You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పీచు మిఠాయితో క్యాన్సర్ ప్రమాదం ఉందా? దీనిపై ఏపీ, తెలంగాణ పరీక్షలు ఎందుకు చేయిస్తున్నాయి?
- రచయిత, శారద.వి, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధులు
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడులలో పీచు మిఠాయిపై నిషేధం విధించిన తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఇంతకూ అక్కడ నిషేధం ఎందుకు విధించారు? నిషేధం తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు తీసుకొన్న చర్యలు ఏమిటి? ‘రోడమైన్ బి’ అంటే ఏమిటి? పీచు మిఠాయిలోనే కాకుండా ఇంకా ఎలాంటి ఆహార పదార్థాల్లో ఇది ఉంటుంది? దీన్ని గుర్తించడం ఎలా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం.
పరీక్షల ఫలితాలను బట్టి నిర్ణయం: ఆంధ్రప్రదేశ్
పీచు మిఠాయి శాంపిళ్లను ఈ వారంలోనే టెస్టింగ్ కోసం పంపించామని, ఈ పరీక్షల ఫలితాలను బట్టి దీనిని నిషేధించాలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జె. నివాస్ చెప్పినట్లు ది హిందూ పత్రిక తెలిపింది.
“సింథటిక్, అనుమతించని రంగులు ఉపయోగించి పీచు మిఠాయి తయారు చేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే రోడమైన్ బి, మెటనిల్ ఎల్లో లాంటివి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. అయితే వాటిని స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తున్నారు. వాటి వాడకం తగ్గించినప్పటికీ వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనే దానిపై అవగాహన అవసరం" అని నివాస్ చెప్పినట్లు హిందూ కథనం పేర్కొంది.
శాంపిళ్లను సేకరించి వాటిని పరీక్షించడానికి నెల రోజులు పడుతుందని ఆయన చెప్పారు. తమిళనాడులో పీచు మిఠాయి మీద నిషేధం విధించారని తెలిసిన తర్వాత వ్యాపారుల్లో అనేక మంది ఇప్పటికే అమ్మకాలను ఆపేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
“పీచు మిఠాయిలో కృత్రిమ రంగులేవీ కలపకపోయినా వాటిని తినడం అంత మంచిది కాదు. ఎందుకంటే వాటిని అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో పీచు మిఠాయి తయారు చేసే మిషన్ నుంచి ఇనుప ముక్కలు విడిపోయి తినే పదార్థంలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద పెద్ద జాతరలు, సంతల దగ్గర పీచు మిఠాయి అమ్మకాలను నియంత్రించాం’’ అని నివాస్ చెప్పారు.
బెల్లం, మసాలా దినుసులు, కారం, పాల ఉత్పత్తులు ఇతర ఆహార పదార్థాల్లో కల్తీపై తమ శాఖ నిఘా పెంచిందన్నారు.
స్కూళ్లు, ఇతర ప్రాంతాల్లో పిల్లలు తినే ఆహార పదార్ధాలు, తిను బండారాల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చాలా ప్రాంతాల్లో కాలం చెల్లిన వాటిని అమ్ముతున్నారని ఆయన అన్నారు.
పీచు మిఠాయిపై పుదుచ్చేరి, తమిళనాడు నిషేధం
తమిళనాడులో ఇకపై ఆహార పదార్ధాల్లో రోడమైన్ బి అనే పదార్ధాన్ని కలిపినా, అలా కలిపిన వాటిని దిగుమతి చేసుకున్నా, అమ్మినా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం-2006 కింద శిక్షిస్తామని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి మా. సుబ్రమణియన్ తెలిపారు.
చెన్నైలోని కొన్ని ప్రాంతాలతో పాటు బీచ్‌లలో అమ్ముతున్న పీచు మిఠాయిల శాంపిళ్లను తమిళనాడు ప్రభుత్వం పరీక్షల కోసం గవర్నమెంట్ ఫుడ్ అనాలసిస్ ల్యాబొరేటరీకి పంపింది.
పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో, రాష్ట్రంలో వాటి అమ్మకాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ప్రభుత్వం కంటే ముందే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పీచు మిఠాయి అమ్మకాలను నిషేధించారు.
ఫిబ్రవరి 10న పుదుచ్చేరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
”పీచు మిఠాయిలో రంగు వచ్చేందుకు రొడామిన్ బి అనే రసాయనాన్ని కలుపుతున్నారు. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ రంగును వస్త్రాల తయారీకి వాడతారు” అని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు.
ఆమె ఈ ప్రకటన చేసిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని పీచు మిఠాయి శాంపిళ్లను పరీక్షలకు పంపింది.
పీచు మిఠాయిని సీజ్ చేసిన తెలంగాణ
తెలంగాణలో ప్రస్తుతం మేడారం జాతర జరుగుతున్న ప్రాంతంలో కొంత మొత్తంలో పీచు మిఠాయిని సీజ్ చేశారు అధికారులు.
“పీచు మిఠాయిలో రోడమైన్ బి ఉన్నట్లు మేం గుర్తించాం. దీని వల్ల క్యాన్సర్ వస్తుంది. ఇది పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాడే పదార్థం. దీన్ని ఆహార పదార్థాల్లో వాడకూడదు” అని తెలంగాణ స్టేట్ ఫుడ్ లేబోరేటరీ, ఫుడ్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్ హెడ్ లక్ష్మీనారాయణ రెడ్డి ది హిందూ పత్రికతో చెప్పారు.
పీచు మిఠాయిపై దాడులు చెయ్యడం, సీజ్ చెయ్యడం తెలంగాణలో ఇదే తొలిసారి. పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తర్వాత, రంగులు కలుపుతుండటంపై తెలంగాణ కూడా చర్యలు చేపట్టింది.
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా పీచు మిఠాయి శాంపిళ్లను పరీక్షలకు పంపాయి.
“రాష్ట్రంలో సంతలు, ఎగ్జిబిషన్లు, పెళ్లిళ్లు, పార్కులు, స్కూళ్లు ఇలా అనేక ప్రాంతాల్లో అమ్ముతున్న పీచు మిఠాయి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపాం. ఫలితాలను బట్టి నిషేధం గురించి నిర్ణయం తీసుకుంటాం” అని కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ కమిషనర్ డాక్టర్ హరీశ్వర చెప్పారు.
కారం పొడిలోనూ ‘రోడమైన్ బి’ వినియోగం
రోడమైన్ బి పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే రంగు. దీన్నే కార్సినోజిన్ అని కూడా అంటారు. దీన్ని పీచు మిఠాయి తయారీలోనే కాదు, జెల్లీలు, క్యాండీలు, చివరకు కారం పొడి ఎర్రగా కనిపించేందుకు అందులో కూడా ఉపయోగిస్తుంటారు.
క్యాన్సర్‌కు దారి తీసే రసాయనాలను మూడు గ్రూపులుగా వర్గీకరించింది ‘ఇంటర్నేషనల్ ఏజన్సీ ఫర్ రీసర్స్ ఆన్ క్యాన్సర్’. ఇందులో రోడమైన్ బిని ‘క్లాస్ సి’ కింద వర్గీకరించారు.
‘‘ఇది జెనోటాక్సిక్, డీఎన్‌ఏపై ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి, క్యాన్సర్లకు దారి తీస్తుంది. అందుకే 2005లో యూరోపియన్ యూనియన్ ఈ సమ్మేళనాన్నినిషేధించింది’’ అని సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర కృష్ణ దాశరథి బీబీసీతో చెప్పారు.
రోడమైన్ బి కలిపిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జీర్ణశయాంతర పేగులకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్ నరేంద్ర హెచ్చరించారు. ఆహారం తీసుకున్న తర్వాత అందులో ఉండే రసాయనాలు, విష పదార్థాలను కాలేయం, కిడ్నీలు విసర్జిస్తాయన్నారు. రోడమైన్- బి ఉన్న ఆహార పదార్థాల వల్ల కాలేయం, కిడ్నీ, మూత్రాశయ సమస్యలు, క్యాన్సర్లు రావచ్చని తెలిపారు.
పీచు మిఠాయి ఎక్కువగా పిల్లలు తింటుంటారు. ఇది తినడం వల్ల వారిలో ఏం జరుగుతుందనేది శాస్త్రీయంగా రుజువు కాలేదు. అయితే దాని ప్రభావం వారి పెరుగుదలపై ఉంటుందని, దీర్ఘకాలంలో దీని ప్రభావం బహిర్గతం కావడం వల్ల అవి క్యాన్సర్లకు దారి తీయొచ్చని ఆయన చెప్పారు.
రోడమైన్ బి తో పాటు సూడాన్ వన్, టూ, త్రీ, ఫోర్, పారా రెడ్, ఆరెంజ్ టు అనే రంగుల్ని ఆహారాన్ని కల్తీ చేయడానికి ఉపయోగిస్తున్నారని డాక్టర్ నరేంద్ర తెలిపారు.
రోడమైన్ బి అంటే ఏమిటి?
రోడమైన్ బి సింథటిక్ కలర్. దీన్ని ఉపయోగించడం వల్ల ఎరుపు, గులాబీ రంగు మరింత మెరుగ్గా కనిపిస్తాయి.
ఈ రసాయన ద్రావణాన్ని బట్టల తయారీ, కాగితం, తోలు పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. తయారీకయ్యే ఖర్చు తక్కువగా ఉండటం, నీటిలో కలిసిపోవడం వల్ల పరిశ్రమలు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.
రోడమైన్ బిలో రసాయనాలను జీవ వ్యర్థాలుగా మార్చడం సాధ్యం కాదు. ఇది వేడి, వెలుతురుని తట్టుకుని నిలబడుతుంది.
రోడమైన్ బి నీటిలో కరిగి ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. 2023 అక్టోబరులో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రోడమైన్ బితో స్వీట్ పొటాటోలను ఎలా కలుషితం చేస్తారనే దానిపై ఓ వీడియో విడుదల చేసింది.
రోడమైన్-బిని నిషేధించారా?
వస్త్రాలు, తోలు పరిశ్రమల్లో వీటిని ఉపయోగించేందుకు అనుమతి ఉన్నా, ఆహార పదార్థాల్లో వినియోగించడంపై నిషేధం ఉంది.
ఆహార పదార్థాల్లో కృత్రిమ రంగుల వాడకానికి అనుమతులు ఉన్నాయి. అయితే ఇవి ఏయే ఆహార పదార్థాల్లో ఎంత పరిమాణంలో వాడాలనే దానిపై ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కమిషన్ నిబంధనల్ని రూపొందించింది.
రోడమైన్ బి హాని కారకం కావడంతో దీన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించడంపై ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ కమిషన్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది.
రోడమైన్-బి ఉండే ఆహార పదార్థాలు ఏవి?
ఆహార పదార్దాలు ఎరుపు, గులాబీ రంగులో కనిపించేందుకు రోడమైన్ బి ఉపయోగిస్తారు. రోజ్ మిల్క్‌లో రోడమైన్ బి కలుపుతారు.
పీచు మిఠాయితో పాటు రోజ్ మిల్క్ కూడా ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారని చెన్నై జిల్లా ఆహార భద్రతా విభాగపు అధికారి సతీష్ కుమార్ చెప్పారు.
"పీచు మిఠాయిలో ఉండే రోడమైన్ బి, రోజ్‌మిల్క్, గోరింటాకు, ఎర్ర ముల్లంగిలోనూ కలుపుతారు. దీన్ని పాలకోవాపైనా చల్లుతారు" అని ఆయన బీబీసీతో చెప్పారు.
"ఆహార ఉత్పత్తుల్లో అనుమతించే వర్ణద్రవ్యాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎరుపు రంగు కోసం అల్లూరా రెడ్, ఆకుపచ్చ రంగు కోసం ఆపిల్ గ్రీన్. అవి కూడా నిర్దిష్ట మొత్తంలో మాత్రమే ఆహార ఉత్పత్తిలో ఉండాలి. అంతే కానీ రోడమైన్ బిని వాడకూడదు. ఏదైనా ఆహార ఉత్పత్తిలో స్వల్ప మొత్తంలో కూడా ఉంటుంది” అని ఆయన చెప్పారు.
చెరకు రసంలోనూ ఎరుపు రంగును పెంచడానికి రోడమైన్ బిని ఉపయోగిస్తున్నారు. అదే విధంగా సాస్‌లు, కారంలో ఎరుపు రంగు కోసం ఈ సింథటిక్ రంగును చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నారు.
ఇంటి వద్దే ఎలా తెలుసుకోవాలి?
ఆహార ఉత్పత్తుల్లో రోడమైన్-బి ఉందో, లేదో వినియోగదారు వెంటనే గుర్తించలేరు. అయితే, కొన్ని సాధారణ పరీక్షలతో ఆహార ఉత్పత్తుల్లో ఈ హానికర రసాయనం ఉందో, లేదో తెలుసుకోవచ్చు. వాటిని మీ ఇంట్లోనే చేసుకోవచ్చు.
రోడమైన్-బి నీరు, నూనెలో సులభంగా కలుస్తుంది. ఈ లక్షణంతో ఆహార పదార్థాల్లో రోడమైన్-బి ఉందో లేదో తెలుసుకునేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అందించింది.
ఉదాహరణకు, మీరు ఇంట్లో కందగడ్డ ఉపరితలంపై ఎరుపు రంగును పరీక్షించవచ్చు. కొద్ది మొత్తంలో పీచు మిఠాయిని నీటిలో లేదా నూనెలో నానబెట్టాలి.
నానపెట్టిన పీచు మిఠాయిని కందగడ్డపై రుద్దినప్పుడు పీచు మిఠాయి గులాబీ రంగులోకి మారితే అందులో రోడమైన్ బి కలిపినట్లు అర్థం. అలా కాకుండా పీచు మిఠాయి రంగు తెల్లగా ఉంటే కలపలేదని తెలుసుకోవచ్చు.
ఆహారంలో రోడమైన్ బి, ఇతర నిషేధిత రసాయనాల ఉనికిని ఎలా గుర్తించాలో వివరించే వీడియోలను భారత ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.youtube.com/@fssai_india లో చూడవచ్చు.
అలాంటి ఆహార పదార్థాల విషయంలో ఏం చేయాలి?
పీచు మిఠాయిలో రోడమైన్- బి ఉందో లేదో వినియోగదారులు కచ్చితత్వంతో చెప్పలేరు. ఆహార భద్రత ప్రయోగశాలలో నమూనాలను పరీక్షించిన తర్వాత మాత్రమే అది ఉందో, లేదో తేల్చుకోవచ్చు.
తమిళనాడు, పుదుచ్చేరిలో సేకరించిన నమూనాలను ల్యాబొరేటరీ పరీక్షించిన తర్వాత మాత్రమే సురక్షితం కాదని ఆహార భద్రతా విభాగం ప్రకటించింది.
"ఆహార పదార్థంలో నిషేధిత రోడమైన్-బి ఉందా లేదా అనేది వెంటనే చెప్పలేం. కానీ ప్రజలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీ దృష్టిని ఆకర్షించే ప్రకాశవంతమైన రంగు ఉంటే, అది కూరగాయలు, పండ్లు, డెజర్ట్‌లు, చాక్లెట్లు, కేకులు ఏవైనా సరే, వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే, సహజ రంగులు ప్రకాశవంతంగా ఉండవు" అని చెన్నై జిల్లా ఆహార భద్రత అధికారి సతీష్ కుమార్ చెప్పారు.
సాధారణంగా, ఒక పదార్ధం తీసుకోవడం వెంటనే తీవ్రమైన ప్రభావాలను కలిగించదు. ఇలాంటి ఏ పదార్థమైనా, నిరంతరం తీసుకొంటే మరింత హానికరం.
కానీ, “కొన్నిసార్లు ఒక్కసారి తీసుకున్నప్పటికీ అది విషపూరితంగా మారుతుంది. మనుషుల్లో రోగనిరోధక శక్తి, ఆహారంలో ఎంత రోడమైన్ కలిపారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. శరీరంలోకి ఒక్కసారిగా అంత విషం చేరితే అది మెదడుపై ప్రభావం చూపుతుంది" అని చెన్నైలోని స్టాన్లీ హాస్పిటల్ ఫార్మకాలజీ హెడ్ డాక్టర్ చంద్రశేఖర్ బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- గ్రేట్ నికోబార్: భారత ప్రభుత్వ 74 వేల కోట్ల ప్రాజెక్ట్ ఆ తెగకు మరణ శాసనంగా మారనుందా
- అలెక్సీ నవాల్నీ: పుతిన్‌ను ఎదిరించిన నేతతో పెళ్లిపై యూలియా నవాల్నియా ఏమన్నారు?
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, క్యాష్ చేసుకోని బాండ్ల సొమ్మును 15 రోజుల్లో దాతలకు తిరిగి ఇచ్చేయాలి: సుప్రీం కోర్టు స్పష్టీకరణ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)