వడగళ్ల వానలు ఎందుకు పడతాయి? అవి వేసవిలోనే ఎందుకు ఎక్కువ?

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ తెలుగు కోసం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ మార్చి నెలలో వడగళ్ల వానలు పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో తూర్పు కనుమల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాతోపాటు తెలంగాణలోని కరీంనగర్, హైదరాబాద్‌లలో పెద్ద ఎత్తున వడగళ్లు పడ్డాయి.

మార్చి రెండో వారంలో తెలంగాణలో పడ్డ వడగళ్ల పరిమాణం పెద్దదిగా ఉండటమే కాకుండా రోడ్లు కనిపించనంత భారీ స్థాయిలో అవి నేలపై పడ్డాయి.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురిసిన వడగళ్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయని ఆంధ్రా విశ్వవిద్యాలలయం వాతావరణ విభాగాధిపతి ప్రొఫెసర్ నాయుడు బీబీసీతో చెప్పారు.

2022లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఏప్రిల్‌లో వడగళ్ల వానలు పడ్డాయి.

వడగళ్లు ఎలా ఏర్పడతాయి?

“వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి, ఆ వేడిగాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యుములోనింబస్ మేఘాలు అంటారు.

అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి.

అక్కడ గాలులు కిందకూ, పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకుంటాయి.

అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటాం” అని ప్రొఫెసర్ నాయుడు వివరించారు.

వడగళ్లు ఏర్పడటానికి ఎంత సమయం పడుతుంది?

మేఘాలు ఏర్పడి, అవి మళ్లీ వడగళ్ల వాన రూపంలో నేలపై పడేందుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడతుంది.

వడగళ్లు ఏర్పడటంలో అప్పటికప్పుడు స్థానిక వాతావరణంలో జరిగే మార్పుల పాత్ర గురించి పుణెలోని నేషనల్ మాన్సూన్ మిషన్ ప్రాజెక్టు మేనేజర్ ప్రొఫెసర్ రామకృష్ణ వివరించారు.

“వాతావరణంలో అస్థిరత పెరిగిపోయింది. దీంతో గ్లోబల్ వార్మింగ్ స్థాయి కూడా పెరుగుతోంది. కార్బన్ డయాక్సైడ్ 400 పీపీఎం స్థాయిని దాటేస్తోంది.

వడవళ్ల వానలు ఇటీవల ఎక్కువగా కనిపించడానికి ప్రధానంగా స్థానికంగా వాతావరణంలో పెరుగుతున్న మార్పులే కారణం. ఇందులో పట్టణీకరణది ముఖ్య పాత్ర.

ఎక్కడైతే వేడి వాతావరణం ఎక్కువగా ఉండి, చల్లని గాలులు వచ్చి కలుస్తాయో అక్కడ ఏర్పడ్డ మేఘాలు వాతావరణంలో పై భాగానికి చేరుకుంటాయి. ఈ మేఘాల పైభాగంలో సూపర్ కూల్డ్ వాటర్ ఉంటుంది. క్రమంగా ఈ మేఘం గడ్డ కట్టేస్తుంది. ఈ గడ్డ కట్టిన మేఘంలో మంచు గడ్డలు అధికంగా ఉంటాయి.

ఈ మేఘానికి సమీపంలో పైకి వీచే గాలులు ఈ గడ్డ కట్టిన మేఘాన్ని క్రమంగా బలహీనపరుస్తూ ఉంటాయి. అదే సమయంలో గడ్డ కట్టిన రెండు మేఘాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టి ముక్కలుగా విడిపోతూ నేలపై పడతాయి. అలా ఢీ కొట్టినప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగానే విడిపోతాయి.

అవి కిందకు వస్తున్నప్పుడు వాతావరణంలోని గాలితో రాపిడి వల్ల అవి 30 మిల్లీమీటర్ల పరిమాణం వరకు ఉంటాయి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ఏర్పడే వడగళ్లు క్రికెట్ బాల్ అంత వరకు ఉంటాయి” అని ప్రొఫెసర్ రామకృష్ణ చెప్పారు.

వడగళ్ల వానలు వేసవిలోనే ఎక్కువ.. ఎందుకు?

వడగళ్ల వానలు సాధారణంగా వేసవిలోనే ఎక్కువగా పడతాయి. ఎందుకంటే- వడగళ్లు ఏర్పడాలంటే నేలపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వడగాళ్ల వానలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని ఏయూ వాతావరణ విభాగం ప్రొఫెసర్ సునీత బీబీసీతో చెప్పారు.

ఫిబ్రవరి నుంచి మే వరకు వడగళ్ల వానలు కురిసేందుకు తగిన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో భూమిపై వేడి ఎక్కువగా ఉంటుంది. సముద్రంపై కాస్త చల్లని వాతావరణం ఉంటుంది.

దీంతో క్యుములోనింబస్ లాంటి మేఘాలు ఏర్పడి అవి వాతావరణంలో ఎత్తుకు చేరుకుంటాయి. అవే వడగళ్ల వాననిచ్చే మేఘాలు. ఈ మేఘాలు సాధారణంగా వేసవిలోనే ఏర్పడతాయి. అందుకే వడగళ్ల వానలు కూడా వేసవిలోనే ఎక్కువగా చూస్తుంటాం.

వేసవిలోనే వడగళ్లు పడతాయనుకోవడం పొరపాటే. స్థానికంగా ఉండే వాతావరణ పరిస్థితులను బట్టి ఏడాది పొడవునా ఎక్కడైనా, ఎప్పుడైనా ఇవి కురిసే అవకాశముందని ప్రొఫెసర్ సునీత స్పష్టం చేశారు.

ప్రతిసారి వడగళ్లు ఎందుకు కురవవు?

వడగళ్ల వాన పడితే అదొక పెద్ద వార్త. ఎందుకంటే వడగళ్ల వానలు సాధారణంగా పడవు.

ప్రతి వర్షంలోనూ వడగళ్లు ఎందుకు పడవు అనే ప్రశ్నకు ప్రొఫెసర్ రామకృష్ణ సమాధానం చెప్పారు.

ఏ వానైనా మేఘం నుంచి కురిసేదే. అలాగే క్యుములోనింబస్ మేఘాల వల్ల సాధారణంగా వడగళ్ల వానలు పడతాయి.

అయితే ఆ మేఘాలు ఒకదానిని ఒకటి ఢీ కొట్టి ముక్కలుగా విడిపోయి భూమిని చేరేలోపు వాతావరణంలోని వేడి వల్ల వడగళ్లు మధ్యలోనే చాలా వరకు కరిగిపోతాయి. అందుకే సాధారణ వర్షాలు కురిసేటప్పుడు వడగళ్లు కనిపించవు.

అయితే మేఘాల్లో మంచు బిందువుల పరిమాణం ఎక్కువగా ఉంటే అవి ముక్కలుగా విడిపోయినప్పుడు కూడా భారీ సైజులోనే విడిపోతాయి.

దాంతో అవి నేలకు చేరుకునే సమయంలో వాతావరణంలోని ఉష్ణోగ్రత, గాలి రాపిడికి కొంత కరిగిపోయినా కూడా మిగతావి నేలపై పడతాయి. వాటినే మనం వడగళ్లు అంటాం.

వడగళ్లు తినడం మంచిది కాదు

వడగళ్ల వానలు పడేటప్పుడు కొందరు ఆ మంచు ముక్కల్ని తినడం మనం చూస్తుంటాం. అలా తినడం మంచిది కాదని ప్రొఫెసర్ రామకృష్ణ హెచ్చరించారు.

50 ఏళ్ల క్రితం వాతావరణానికి, ఇప్పటీకి చాలా మార్పులొచ్చాయి.

వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోయింది.

ఎప్పుడో మన పెద్దలు వడగళ్లు తింటే మంచిదని చెప్తుండేవారని విన్నాం, కానీ అది కూడా సరైనది కాదని ఆయన తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అయితే వడగళ్లు తిననే తినకూడదని చెప్పారు.

వడగళ్ల వాన కురిసేటప్పుడు బయట ఉండకపోవడమే మంచిది.

భారత్‌లో పంట నష్టాన్ని కలిగించే వడగళ్ల వానలే కానీ, ప్రాణనష్టాన్ని కలిగించిన వడగళ్ల వానలు దాదాపుగా లేవని, అయినప్పటికీ మనం అశ్రద్ధ చూపితే ప్రాణ నష్టం కూడా ఉండొచ్చని ప్రొపెసర్ రామకృష్ణ హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)