You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐటీ అవుటేజ్ మాటున సైబర్ దాడులకు తెగబడుతున్న హ్యాకర్లు, ఏం చేయాలి?
- రచయిత, జోయ్ టిడీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులకు కారణమైన ‘ఐటీ అవుటేజ్’ని ఆసరాగా చేసుకుని నేరగాళ్లు సైబర్ దాడులకు తెగబడుతున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నకిలీ ఈమెయిళ్లు, ఫోన్ కాల్స్, వెబ్‌సైట్ల లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు సూచిస్తున్నాయి.
మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్ల(వర్చువల్ మెషీన్లు)లో తలెత్తిన సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. క్రౌడ్‌స్ట్రైక్ అనే సంస్థకు చెందిన ‘ఫాల్కన్ సెన్సర్’ అనే సాఫ్ట్‌వేర్‌లో చిన్న లోపం వల్ల ఈ సమస్య తలెత్తింది.
శుక్రవారం ఏర్పడిన ఈ సమస్య ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు. దీంతో, చాలా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వేల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. బ్రిటన్‌తో పాటు కొన్ని దేశాల్లో వైద్య సేవలపై కూడా ప్రభావం పడింది.
‘‘హలో మేం ఫలానా కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీ కంప్యూటర్‌లో సమస్య వచ్చిందా? అయితే ఈ లింక్ క్లిక్ చేసి ఈ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి, పరిష్కారం అయిపోతుంది’’ అంటూ మోసగాళ్లు ఈమెయిల్స్, కాల్స్ చేసే ప్రమాదం ఉందని, ఇప్పటికే అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయని నిపుణులు చెబుతున్నారు.
క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ సీఈవో జార్జ్ కర్ట్జ్ కూడా ప్రజలకు సూచనలు చేశారు. ‘‘ఎవరైనా మా కంపెనీ ప్రతినిధులమని కాల్ చేస్తే, వాళ్లు నిజంగా మా సంస్థకు చెందినవారో కాదో ఒకటికి రెండుసార్లు నిర్ధరించుకున్నాకే వాళ్లు పంపించే సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి’’ అని జార్జ్ చెప్పారు.
‘‘ఇలాంటి దురదృష్టకర ఘటనలను కూడా అవకాశంగా మార్చుకునే మోసగాళ్లు ఉంటారని మాకు తెలుసు’’ అని ఆయన అన్నారు. ఈ సమస్యకు సంబంధించి తాజా అధికారిక సమాచారం, అప్‌డేట్ల కోసం తమ బ్లాగ్‌ను, టెక్నికల్ సపోర్ట్ సిస్టమ్‌ను మాత్రమే అనుసరించాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులకు కారణమైన ఈ ఐటీ సమస్య ఆన్‌లైన్ మోసగాళ్లకు ఒక బహుమతి లాంటిదని ఆస్ట్రేలియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు ట్రోయ్ హంట్ అన్నారు.
క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ ప్రతినిధులమంటూ హ్యాకర్లు ప్రమాదకర లింకులను పంపుతున్నారంటూ ఆస్ట్రేలియన్ సిగ్నల్స్ డైరెక్టరేట్ (ఏఎస్‌డీ) హెచ్చరించింది.
ఈ సమస్యకు సంబంధించి ఏ సమాచారం, సహాయం కావాలన్నా క్రౌడ్‌స్ట్రైక్ సంస్థ వెబ్‌సైట్‌ను మాత్రమే అనుసరించాలని ఏఎస్‌డీ ప్రజలకు సూచించింది.
అంతకుముందు బ్రిటన్‌కు చెందిన నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్(ఎన్‌సీఎస్‌సీ) కూడా ఇలాగే హెచ్చరించింది. అనుమానాస్పదంగా అనిపించే ఈమెయిళ్లను తెరవొద్దని, ఫోన్ కాల్స్ చేస్తూ క్రౌడ్‌స్ట్రైక్, మైక్రోసాఫ్ట్ సంస్థల ప్రతినిధులమంటూ నమ్మించేవారి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇలాంటి కేసులు పెరిగాయని ఆ సంస్థ తెలిపింది.
సైబర్ దాడుల భయాలు..
ఎప్పుడైనా భారీ స్థాయిలో ఐటీ సంబంధిత సమస్యలు వచ్చినప్పుడు, వాటిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు విరుచుకుపడుతుంటారు. అప్పుడు ప్రజల్లోని భయాలను, అనిశ్చితిని దుండగులు అవకాశంగా మార్చుకుంటారు.
అంతర్జాతీయంగా ప్రభావం చూపే ఇతర సమస్యలు తలెత్తినప్పుడు కూడా హ్యాకర్లు వివిధ రకాలుగా దాడులు చేస్తుంటారు. కోవిడ్-19 విజృంభించినప్పుడు అలాగే జరిగింది. ప్రముఖ సంస్థల పేర్లతో ప్రమాదకరమైన లింకులను ఈమెయిళ్లలో పంపి దాడులు చేసిన ఘటనలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి.
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ ఐటీ సమస్యను కూడా హ్యాకర్లు అవకాశంగా మార్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.
క్రౌడ్‌స్ట్రైక్ పేరును పోలిన వెబ్‌సైట్ డొమైన్ రిజిస్ట్రేషన్ల సంఖ్య ఇప్పటికే భారీగా పెరిగిందని సెక్యూర్‌వర్క్స్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు తెలిపారు. క్రౌడ్‌స్ట్రైక్ అధికారిక వెబ్‌సైట్ ఇదేనంటూ ప్రజలను నమ్మించి, నకిలీ లింకులతో దాడులు చేసేందుకు హ్యాకర్లు అలాంటి ఎత్తులు వేస్తుంటారని వారు చెప్పారు.
క్రౌడ్‌స్ట్రైక్ సాఫ్ట్‌వేర్ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేందుకు ఇంకా సమయం పట్టేలా ఉంది కాబట్టి, ప్రజలంతా ముఖ్యంగా ఆ సాఫ్ట్‌వేర్ లోపం వల్ల ఇబ్బంది పడుతున్నవారు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అజూర్ క్లౌడ్‌లో వర్చువల్ మెషీన్లు వాడుతున్నవారికి క్రౌడ్‌స్ట్రైక్ సమస్య వస్తే ఎలా పరిష్కరించుకోవాలో మైక్రోసాఫ్ట్ వివరించింది. పూర్తి వివరాలను ఇక్కడ చూడొచ్చు.
1500లకు పైగా విమానాలు రద్దు
ఐటీ సంబంధిత సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కొనసాగుతోంది.
భారత కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం 2:30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా 1,639 విమానాలు రద్దు అయ్యాయని ఎయిర్‌లైన్ డేటా కంపెనీ సిరియం తెలిపింది.
ఈ అంతరాయం కారణంగా శుక్రవారం మొత్తం 6,855 విమానాలు రద్దు అయ్యాయని ఆ సంస్థ వెల్లడించింది. అంటే షెడ్యూల్ అయిన విమానాల్లో ఇది 6.2 శాతం.
ఐటీ సమస్య కారణంగా విమానాల రద్దుతో పాటు కొన్నిచోట్ల ఇతర సేవలు కూడా ప్రభావితమయ్యాయి.
కంప్యూటర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో బోర్డింగ్ పాసులను చేతి రాతతో రాసి ఇచ్చారు.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైజాగ్ వెళ్లే ఇండిగో విమానం ప్రయాణీకులకు చేతిరాతతో కూడిన బోర్డింగ్ పాస్‌లు ఇచ్చారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)