Cost of living: ధరల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్‌లోని చిరు వ్యాపారులపై ఎలాంటి ప్రభావం పడుతోంది

    • రచయిత, ఎన్.తులసి ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అన్ని వర్గాల ప్రజలపైనా ఆ ప్రభావం పడుతోంది.

కూరగాయలు, పండ్లు అమ్మేవారు, కిరాణా దుకాణం నడిపేవారు, ఇలా బతుకుతెరువు కోసం చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనేవారిపై ఈ ప్రభావం ఏ స్థాయిలో ఉంది?

ధరలు విపరీతంగా పెరగడం వల్ల చిరు వ్యాపారుల అమ్మకాల్లో వచ్చిన మార్పులు ఏమిటి?

తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే కొందరితో బీబీసీ మాట్లాడింది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకున్నప్పటికీ, ధరలు పెరగడం వల్ల వ్యాపారం తగ్గిందని వీరు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎంత కష్టపడినా తిండికి, పిల్లల చదువులకు కూడా సరిపోయేంత సంపాదించలేకపోతున్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

“అన్ని రేట్లు పెరిగాయి. మేమేం చేయగలం”

ఎంఆర్ పల్లి సర్కిల్‌లో సెల్వ రాణి ఒక బేకరీ నడుపుతున్నారు. ఈమె సొంత ఊరు తమిళనాడులోని తూత్తుకుడి. పెళ్లి తర్వాత 25 ఏళ్లుగా ఈమె తిరుపతిలోనే ఉంటున్నారు.

రేట్లు తక్కువ ఉన్నప్పుడు వ్యాపారం బాగుండేదని, కరోనావైరస్ వ్యాప్తి తర్వాత అన్ని వస్తువుల రేట్లు బాగా పెరగడంతో వ్యాపారం తగ్గిందని సెల్వ రాణి చెప్పారు.

“కరోనావైరస్ వ్యాప్తితో జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. దీని వల్ల మాకు కూడా వ్యాపారం తగ్గింది. గతంలో జాంగ్రీ, మైసూర్‌పాక్, లడ్డూ లాంటివి కిలో రూ.120కి అమ్మేవాళ్లం. ఇప్పుడు ఈ రేటును రూ.160కు పెంచాం. ఖర్చులు బాగా పెరిగాయి. దీంతో రేట్లు పెంచాల్సి వచ్చింది. మరోవైపు పాలతో చేసే స్వీట్లు కూడా రూ. 340కి అమ్ముతున్నాం. ఒకప్పుడు ఇవి రూ.280కి విక్రయించేవాళ్లం. గతంలో మిక్సర్ 200 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు దీన్ని రూ.240కి పెంచాం. ఒకప్పుడు బ్రెడ్ ప్యాకెట్ రూ.25 ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.30కి పెంచాం. బన్ మాత్రం పెంచలేదు. పది రూపాయలకే అమ్ముతున్నాం. కేక్‌లు కిలో రూ.250కు అమ్మేవాళ్లం. ఇప్పుడు దాన్ని రూ.300కు పెంచాం’’అని సెల్వ రాణి చెప్పారు.

రేట్లు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరిస్తూ.. ‘‘మైదా, చక్కెర, వనస్పతి, నూనె, ప్యాకింగ్ కవర్లు, అట్టలు ఇవన్నీ రేట్లు పెరిగాయి. ప్యాకింగ్ కవర్స్ అయితే కేజీ రూ. 50 నుంచి రూ. 60కి పెరిగాయి. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మేం రేట్లు పెంచాల్సి వచ్చింది’’ అని ఆమె చెప్పారు.

‘‘మైదా 50 కేజీల బస్తా మూడేళ్ల ముందు రూ.1,300గా ఉండేది. ఇప్పుడు అది రూ.1,900. ఆయిల్ కూడా బాగా రేటు పెరిగింది. 70 రూపాయలు ఉండే పామాయిల్ ఇప్పుడు రూ.130. బియ్యం పిండి కిలో ఒకప్పుడు రూ.15 ఉండేది. ఇప్పుడు అది రూ.22. అప్పటికంటే ఇప్పుడు వ్యాపారం బాగా తగ్గిపోయింది. లాభాలు కూడా పూర్తిగా పడిపోయాయి. అన్నీ రేట్లు పెరగడంతో మేం కూడా రేట్లు పెంచాల్సి వచ్చింది’’అని ఆమె వివరించారు.

మరోవైపు ప్రజలు కూడా స్వీట్లు కొనేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారని ఆమె అన్నారు. ‘‘బియ్యం, పప్పులు లాంటి నిత్యావసరాలు కూడా ధరలు పెరగడంతో స్వీట్లు కొనేందుకు ప్రజలు లెక్కలేసుకుంటున్నారు. గతంలో రెండు కేజీలు కొనేవారు ఇప్పుడు కేజీ లేదా అరకేజీ కొంటున్నారు. ఒకప్పుడు వంట మాస్టర్ రూ.400కు వచ్చేవాడు. ఇప్పుడు రూ.700 నుంచి రూ.800 అడుగుతున్నారు. కరెంటు బిల్లులు కూడా పెరిగాయి. ఒకప్పుడు కరెంటు బిల్లు రూ.2,500 వచ్చేది. ఇప్పుడది రూ.4,000 వరకు పెరిగింది’’అని ఆమె చెప్పారు.

లాభాలు పడిపోవడంతో సిబ్బందిని తగ్గించుకుని తామే ఆ పనులు కూడా చేసుకుంటున్నామని సెల్వ మణి అన్నారు. ‘‘ఒక మనిషి చేసే పనిని మనమే చేసుకోవడం వల్ల ఆ మేరకు డబ్బులు కలిసివస్తాయి. పిల్లల చదువుకు ఆ డబ్బులు పనికొస్తాయి. మా అబ్బాయి సీఏ చదువుతున్నాడు. మా అమ్మాయి డిగ్రీతోపాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంటోంది. ఉదయం నుంచి రాత్రి వరకు మేమంతా కలిసి పనిచేస్తాం. మా ఆయన కూడా నాకు సాయం చేస్తారు. లాభాలు ఉన్నా లేకపోయినా ఇదే పనికి అలవాటుపడ్డాం. వేరే పని మాకు అలవాటు లేదు. మా పిల్లలు మంచి ఉద్యోగాల్లో కుదురుకుంటే.. మా కష్టాలు తగ్గుతాయి’’అని ఆమె వివరించారు.

‘‘నెలనెలా పెరుగుతూపోతే ఏం చేస్తాం?’’

పేదలు ఎక్కువగా నివసించే కొర్లగుంటలో చిన్న కిరాణా షాపును లక్ష్మీదేవి నడుపుతుంటారు. పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు ఎంతలా పెరిగిపోయాయో అని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.

‘‘అన్ని పప్పుల రేట్లూ పెరిగిపోయాయి. ఒకప్పుడు బియ్యం బస్తా రూ.900కి వచ్చేది. ఇప్పుడు అది రూ.1100. పాలు అయితే, నెలనెలా ధర పెరుగుతూనే ఉన్నాయి’’అని ఆమె చెప్పారు.

మరోవైపు సబ్బుల ధర కూడా రూ.10 కంటే ఎక్కువే పెరిగిందని లక్ష్మి అన్నారు. ‘‘మేం వాడే సబ్బు ఒకప్పుడు రూ. 26 ఉండేది. ఇప్పుడది రూ. 36. అన్నింటి ధరలు ఇలానే పెరిగాయి. పౌడర్లు, మైదా, గోధుమ పిండి ఇలా ప్రతిదీ ధర పెరిగింది. కేజీ రూ. 25గా ఉండే గోధుమ పిండి ఇప్పుడు రూ. 40. రవ్వ, పంచదార కూడా అంతే. నూనె రోజురోజుకూ రేటు మారిపోతోంది. పామ్ ఆయిల్ ఒకప్పుడు రూ.70 ఉండేది. కానీ, గత నెల ఏకంగా రూ.170కి పెరిగింది. మళ్లీ ఇప్పుడు తగ్గుతోంది’’అని ఆమె చెప్పారు.

తాము మార్కెట్‌కు వెళ్లి కొంచెంకొంచెంగా సరకులు తీసుకొస్తామని, పెట్రోలు ధరలు పెరగడంతో ఆ భారం కూడా తమపై పడుతోందని ఆమె అన్నారు.

మరోవైపు తినుబండారాలపై కమీషన్లు కూడా బాగా తగ్గిపోయాయని లక్ష్మి తెలిపారు. ‘‘బిస్కెట్లు, షాంపూలు, సబ్బులు, సర్ఫ్‌, కాఫీ పొడి ఇలా వస్తువులపై కమీషన్ తగ్గిపోయింది. అర లీటరు పాల ప్యాకెట్ ఒకప్పుడు రూ.26 ఉండేది. ఇప్పుడు రూ.35 అయ్యింది. పెరుగు అర లీటర్ కూడా రూ.35 దాటేసింది. ఒకప్పుడు పాలు ధర తక్కువున్నప్పటికీ, రూ.నాలుగు కమీషన్ వచ్చేది. ఇప్పుడు ధర పెరిగినప్పటికీ రూ. 3 మాత్రమే కమీషన్ వస్తోంది’’అని ఆమె చెప్పారు.

కరెంటు బిల్లులు పెరగడంతో వస్తువులు ఫ్రిజ్‌లో పెట్టి ఇవ్వాలన్నా తాము ఆలోచిస్తున్నామని లక్ష్మి అన్నారు. ‘‘మాకు తినుబండారాల్లో నూటికి ఐదు రూపాయలు మాత్రమే కమీషన్ వస్తాయి. కుర్‌కురే ఒక షీట్ అమ్మితే ఏడు రూపాయలు వస్తాయి. బ్రూ కాఫీ మొత్తం షీట్ అమ్మితే, ఒక ప్యాకెట్ మిగులుతుంది. సర్ఫ్ ప్యాకెట్ తొమ్మిది రూపాయలు ఉండేది. ఇప్పుడు అది రూ.24కి పెరిగింది. దీనిపై నాలుగు రూపాయలు వస్తుంది. మొత్తంగా వంద రూపాయలు లాభం రావాలంటే ఇలా మేం ఎన్ని అమ్మాలి? సొంత ఇల్లు, సొంత దుకాణం కాబట్టి ఏదో నడిచిపోతోంది. రోడ్డు ప్రమాదంలో నా భర్త కాలు విరిగిపోయింది. ఇటీవల ఆయనకు వెన్నెముక ఆపరేషన్ అయింది. నాలుగైదు సంవత్సరాల ముందు కొంత లాభాలు వచ్చేవి. ఇప్పుడు అవి ఏమీ కనిపించడం లేదు’’ అని లక్ష్మీ దేవి వివరించారు.

‘‘భర్త సంపాదన సరిపోదు.. అందుకే బండిపై పళ్లు అమ్ముతా’’

బైరాగిపట్టెడకు చెందిన లావణ్య.. రైతు బజార్ దగ్గర బండిపై పళ్లు అమ్ముతుంటారు. చదువుకోకపోవడంతో చిన్నప్పుడు నాన్నతో కలిసి బండిపై పళ్లు అమ్మడానికి లావణ్య వెళ్లేది. పెళ్లయిన ఐదేళ్ల తర్వాత ఇల్లు గడవడానికి మళ్లీ ఇదే వ్యాపారాన్ని ఆమె మొదలుపెట్టారు.

తన భర్త ఏసీ మెకానిక్‌గా పనిచేస్తారని, ఆయన ఒక్కరి సంపాదనే అయితే కుటుంబం నడవడానికి సరిపోదని, అందుకే తన వంతుగా పండ్లు అమ్ముతానని లావణ్య చెప్పారు.

‘‘కరోనా వ్యాప్తికి ముందు పరిస్థితి వేరు. ఇప్పుడి పరిస్థితి వేరు. గతంలో చాలా మంది బండ్లపై వ్యాపారం చేసేవారు. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ, మాకు వ్యాపారం బాగానే జరిగేది. ఎవరి వ్యాపారం వారికి ఉండేది. దేనికైనా ఖర్చులు పెడతారు. పళ్లు, కూరగాయల దగ్గరికి వస్తే రేట్లు తగ్గించమని అడుగుతారు. మధ్య తరగతి ప్రజలు, పేదవాళ్లే మేలు. వారే ఎక్కువగా పళ్లు కొంటున్నారు. కారుల్లో, ఇతర వాహనాల్లో వచ్చేవారు మా దగ్గర కొనడం బాగా తగ్గించేశారు. గతంలో కేజీ కొనేవాళ్లు.. ఇప్పుడు అరకేజీ కొంటున్నారు. ఇప్పుడు రూ.200 తీసుకువస్తే ఏదైనా ఒక రకం పళ్లు కేజీ మాత్రమే వస్తాయి. అదే గతంలో రూ.200 పెడితే, యాపిల్, ద్రాక్ష, అరటి పళ్లు.. ఇలా చాలా వచ్చేవి’’అని ఆమె వివరించారు.

పండ్ల వ్యాపారంలో తమకు ఎలాంటి ఆదాయమూ మిగలడంలేదని లావణ్య ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఏదో తప్పదు కాబట్టి వ్యాపారం చేసుకోవాలి. మండీలో మేం అప్పులు తీసుకుంటాం. అసలు డబ్బులు ఎలా వస్తాయో.. ఎలా పోతాయో తెలియకుండా జరిగిపోతుంది. ఏదో పండుగల సీజన్ వస్తే, కాస్త మిగులుతుంది. ఒక్కోసారి నష్టాలు కూడా వస్తాయి. ఏ అప్పులూ లేనివారికి పండ్ల వ్యాపారంలో కొంత మిగలవచ్చు. కానీ, మాకు చాలా కష్టంగా ఉంటుంది’’అని లావణ్య వివరించారు.

పిల్లల స్కూలు ఫీజులు కట్టడానికి తాము చాలా కష్టపడుతున్నామని లావణ్య చెప్పారు. ‘‘గతంలో యూకేజీకి రూ.13,000 ఉండేది. ఇప్పుడు మూడో క్లాసుకు రూ.21 వేలు అయింది. మా ఇద్దరు పిల్లలకు కలిపి ఏడాదికి రూ.50,000 కట్టాలి’’ అని ఆమె చెప్పుకొచ్చారు.

‘‘ఈ బతుకు బతకలేం అనిపిస్తుంది’’

యాదవ కాలనీకి చెందిన కాంచన.. రైతు బజార్ దగ్గర తొపుడు బండిపై కూరగాయలు అమ్ముతారు. ధరల పెరుగుదల వల్ల ఆమె జీవితం కూడా తీవ్రంగా ప్రభావితం అవుతోంది.

‘‘నాలుగు వస్తువులు అమ్మితే, రూ.పది వస్తుందని ఆశ. ఒక్కోసారి ఈ మధ్యతరగతి బతుకులు బతకలేమనిపిస్తుంది. కాని ఏం చేయలేం’’అని కాంచన అన్నారు.

‘‘మునక్కాయలు, బీన్స్ ధరలు బాగా పెరిగాయి. మిగిలిన కూరగాయలు కాలాన్ని బట్టీ తగ్గుతూ, పెరుగుతూ ఉంటాయి. ఇది స్థిర వ్యాపారం కాదు’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

వ్యాపారం బాగా తగ్గిపోవడానికి మార్కెట్‌లో పెరిగిన పోటీనే కారణమని ఆమె చెప్పారు. ‘‘కరోనాకు ముందు మావి ఐదు బండ్లు ఉండేవి. ఇప్పుడు అన్నమయ్య సర్కిల్ నుంచి రాయలచెరువు గేట్ వరకు అందరివీ కలిపి 80 బండ్ల వరకు ఉంటున్నాయి. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వారు ఇక్కడకు వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారు’’అని ఆమె వివరించారు.

‘‘ఈ రోజు ఉండే రేటు రేపు ఉండదు. రోడ్డు మీద బండ్లు పెడితే జరిమానా వేస్తారు. కోర్టుకు వెళ్లి రూ.200 కట్టాల్సి ఉంటుంది. మరోవైపు ఒకప్పుడు రూ.3500గా ఉండే ఇంటి అద్దె ఇప్పుడు రూ.5000 అయ్యింది. పిల్లల ఫీజులు అప్పులు చెసి కట్టుకుంటున్నాం. బట్టలు కూడా కొనుక్కోవాలి. నగలనే మాటే మాకు తెలియదు. ఉన్నదానితోనే సర్దుకుంటున్నాం’’అని ఆమె చెప్పారు. తమ దగ్గర కూడా పేదలే ఎక్కువగా కాయగూరలు కొంటారని కాంచన చెప్పారు.

చికెన్ షాపుతోనూ కష్టాలు..

ఎంఆర్ పల్లి దగ్గర మహేశ్.. చికెన్ సెంటర్ నడుపుతున్నారు. బాయిలరు, నాటుకోడి మాంసం, గుడ్లు అమ్ముతున్నారు.

‘‘వేరే వాళ్ల దగ్గర నుంచి ఏడాది క్రితం నేను ఈ షాప్‌ను తీసుకున్నాను. నేడు షాప్ తీసుకున్నప్పుడు కేజీ మాంసం రూ.160గా ఉండేది. ఈ రోజు రేటు రూ.190. వేసవిలో కోళ్లు చనిపోతుంటాయి. అప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. కంపెనీ వారు ధరలు పెంచుతారు కాబట్టి.. మేం కూడా పెంచుతాం. మూడు నెలల క్రితం వేసవిలో కేజీ రూ.350కి కూడా అమ్మాం. ఇప్పుడు ఆన్ సీజన్ కావడంతో రేటు తగ్గింది. గుడ్ల ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి’’అని మహేశ్ చెప్పారు.

ధరలు పెరిగితే కస్టమర్లు రారని, కాబట్టి ఇదివరకు ఉన్నంత బిజినెస్ ఇప్పుడు జరగటం లేదని ఆయన వివరించారు. ‘’40 శాతం వరకు వ్యాపారం తగ్గింది. రేట్లు పెరగడమే ఇందుకు కారణం. రేటు తగ్గితే కిలో కొనే వాళ్లు రెండు కిలోలు తీసుకుంటారు. సంవత్సరం కింద ఆదివారం వచ్చిందంటే 250 కేజీల నుండి 300 కేజీల చికెన్ అమ్మేవాడిని. ఇప్పుడు 200 కేజీలు అమ్మితే చాలా ఎక్కువ. దాదాపు 100 కేజీల వ్యాపారం తగ్గింది. ప్రజలు కూడా ఖర్చులు తగ్గించుకుంటున్నారు’’అని ఆయన అన్నారు.

వ్యాపారాలు తగ్గడంతో చిన్న చిన్న వ్యాపారులు ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు వీలైనంత మేర తగ్గించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)