You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీ20 వరల్డ్ కప్: అమెరికాపై 111 పరుగులు చేయడానికి కూడా ఇండియా ఎందుకంత కష్టపడాల్సి వచ్చింది?
లక్ష్యం చిన్నదే. కానీ న్యూయార్క్ పిచ్‌పై అది కొండలా కనిపిస్తుంది. భీకరమైన బ్యాటింగ్‌కు పేరొందిన భారత జట్టు కూడా పసికూన అమెరికాపై చెమటోడ్చి నెగ్గడమే ఇందుకు తార్కాణం.
అమెరికాలో జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం రాత్రి ఇండియా అమెరికాపై 7 వికెట్ల తేడాతో గెలిచింది. మరో 10 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది.
టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్‌ను ఎంచుకుంది. ఇందుకు తగ్గట్టే భారత బౌలర్లు కూడా చెలరేగిపోయారు.
అమెరికా ఓపెనర్ ఎస్.జహంగీర్ పరుగులేవీ చేయకుండానే అర్షదీప్‌కు ఎల్బీడబ్ల్యూగా చిక్కాడు.
వన్‌డౌన్‌గా వచ్చిన గౌస్ అర్షదీప్ బౌలింగ్‌లో మిగిలిన 5 బంతులు ఎదుర్కొని 2 పరుగులు చేసి చివరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
దీంతో ఒకే ఓవర్‌లో అర్షదీప్‌కు రెండు వికెట్లు చిక్కినట్టయింది.
అప్పటికి అమెరికా జట్టు స్కోరు కేవలం 3 పరుగులు మాత్రమే.
తరువాత ఆరోన్ జోన్స్, నితీష్ కుమార్‌తో కలిసి మరో ఓపెనర్ స్టీవెన్ టేలర్ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో జోన్స్ 22 బంతుల్లో ఒక సిక్సర్‌తో 11 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
ఇక అమెరికా జట్టులో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన నితీష్ కుమార్ కూడా అర్షదీప్ ఉచ్చులో చిక్కుకున్నాడు.
నితీష్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 27 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్‌లో మహమ్మద్ సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ స్టీవెన్ టేలర్ 30 బంతుల్లో 2 సిక్సులు కొట్టి 24 పరుగులు చేశాక, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
తరువాత కోరే అండర్సన్ (12 బంతుల్లో 15 పరుగులు, 1 ఫోర్, 1 సిక్సర్) హార్థిక్ పాండ్యా బౌలింగ్ రిషభ్ పంత్ చేతికి చిక్కాడు.
హర్మిత్ సింగ్ (10 బంతులు 1 సిక్సర్, 10 పరుగులు)అర్షదీప్ సింగ్ బౌలింగ్ రిషభ్ పంత్‌కే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
చివర్లో షాడ్లే, జస్‌దీప్ సింగ్ వరుసగా 11, 2 పరుగులు మాత్రమే చేయగలగడంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగలిగింది.
ఇందులో 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చినవే.
అర్షదీప్ మ్యాజిక్
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. అతను జహంగీర్, గౌస్, నితీష్‌కుమార్, హర్మీత్ సింగ్ వికెట్లను తీశాడు.
ఇక ఈ మ్యాచ్‌లో అందరూ జస్‌ప్రీత్ బుమ్రాకు భయపడితే అతను అంచనాలకు భిన్నంగా వికెట్లేమీ తీయలేకపోయాడు. అతను 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు.
మరో బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా 4 ఓవర్లు బౌల్ చేసి 25 పరుగులు ఇచ్చాడు.
హార్దిక్ పాండ్యా మాత్రం 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, శివమ్ దూబే 1 ఓవర్‌లో 11 పరుగులు, అక్షర్ పటేల్ 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ సాధించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అర్షదీప్ సింగ్ నిలిచాడు.
చెమటోడ్చిన భారత్
చేయాల్సిన పరుగులు కేవలం 111. టీ20ల్లో ఈ స్కోరు మొదటి పది ఓవర్లలోనే ఊదేస్తారు. కానీ న్యూయార్క్ పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తోంది. ఈ పిచ్‌పై స్వల్ప లక్ష్యాలు కూడా బ్యాటర్లకు భారీగా కనిపిస్తున్నాయి.
అసలే పాకిస్తాన్‌పై గెలిచిన అమెరికా ఏదైనా అద్భుతం చేయవచ్చనే అనుమానం అభిమానులను పీడిస్తూనే ఉంది.
దీనికి తగినట్టే ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ 10 పరుగుల్లోపే అవుటైపోయారు.
విరాట్ కోహ్లీ సౌరభ్ నేత్రావల్కర్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గౌస్ చేతికి చిక్కి డకౌట్‌గా వెనుదిరిగాడు.
మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మూడు పరుగులే చేసి నేత్రావల్కర్ బౌలింగ్‌లోనే హర్మీత్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
తరువాత వచ్చిన రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడినా, పిచ్ బౌలర్లకు అనుకూలంగా మారడంతో బ్యాటర్లు పరుగులు తీయడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది.
రిషభ్ పంత్ బానే ఆడినా, మరో ఎండ్‌లో సూర్యకుమార్ యాదవ్ నిలదొక్కుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది.
వీరిద్దరూ తమ సహజ ఆట తీరుకు భిన్నంగా ఆడాల్సి వచ్చింది.
రిషభ్ పంత్ 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్ సాయంతో 18 పరుగులు చేసి అలీఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.
అప్పటికి జట్టు స్కోరు 39 పరుగులు. పడిన వికెట్లు 3.
8 ఓవర్లు కూడా పూర్తి కాకముందే ఇండియా మూడు వికెట్లు పోగొట్టుకోవడం, కనీసం 50 పరుగులు కూడా చేయకపోవడంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.
సూర్య కుమార్ హాఫ్ సెంచరీ
బోర్డుపైకి 50 పరుగులు కూడా చేరకముందే 3 వికెట్లు పడిపోవడంతో జట్టును నడిపించే బాధ్యత క్రీజులో ఉన్న సూర్య కుమార్‌పై పడింది.
ఇప్పటిదాకా సిరీస్‌లో రాణించని శివమ్ దూబేతో కలిసి అతను నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో పడ్డాడు.
వీరిద్దరూ పరిస్థితులకు తగినట్టుగా ఆడారు.
సూర్య కుమార్ యాదవ్ మొత్తం 49 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 50 పరగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
మరోపక్క శివమ్ దూబే కూడా 35 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్ కొట్టి 31 పరుగులు చేశాడు.
వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి మరో 10 బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.
అమెరికా బౌలింగ్‌లో సౌరభ్ నేత్రావల్కర్ 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలీఖాన్ 3.2 ఓవర్లు వేసి 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కంచుకున్నాడు.
అలీఖాన్, జస్‌దీప్ సింగ్, షెడ్లీ, కోరే అండర్సన్ వికెట్లేవీ తీయలేకపోయారు.
అమెరికాపై విజయంతో ఇండియా ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచి 6 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
- టీడీపీ, వైసీపీ మధ్య ఓట్ల తేడా ఎంత? అది ఫలితాలను ఎలా మార్చేసింది?
- సత్యకుమార్ యాదవ్: వెంకయ్యనాయుడి పర్సనల్ సెక్రటరీ నుంచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి వరకు
- సన్‌స్క్రీన్ లోషన్లు వాడుతున్నారా, ఈ ఎనిమిది విషయాలు తెలుసుకోండి...
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేల జాబితా..
- ఏపీ క్యాబినెట్లో మహిళా మంత్రులు.. ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఎలా మంత్రులయ్యారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)