You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CSK vs RCB: చెన్నైని ఇంటికి పంపిన బెంగళూరు
- రచయిత, బోథ్రాజ్
- హోదా, బీబీసీ కోసం
ఐపీఎల్‌లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అద్భుత ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. చెన్నై జట్టు నిరాశతో టోర్నమెంట్ నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.
తొలుత ఆర్సీబీ బ్యాటింగ్ చేసింది. వర్షం అంతరాయం కలిగించినప్పటికీ, నిర్ణీత 20 ఓవర్లలో 20 ఓవర్లలో 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. దీంతో చెన్నైకి 219 పరుగుల లక్ష్యం ఎదురైంది.
ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు 201 పరుగులు చేయగలిగితే గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా నెట్ రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే వీలుండేది. కానీ, చెన్నైని 191 పరుగులకే బెంగళూరు కట్టడి చేసింది. దీంతో, చెన్నై ప్లేఆఫ్స్ ఆశలు అడియాశలయ్యాయి.
వరుసగా 6 విజయాలతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది ఆర్సీబీ.
చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. 27 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు గెలిచింది.
బెంగళూరు జట్టు ఎలా ఆడిందంటే..
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు తొలి మూడు ఓవర్లలో 31 పరుగులు చేసింది. ఈ దశలో వర్షంతో కాసేపు ఆట నిలిచిపోయింది.
ఆట మళ్లీ మొదలయ్యాక బెంగళూరు బ్యాటింగ్ నెమ్మదించింది. బంతి స్పిన్నర్లకు అనుకూలించడం మొదలైంది. స్పిన్నర్ల బౌలింగ్‌లో విరాట్ కోహ్లి, ఫాప్ డుప్లెసిస్ జాగ్రత్తగా ఆడారు.
దీంతో పవర్ ప్లేలో బెంగళూరు వికెట్ కోల్పోకుండా 42 పరుగులు సాధించింది.
విరాట్ కోహ్లి 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు సాధించాడు. శాంట్నర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 10 ఓవర్లకు బెంగళూరు స్కోరు వికెట్ నష్టానికి 78 పరుగులు.
స్పిన్నర్లపై చెలరేగిన రజత్ పాటీదార్
కోహ్లి అవుటయ్యాక రజత్ పాటీదార్ స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్ట్రయిక్ రొటేట్ చేశాడు.
మరోఎండ్‌లో ఫాప్ డుప్లెసిస్ కూడా జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 35 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేశాడు.
54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫాఫ్ అవుటయ్యాడు. అప్పటికి బెంగళూరు స్కోరు 13 ఓవర్లలో 113/2.
మిడిల్ ఓవర్లలో నిలకడగా..
మిడిల్ ఓవర్లలో ఆర్‌సీబీ నిలకడగా ఆడింది. 10 నుంచి 16 ఓవర్ల వరకు 10.34 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. 11వ ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో 20 పరుగులు, 12వ ఓవర్‌లో తీక్షణ బౌలింగ్‌లో 10 పరుగులు, 14వ ఓవర్లో సిమర్జీత్ బౌలింగ్‌లో 19, 16 ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో 17 పరుగులు రాబట్టింది. గ్రీన్, రజత్ పాటీదర్‌లు నిలకడగా ఆడటంతో మిడిల్ ఓవర్లలోనే 77 పరుగులు సంపాదించింది.
రజత్ పాటీదార్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి అవుటయ్యాడు.
దినేశ్ కార్తీక్ 6 బంతుల్లో 14 పరుగులు చేశాడు.
చివరి వరకు నిలిచిన కామెరూన్ గ్రీన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 38 పరుగులు చేశాడు.
ప్రత్యర్థి బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, తుషార్ దేశ్‌పాండే, మిచెల్ శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.
ప్లే ఆఫ్స్‌లో తలపడే నాలుగో టీమ్..
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఇంతకుముందు మూడు జట్లు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ జట్లు ప్లే ఆఫ్స్ పోరుకు చేరుకున్నాయి. ఇప్పుడు నాలుగో జట్టుగా బెంగళూరు (ఆర్సీబీ) ప్లే ఆఫ్స్‌కు వెళ్లింది.
ఇవి కూడా చదవండి:
- పాముల సెక్స్: సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?
- బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)