పాకిస్తాన్ వరదలు: ‘మాకు సరుకులు, మందులు కావాలి’.. సహాయం కోసం బీబీసీ బృందానికి నోట్ విసిరిన బాధితులు

    • రచయిత, ఫర్హాత్ జావేద్
    • హోదా, బీబీసీ న్యూస్

పాకిస్తాన్ పర్యటక ప్రాంతం మనూర్ వ్యాలీలో వరదలు ముంచెత్తాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్న మనూర్ లోయ దగ్గరున్న నదీ తీరంలో కొన్ని వందల మంది చిక్కుకుపోయారు.

వరదల్లో కనీసం 10 వంతెనలు, కొన్ని డజన్ల భవనాలు దెబ్బ తిన్నాయి.

"మాకు సరుకులు కావాలి. మందులు కావాలి. ఈ వంతెనను నిర్మించండి. మా దగ్గర ఏమి మిగలలేదు" అని అంటూ వరదలను కవర్ చేసేందుకు వెళ్లిన బీబీసీ బృందానికి వంతెన అవతలి వైపు నుంచి చేతి రాతతో రాసిన నోట్‌ను విసిరారు.

మనూర్ వ్యాలీ కాఘన్ పర్వతాల పై నెలకొని ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏర్పడిన వరదల వల్ల 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

వరదలు, కొండ చరియలు విరిగిపోవడంతో వ్యాలీకి చేరుకునే రోడ్డు మార్గాలు బాగా దెబ్బ తిన్నాయి. ఈ ప్రమాదకరమైన మార్గంలో ఒక గంట సేపు ప్రయాణం చేసి బీబీసీ బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది.

మనూర్‌లో రెండు వంతెనలు పూర్తిగా కూలిపోయాయి. ప్రస్తుతానికి ఒక తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేశారు.

వంతెన పై ఒక మహిళ తన సామాన్లతో పాటు కూర్చున్నారు. వంతెన అవతల ఉన్న తన ఇల్లు కనిపిస్తోంది కానీ, ఇంటి దగ్గరకు వెళ్లే అవకాశం కనిపించటం లేదని ఆమె బీబీసీతో చెప్పారు.

"నా ఇల్లు, పిల్లలు వంతెన అవతల వైపున ఉండిపోయారు. ప్రభుత్వాధికారులు వచ్చి ఈ వంతెనకు మరమ్మతులు చేస్తారేమోనని నేనిక్కడ రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. కానీ, కొండకు అవతల వైపు నుంచి నడుచుకుంటూ వెళ్ళమని అధికారులు చెబుతున్నారు. కానీ, అలా వెళ్లాలంటే మాకు కనీసం 8 - 10 గంటలు పడుతుంది. నేనంత దూరం ఎలా నడవగలను?" అని అడిగారు.

ఈ తాత్కాలిక వంతెన కింద నీరు పొంగి, తిరిగి వర్షం మొదలైతే, నడక మొదలుపెడతానని ఆమె చెప్పారు.

మేము నదికి అవతల వైపున ఉన్న మట్టి ఇళ్ల ముందు కూర్చున్న మహిళలు, పిల్లలు, పురుషులను చూశాం. మేం ప్రభుత్వ అధికారులమని భావించి వాళ్ళు మమ్మల్ని చూసి చేతులు ఊపారు.

కొంత మంది చేతి రాతతో రాసిన ఒక కాగితాన్ని రాళ్లతో కట్టిన ప్లాస్టిక్ బ్యాగులో ప్యాక్ చేసి మా వైపు విసిరారు.

నదికి ఇవతల వైపు ఉన్న వారితో సంప్రదింపులు జరిపేందుకు వారికున్న ఒకే ఒక్క మార్గం ఇదే.

ఈ ప్రాంతంలో మొబైల్ నెట్ వర్క్ కూడా పని చేయడం లేదు.

ఆ ఉత్తరంలో వారనుభవిస్తున్న పరిస్థితిని వివరించారు. వరదల్లో చిక్కుకుపోయిన గ్రామస్థులకు సరుకులు, ఔషధాలు కావాలని అభ్యర్ధించారు.

"చాలా మంది రోగులు కాలి నడకన గ్రామం దాటి వెళ్ళలేరు. దయ చేసి ఈ వంతెనను నిర్మించండి" అని ఆ ఉత్తరంలో రాశారు.

"మాకు సరుకులు కావాలి. మాకు రోడ్డు కావాలి" అని 60 ఏళ్ల అబ్దుల్ రషీద్ కోరారు. ఆయన కుటుంబాన్ని పోషించేందుకు ఆయనకున్న ఒకే ఒక్క ఆధారమైన బండిని ఈ వరదల్లో పోగొట్టుకున్నారు.

"ఇక్కడ చాలా మంది తమ ఆస్తులు, జీవనాధారాన్ని కోల్పోయారు. వాళ్లందరికీ సహాయం కావాలి. వాళ్ళకి తిండి కావాలి. ఇక్కడొక చిన్న మార్కెట్ ఉండేది. అది కూడా కొట్టుకుపోయింది. షాపుల్లో ఉండే సరుకులన్నీ కొట్టుకుపోయాయి".

"నదికి అవతల వైపున మా ఇల్లు ఉంది. ఇప్పుడు ఇంటికి చేరేందుకు నేను 8 గంటల సేపు నడవాలి. ఈ వయసులో నేనెలా నడవగలను?" అని ప్రశ్నించారు.

ఇక్కడ షాపులు, హోటళ్లు ధ్వంసమయ్యాయి. సోహేల్ ఆయన సోదరుడు ఈ వరదల్లో వాళ్ళ మొబైల్ షాపును కూడా కోల్పోయారు.

"ఆయన మూడు కుటుంబాలను పోషించే బాధ్యత ఆయన పై ఉందని బీబీసీతో చెప్పారు. ఈ వరదల వల్ల ఆయన భవిష్యత్తు అనిశ్చితిలో పడిందని అన్నారు.

"ఏమి చేయాలో అర్ధం కావడం లేదు. మాకు సహాయం చేసేందుకు ఎవరూ రాలేదు. ఇక్కడున్న దుకాణదారులంతా ఆందోళనతో ఉన్నారు. వాళ్లంతా పేద వాళ్ళు. కానీ, వాళ్ళందరి పై పెద్ద కుటుంబాలను పోషించాల్సిన భారం ఉంది" అని అన్నారు.

"ఇక్కడకు అధికారులు, రాజకీయ నాయకులు ఫోటోలు తీసుకునేందుకు మాత్రమే వస్తారు. ఎవరూ సహాయం చేయడం లేదు" అని అన్నారు.

కానీ, జిల్లా డిప్యూటీ కమీషనర్ మాత్రం ఇక్కడ సమగ్రమైన రక్షణ చర్యలను నిర్వహించి, హోటళ్లలో ఉన్నవారినందరినీ ఖాళీ చేయించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసినట్లు చెప్పారు.

"మేము ఆస్తి నష్టాన్ని అంచనా వేశాం. వరద బాధితులకు త్వరలోనే పరిహారం అందచేస్తాం. వంతెన పునర్నిర్మాణ పనులు మొదలయ్యాయి. కానీ, ఇది పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది" అని ఆయన బీబీసీ కి చెప్పారు.

ఈ వరదలకు వాతావరణ మార్పులే కారణమని ప్రభుత్వం చెబుతుంటే, స్థానికులు మాత్రం ఈ విపత్తుకు ప్రభుత్వం, స్థానిక అధికారులే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నది ఒడ్డున హోటళ్ల నిర్మాణానికి అనుమతులివ్వడమే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు.

"ఈ హోటళ్లు, మార్కెట్‌లు సహజ నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశాయి. దీంతో, ఈ వరదల వల్ల భారీ నష్టం ఏర్పడింది. దీనిని చాలా సులభంగా నివారించి ఉండేవాళ్ళం. అని కఘాన్ నివాసి అన్నారు.

కఘాన్‌లో కున్హార్ నాదీ తీరంలో, చుట్టు పక్కలున్న పర్వత ప్రాంతాల్లో చాలా హోటళ్లు నిర్మించారు. ఈ వరదల్లో కొన్ని హోటళ్లతో పాటు ఒక పోలీస్ స్టేషన్, ఒక మత బోధన చేసే పాఠశాల కూడా ధ్వంసమయింది.

పోలీస్ స్టేషన్‌కు కొన్ని వందల మీటర్ల దూరంలో ఒక తాత్కాలిక టెంట్‌లో ఒక కుటుంబం కూర్చుని ఉన్నారు. ఈ వరదల్లో వారి కుటుంబలో 8 మంది సభ్యులు కొట్టుకుపోయారని చెప్పారు.

భారీ తుఫానులు, వరదలు పాకిస్తాన్ లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

పాకిస్తాన్‌లో వరదలకు చిక్కుకుని 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కనీసం 700,000 ఇళ్ళు ధ్వంసమయి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

కొన్ని లక్షల మంది తిండి, నీరు, వసతి కోసం వేచి చూస్తుండగా, మరో వైపు రక్షణ బృందాలు ఆ ప్రాంతానికి చేరేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సింధ్, బాలోచిస్తాన్ ప్రావిన్సులు ఈ వరదలకు అధికంగా ప్రభావితమయ్యాయి. కానీ, ఖైబర్ పఖ్తుంఖ్వా లాంటి పర్వత ప్రాంతాలు మరింత తీవ్రంగా దెబ్బ తిన్నాయి.

వరద ప్రాంతాలను చేరేందుకు సహాయక సంస్థలకు సహకారాన్ని అందించేందుకు పాకిస్తాన్ సేనలను కూడా పిలిపించారు. రోడ్డు మార్గాలు దెబ్బ తినడంతో, హెలీకాఫ్టర్ల ద్వారా మాత్రమే ఈ ప్రాంతాలను చేరేందుకు వీలవుతోంది.

ఈ విపత్తు నుంచి బయటపడేందుకు సహాయం చేయమని పాకిస్తాన్ మిత్ర దేశాలు, దాతలు, అంతర్జాతీయ ఆర్ధిక సంస్థలకు విజ్ఞప్తి చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)