ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూ సొరేన్ కన్నుమూత

ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబూ సొరేన్ మృతిచెందారు.

ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ తెలిపారు.

‘‘గౌరవనీయ ఆదివాసీల గురూజీ మనల్ని అందరినీ విడిచివెళ్లిపోయారు. నేనీ రోజు శూన్యంగా మారా’’ అని హేమంత్ సొరేన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రాశారు.

శిబూ సొరేన్ ఝార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు. ఆ పార్టీకి ఆయన దీర్ఘకాలం అధ్యక్షుడిగా ఉన్నారు. ఝార్ఖండ్‌కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. దీంతోపాటు పార్లమెంటు ఉభయసభలలోనూ ఆయన సభ్యుడిగా పనిచేశారు.

ఝార్ఖండ్‌లోని సంతాల్ గిరిజన తెగలో జన్మించిన శిబూ సొరేన్ బాల్యమంతా కష్టాలతోనే గడిచింది.

బిహార్‌లోని అటవీ, గిరిజన ప్రాంతాలను ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రంగా గుర్తించాలంటూ శిబూసొరేన్ 1973లో ఝార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించారు.

దాదాపు మూడు దశాబ్దాల పోరాటం తరువాత 2000 సంవత్సరంలో ఆయన లక్ష్యం నెరవేరింది.

దుమ్కా స్థానం నుంచి ఆయన 1980 నుంచి 2019 వరకు ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

2019లో బీజేపీ అభ్యర్థి సునీల్ సొరేన్ చేతిలో ఓటమి చెందారు.

2005, 2008-09, ఆ తర్వాత 2009-10లో మూడుసార్లు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

రాష్ట్రంతో పాటు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు.

ఆరోగ్య కారణాల రీత్యా క్రమంగా క్రియాశీల రాజకీయాలకు దూరమైన శిబూసొరేన్ వారసుడిగా ఆయన కుమారుడు హేమంత్ సొరేన్ పార్టీ బాధ్యతలను చేపట్టారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)