానీ, ఈ తతంగమంతా తూతూమంత్రంగానే జరుగుతుంది. మరోవైపు బాధితుల దురాశ, కంపెనీల కక్కుర్తి కారణంగానే మరణాలు చోటుచేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఔషధ ప్రయోగం నిర్వహించిన తర్వాత మూడు నెలలపాటు ఎలాంటి ఇతర ప్రయోగాలకు అంగీకరించవద్దని చెబుతారు. కానీ, పేదరికం, దళారుల ప్రమేయంతో యువకులు వేర్వేరు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.' అని ఆంధ్రజ్యోతి ప్రచురించింది.
'ఏపీలో ఆదాయానికి కిక్కేకిక్కు'
'మద్యాన్ని ఆదాయ వనరుగా పరిగణనలోకి తీసుకునే ప్రసక్తేలేదు. అందుకే నూతన మద్యం విధానాన్ని అమలు చేస్తున్నాం' అని ఏపీలో మంత్రుల నుంచి సీఎం వరకు ఎపుడూ వల్లె వేసే మాటే. ఆచరణలో మాత్రం ఎక్కడా అది కనిపించటంలేదు. ఏటా మద్యం అమ్మకాల వల్ల ఆదాయం పెరుగుతుందేగానీ, తగ్గటంలేదు.. అని ప్రజాశక్తి పేర్కొంది.
'మద్యం సేవించటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ సాక్షాత్తు మంత్రులే అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. అయినప్పటికీ ఎక్కడా మద్యం అమ్మకాలు తగ్గటంలేదు. సగటున నెలకు రూ.1,500 కోట్ల ఆదాయం కేవలం మద్యం అమ్మకాల ద్వారానే లభిస్తోంది. దీనినిబట్టే ప్రభుత్వం మద్యాన్ని ఏవిధంగా తాగిస్తుందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ఆదాయం రూ.15 వేల రికార్డు స్థాయికి చేరనుంది. ఇప్పటికే రూ.13,168.17 కోట్లు (నవంబర్ నాటికి) ఆదాయం సమకూరింది. కొత్త సంతవ్సరం వేడుకల కోసం యువత వారం రోజుల ముందుగానే మద్యాన్ని కొనుగోలు చేసి స్టాక్ చేసుకుంటారు. ఈ నెలలో మరో రూ.1,500 కోట్లపైనే ఆదాయం వస్తుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తోంది’ అని ప్రజాశక్తి పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/ktr
'రిటైర్డ్ ప్రొఫెసర్ కొలువు కోసమే కొలువుల కొట్లాట'
ఓ రిటైర్డు ప్రొఫెసర్ కొత్త కొలువు సృష్టించుకోవడం కోసమే కొలువుల కోసం కొట్లాట అంటూ పంచాయితీ చేస్తున్నారని మంత్రి కె.తారకరామారావు దుయ్యబట్టారు. పదేళ్లు అధికారం అనుభవించిన జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ తిరిగి మంత్రి పదవులు పొందాలన్న ఆశతో రభస చేస్తున్నారని మండిపడ్డారు.. అని సాక్షి పేర్కొంది.
మహబూబ్ నగర్‌లో సోమవారం కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. అనంతరం స్థానిక మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. కొలువుల కోసం కొట్లాట వాస్తవమే! ఎవరికి కొలువులు? పదేండ్లు పదవులు అనుభవించిన జైపాల్‌రెడ్డి ఉద్యోగం కోసం, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ మంత్రి పదవుల కోసమే ఈ కొట్లాట అని కేటీఆర్ అన్నట్లు సాక్షి ఓ వార్త ప్రచురించింది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








