You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉర్దూ భాష మీద హిందూవాదులకు కోపమెందుకు?
- రచయిత, జోయా మటీన్
- హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ
ఉర్దూ భాష ఎవరిది?
ఉర్దూ భాష విదేశాల నుంచి దిగుమతి అయిందని, ఇస్లామిక్ ఆక్రమణదారులని వారు చెబుతున్న ఆనాటి పాలకులు ఆ భాషను భారతీయులపై బలవంతంగా రుద్దారని భారతదేశ హిందూవాదులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ విషయంలో తాజాగా ఏప్రిల్‌లో ఒక అల్లరి జరిగింది.
ఛాందసవాద న్యూస్ చానల్‌కు చెందిన ఒక విలేకరి.. ఒక ప్రముఖ ఫాస్ట్-ఫుడ్ చైన్‌కు చెందిన ఓ దుకాణంలోకి చొరబడ్డారు. అక్కడ ఒక స్నాక్స్ బ్యాగ్ లేబుల్ మీద రాసివున్న అక్షరాలను ఉర్దూ భాషగా భావించిన ఆమె, ఆ భాషను ఉపయోగించినందుకు గాను ఆ దుకాణంలోని ఉద్యోగులను హేళన చేస్తూ మాట్లాడారు.
అయితే, ఆ స్నాక్స్ బ్యాగ్ మీద ఉన్న లేబుల్‌లో ఉన్న భాష అరబిక్ అని తేలింది. ఇస్లామిక్ సంస్కృతిలో మూలాలున్న దేనినైనా.. అవన్నీ ఒకటేనని వర్గీకరించే ప్రయత్నాలకు ఈ ఉదంతం తాజా ఉదాహరణ అని చాలా మంది అటున్నారు.
గత ఏడాది దుస్తుల విక్రయ సంస్థ ఫాబ్‌ఇండియా.. ఒక వాణిజ్య ప్రకటనకు ఉర్దూలో శీర్షిక పెట్టినపుడు అధికార భారతీయ జనతా పార్టీ నాయకులు అభ్యంతరం చెప్పటంతో ఆ అడ్వర్టైజ్‌మెంట్‌ను బలవంతంగా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.
గతంలో కొన్ని రాష్ట్రాల్లో శాసనసభలకు ఎన్నికైన రాజకీయనాయకులను ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేయకుండా అడ్డుకున్నారు. చిత్రకారులను ఉర్దూ గ్రాఫిటి పెయింట్ చేయకుండా ఆపేశారు. నగరాలు, కాలనీల పేర్లు మార్చేశారు. స్కూలు పాఠ్యపుస్తకాల నుంచి ఉర్దూ పదాలను తొలగించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.
ఉర్దూ మీద జరుగుతున్న ఇటువంటి దాడులు.. భారత ముస్లిం జనాభాను అణచివేసేందుకు జరుగుతున్న విస్తృత దండయాత్రలో భాగమని చాలా మంది భావిస్తున్నారు.
''ముస్లింలకు సంబంధించిన చిహ్నాలపై దాడుల క్రమాన్ని ఇది స్పష్టంగా చూపుతోంది'' అని కతర్ యూనివర్సిటీలో సోషియోలింగ్విస్టిక్స్ ప్రొఫెసర్ రిజ్వాన్ అహ్మద్ పేర్కొన్నారు.
భారత చరిత్రను రాజకీయంగా తిరగరాసే విస్తృత హిందూవాద అజెండాలో కూడా ఇది భాగమని ఇంకొందరు అంటున్నారు.
''భారతీయ భాషలకు మత సంకెళ్లు వేయాలనే రాజకీయ పథకం ముందుకు వెళ్లటానికి ఏకైక మార్గం.. ఆధునిక భారతీయులను వారి చరిత్ర నుంచి కత్తిరించివేయటమే'' అని చరిత్రకారుడు ఆడ్రే ట్రుష్కే అభిప్రాయపడ్డారు.
''అలా చరిత్ర నుంచి ప్రజలను దూరం చేయటం ప్రస్తుత ప్రభుత్వ ప్రయోజనాలకు ఉపయోగపడవచ్చు. కానీ అలా చేయటం మిగతా అందిరికీ వారి వారసత్వాన్ని క్రూరంగా నిరాకరించటమే'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కథనానికి సంబంధించి ముగ్గురు బీజేపీ నాయకులను సంప్రదించటానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ అటునుంచి ఎటువంటి స్పందనా రాలేదు.
మృదువైన, భావవంతంగా ఉండే ఉర్దూ భాష.. భారతదేశపు చాలా మంది ప్రముఖ కవులు, రచయితలు తొలి ప్రాధాన్యమిచ్చే అభిమాన భాష. భారతదేశంలో అత్యంత ప్రశంసలు పొందిన రచనల్లో కొన్ని సాదత్ హసన్ మాంటో, ఇస్మత్ చుగ్తాయ్ వంటి ఉర్దూ రచయితల నుంచి వచ్చాయి.
ఉర్దూ భాషకు గల సొగసు, మృదువైన పలుకు.. జాతీయవాద కవిత్వానికీ, రొమాంటిక్ ఘజల్స్‌కు స్ఫూర్తినిచ్చాయి. బాలీవుడ్ పాటల గుండె కూడా ఉర్దూ భాషే.
హిందువులు కేవలం హిందీయే మాట్లాడతారని, ఉర్దూ భాష ముస్లింలదని ఈ భాషను వ్యతిరేకిస్తున్నవారు అంటున్నారు. కానీ చరిత్ర, సజీవ సాక్ష్యాలు సరిగ్గా దీనికి వ్యతిరేకంగా చెప్తున్నాయి.
ఇప్పుడు మనకు ఉర్దూగా తెలిసిన భాష మూలాలు టర్కిష్, అరబిక్, పర్షియన్ భాషల్లో ఉండటం చూడొచ్చు. ఈ భాషలు అలలు అలలుగా వాణిజ్యం, దండయాత్రల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయి.
''భారత ద్వీపకల్పంలో చోటుచేసుకున్న సాంస్కృతిక మిశ్రమీకరణ నుంచి ఈ ఉమ్మడి భాష పుట్టుకొచ్చింది. అది పరిణామం చెందుతూ విభిన్న పేర్లు పొందింది: హైందవి, హిందుస్తానీ, హిందీ, ఉర్దూ లేదా రేఖ్తా'' అని చరిత్రకారుడు డాక్టర్ అలోక్ రాయ్ చెప్తున్నారు.
ఉర్దూ భాష అనేది 18వ శతాబ్దపు చివర్లో మొఘలుల పాలన అంతిమ కాలంలో.. దిల్లీ దర్బారుల చుట్టూ ఉన్న కులీన సమాజం రూపొందించిన సాహిత్య శైలి అని ఆయన పేర్కొన్నారు. మాట్లాడే భాషా రూపాలతో ఊర్దూకు ఉన్న తేడాలను చూపటానికి కొన్ని వాక్యాలను ఉదహరించారు.
నాడు ఉర్దూ భాషను ఇప్పుడున్నట్లుగా ముస్లిం భాషగా చూడలేదు. అది ఉత్తర భారతదేశంలో ఉన్నత వర్గాలు మాట్లాడే భాష. వారిలో హిందువులు కూడా ఉన్నారు.
మరోవైపు.. హిందీ భాష ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 19-20వ శతాబ్దపు చివరి కాలంలో అభివృద్ధి చెందిన సాహిత్య శైలి. ''ఉర్దూ భాషకు గల భూమిక నుంచే తేడాను చూపించే కాంక్షతో హిందీ భాష అభివృద్ధి చెందింది.''
ఉర్దూ భాషలో ఎక్కువ పదాలను మధ్య యుగపు భారతదేశంలో ఉన్నతవర్గాల భాష అయిన పర్షియన్ నుంచి తెచ్చుకుంటే.. హిందీ భాష ప్రాచీన హిందూ గ్రంథాల భాష అయిన సంస్కృతం నుంచి పదాలను తెచ్చుకుంది.
''కాబట్టి రెండు భాషలకూ ఉమ్మడి వ్యాకరణ భూమిక ఉంటుంది. కానీ హిందీ, ఉర్దూ భాషలు రెండిటికీ రాజకీయ కారణాల రీత్యా ఆయా భాషల మూలాలకు సంబంధించిన కాల్పనిక కథలు తయారయ్యాయి'' అని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు.
రెండు సమాజాల వారూ తమ ఉమ్మడి భాష తమదంటే తమదని వాదిస్తూ.. తమకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలన్న భావావేశంలో చివరికి ఆ ఉమ్మడి భాషను విభజించుకున్నారని డాక్టర్ చెప్తున్నారు.
''అటువంటి విషాద పర్యవసానాలు కనుక లేకపోయినట్లయితే మొత్తం పరిస్థితి కాస్త హాస్యాస్పదంగా ఉండేది'' అంటారాయన.
ఈ విభజన బ్రిటిష్ పాలనలో బలపడింది. హిందీ భాషను హిందువులతోను, ఉర్దూ భాషను ముస్లింలతోను వారు గుర్తించారు. అయితే ఉర్దూ భాషను విదేశీ భాషగా చిత్రీకరించటం హిందువాద సంవాదంలో కొత్త విషయమేమీ కాదు.
19వ శతాబ్దం చివరిలో హిందూ జాతీయవాదులు ఉత్తర భారతదేశంలోని రాజాస్థానాల్లో అధికారిక భాష హిందీయేనని వాదించారు. బ్రిటిష్ పాలకులు 1837లో అధికార భాషను పర్షియన్ నుంచి ఉర్దూకు మార్చారు.
భారత ఉపఖండం 1947లో రెండు వేర్వేరు దేశాలుగా విభజితమయ్యే నాటికి ఈ విభజన పతాక స్థాయికి చేరుకుంది. ఉపఖండంలోని ముస్లింలకు ప్రత్యేక దేశంగా పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు మద్దతుగా ప్రజలను కదిలించటానికి ముస్లిం లీగ్ ఉర్దూ భాషను కూడా ఉపయోగించుకుంది'' అని డాక్టర్ రాయ్ చెప్పారు.
అప్పుడు ఉర్దూ సులభమైన టార్గెట్ కావటంలో వింత లేదు - ఉత్తర ప్రదేశ్ తమ స్కూళ్లలో ఉర్దూ భాషను నిషేధించింది. ఆ సమయంలో హిందువులు కూడా ఆ భాషను వదిలిపెట్టారని డాక్టర్ అమ్మద్ చెప్తారు.
ఉర్దూ విషయంలో లేని చరిత్రను పుట్టించటానికి హిందూవాదులు ప్రయత్నించారని డాక్టర్ ట్రుష్కి చెప్తున్నారు. ''ఒకవేళ ఉర్దూ భాష అకస్మాత్తుగా ముస్లింలకు ప్రత్యేకమైన భాష అయిపోయిందనుకుంటే.. ఉర్దూలో రాసిన చాలా మంది హిందువుల గురించి, పర్షియన్ - అరబిక్ లిపిలో ఉన్న మన తొలికాలపు హిందీ రాతప్రతుల గురించి ఇక మనమెప్పుడూ మాట్లాడమా?'' అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాదు, హిందీ భాషలో స్వేచ్ఛగా ఉపయోగిస్తున్న ఉర్దూ పదాల సంగతేమిటి?
''జేబ్ (జేబు) అనే పదం అరబిక్ నుంచి పర్షియన్ ద్వారా వచ్చింది. దానికి హిందీ సమాన పదం ఏమిటి? బహుశా ఏమీ లేదు. మొహబ్బత్ (ప్రేమ), దిల్ (హృదయం) వంటి శాశ్వత పదాల సంగతేమిటి?'' అంటారు డాక్టర్ అహ్మద్.
అదే సమయంలో.. భాషలు అనేవి ఒక విశ్వాసాన్ని కూడా తయారు చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
''ఉర్దూ మాట్లాడే ముస్లింలు సూర్యాస్తమయం గురించి మాట్లాడటానికి మఘ్రిబ్ అనే పదాన్ని హిందువుల కన్నా ఎక్కువగా వాడవచ్చు. అయితే.. ఒకే గ్రామంలోని అగ్ర కులాల వారు, నిమ్న కులాల వారు ఉపయోగించే భాషలో ఉండే తేడాలకు, దీనికి భేదం లేదు'' అని విశ్లేషించారు.
హిందీ నుంచి ఉర్దూను తొలగించే ప్రయత్నాల వల్ల హిందీ భాష 'స్థాయి దిగజారింద'ని రాయ్ అంటారు.
''ఈ హిందీ నిస్సారంగా మారింది. ఇందులో భావావేశ అనునాదం దూరమైంది'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇల్లు కొనడం మంచిదా లేక అద్దెకు ఉండటం మంచిదా.. సొంతిల్లు కొనే ముందు ఇవి తెలుసుకోండి
- Bra ఎంపికలో మహిళలు చేసే పొరపాట్లు ఇవే.. ‘బ్రా’ సరైన కొలతను తెలుసుకోవాలంటే ఇలా చేయండి..
- హోంలోన్ వడ్డీ రేటు పెరిగినప్పుడు టెన్యూర్ పెంచుకుంటే మంచిదా లేక EMI ఎక్కువ కడితే బెటరా..
- కళ్లు ఎందుకు అదురుతాయి? మీ ఆరోగ్యం గురించి మీ కళ్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి...
- బుద్ధ పూర్ణిమ: గౌతమ బుద్ధుడి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఎందుకు, ఎలా ఏర్పడుతుంది.. ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)