SRH vs LSG: కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను యజమాని తిట్టారా, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎందుకు కోపంగా ఉన్నారు?

సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్ముదులిపింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ సగం ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

166 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్లేమీ నష్టపోకుండా సాధించింది.

సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మెరుపు బ్యాటింగ్ ముందు కేఎల్ రాహుల్ సేన నిశ్చేష్టులై నుంచుంది.

కానీ ఈ మధ్యలో మైదానంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు అనేక అనుమానాలు, ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్ అయిన తరువాత లఖ్‌నవూ టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో డగౌట్‌లో చాలా సేపు మాట్లాడారు.

ఆ సమయంలో సంజీవ్ చాలా కోపంగా చేతులు చూపుతూ రాహుల్‌కు ఏదో చెబుతున్నట్లు కనిపించారు. కేఎల్ రాహుల్ మాత్రం ప్రశాంతంగా ఆయన మాటలు వింటూ కనిపించారు.

ఈ విషయం గురించి కామెంటేటర్లు కూడా మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు కెమెరాల ముందు కాకుండా నాలుగుగోడల మధ్య జరగాలని వ్యాఖ్యానించారు.

సంజీవ్ గోయెంకా, కేఎల్ రాహుల్ మధ్య సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు

ఇంతకీ వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏమిటి? వీళ్ళేం మాట్లాడుకున్నారనేది వీడియోలో వినిపించనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం, సంజీవ్ గోయెంకా హావభావాల గురించి యూజర్లు రకరకాలుగా రాశారు.

కేఎల్ రాహుల్‌ను ఆయన తిట్టారని కొంతమంది యూజర్లు ఎక్స్ లో రాయగా, మరికొంతమంది ఆయన ఇలా ప్రవర్తించాల్సింది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గబ్బర్ సింగ్ అనే యూజర్ స్పందిస్తూ ‘‘ఏ ఆటగాడు ఇలాంటి దుస్థితిని ఎదుర్కోకూడదు. మీడియా ముందు మీరు మీ కెప్టెన్‌ను అవమానించారు. కొంత సభ్యత చూపించండి. కష్ట సమయంలో వాడాల్సింది మైండ్‌ని. ఆయన జట్టు యజమాని అయినా సరే ఇది అంగీకరించాల్సిన విషయం కాదు’’ అని రాశారు.

శేఖర్ అనే మరో యూజర్ స్పందిస్తూ ‘‘జట్టు యజమాని నుంచి కేఎల్ రాహుల్ లాంటి ఆటగాడు బహిరంగంగా విమర్శలు ఎదుర్కోవడం తీవ్రనిరాశకు గురిచేసింది. ఇలాంటి విషయాలను నిర్మాణాత్మకమైన చర్చల ద్వారా అంతర్గతంగా పరిష్కరించుకోవాలి’’ అని రాశారు.

ఆల్ఫా అనే మరో యూజర్ ‘‘డబ్బు కోసం ఆడితే ఇలాంటి మర్యాదే దక్కుతుంది’’ అని రాశారు.

రిచర్డ్ కెటెల్‌బొరో అనే పేరుతో ఉన్న ఖాతాదారు ఇలా రాశారు. ‘‘ కేఎల్ రాహుల్ 9 టు 6 ఉద్యోగిలా కనిపిస్తున్నారు. ఓవర్‌టైమ్ చేయాల్సిందిగా ఆయన యజమాని వేధిస్తున్నట్టు కనిపిస్తోంది’’అని రాశారు.

సమీరా అనే మరో యూజర్ రాస్తూ ‘‘నేను కేఎల్ రాహుల్ అభిమానిని కాదు. కానీ ఇదేమాత్రం ఆమోదనీయం కాదు. మిస్టర్ గోయెంకా... మీరు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలుసు. కానీ ఓ భారత టాప్ క్రికెటర్‌ను ఇలా ట్రీట్ చేయడం మర్యాద కాదు. మీ సంభాషణ ప్రైవేటుగా చేసి ఉంటే బావుండేది. కేఎల్ రాహుల్ లఖ్‌నవూ జెయింట్స్‌ను ఎంత త్వరగా వీడితే అంత మంచిది’’

జాకీ యాదవ్ అనే యూజర్ స్పందిస్తూ ‘‘మా లఖ్‌నవూ నగరం సంస్కృతికి పేరెకెన్నికగన్నది. గోయెంకా లాంటి వ్యక్తులకు ఇక్కడ చోటు లేదు. కెఎల్ రాహుల్ అతని మొహం మీదే కెప్టెన్సీ వదిలేసి వచ్చేసి ఉండాల్సింది’’ అని రాశారు.

అభిషేక్ అనే యూజర్ రాస్తూ ‘‘కేఎల్ రాహుల్ సహనం అభినందనీయం. సంజీవ్ గోయెంకా ప్రవర్తనను ఖండించాలి. ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ, పంజాబ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. కానీ వారి యజమానుల నుంచి ఇలాంటి ప్రవర్తన చూడలేదు’’ అని రాశారు.

వివేకానంద సింగ్ కుష్వా అనే యూజర్ ‘‘కేఎల్ రాహుల్ ఇండియాకు ఎన్నో విజయాలు అందించాడు. అలాంటి క్రికెటర్‌ను యజమాని అవమానించడం, క్రికెట్‌ ప్రపంచానికే సిగ్గుచేటు’ అని రాశారు.

కేఎల్ రాహుల్ స్పందన ఏంటి?

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. మ్యాచ్ పూర్తయిన తరువాత కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశాడు.

‘‘మనం ఇలాంటి బ్యాటింగ్‌ను టీవీల్లోనే చూసి ఉంటాం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం. నా దగ్గర చెప్పడానికేమీ లేదు. సన్ రైజర్స్ ‌బ్యాట్స్‌మెన్లు బంతిని బాదిన తీరే కాకుండా, పరిస్థితులన్నీ వారికి అనుకూలంగా కలిసి వచ్చాయి. వారి నైపుణ్యాన్ని కొనియాడాల్సిందే. ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయంపై ప్రశ్నలు వస్తాయి. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించాలని భావించాం. కానీ మేం మరో 40, 50 పరుగులు చేసి ఉండాల్సింది. పవర్ ప్లేలో మా ఆటగాళ్ళు లయ కోల్పోయారు’’ అని చెప్పారు.

ఆయుష్ బదానీ, నికోలస్ పూరన్, బ్యాటింగ్‌ను రాహుల్ కొనియాడారు. వారి బ్యాటింగ్ కారణంగానే 166 పరుగుల స్కోరు సాధించగలిగామన్నారు.

‘‘మేం 250 పరుగులు చేసినా, వారు గెలిచి ఉండేవారు’’ అని రాహుల్ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)