లాభాల మోత మోగుతున్నా టెక్ కంపెనీలు జాబ్ కోతలకు ఎందుకు దిగుతున్నాయి?

    • రచయిత, క్రిస్టీనా జే ఆర్గాజ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అమెరికా స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీలు దూసుకుపోతుంటాయి. ఆ సంస్థలను వాల్‌స్ట్రీట్ డార్లింగ్స్ అని కూడా అంటుంటారు.

‘మాగ్నిఫిసెంట్ 7’ అని పిలిచే ఈ టెక్నాలజీ కంపెనీల లాభాలుగానీ, అమ్మకాలుగానీ, మార్కెట్ వ్యాల్యూలో పెరుగుదలగానీ ఎక్కడా ఆగలేదు.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ కంపెనీలు ఈ ఏడాది 12% అమ్మకాలను పెంచుకున్నాయి. వచ్చే ఏడాది మరో 12% పెంచుకోగలవు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే ఈ వృద్ధి చాలా ఎక్కువ.

గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్, యాపిల్, అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు కలిసి ఈ సంవత్సరం 327 బిలియన్ అమెరికన్ డాలర్లు ( సుమారు రూ. 2713501 కోట్లు) ఆర్జించాయి. గత సంవత్సరం కంటే ఇది 25% ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ లాభాలు కొలంబియా, చిలీలాంటి దేశాల జీడీపీకి దాదాపు సమానం.

ఒకపక్క లాభాలు పెరుగుతున్నట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. కానీ, ఈ కంపెనీలు సిబ్బంది కోతలు విధిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్ 2023 జూలైలో తన సిబ్బందిని తగ్గించే పని మొదలుపెట్టింది. 2024లో 1900 మందిని తొలగించింది. అది కూడా యాక్టివిజన్ బ్లిజార్డ్‌ కొనుగోలు కోసం 6900 కోట్ల డాలర్ల ఒప్పందం జరిగిన తర్వాత.

గత సంవత్సరం అమెజాన్ కూడా 9000 ఉద్యోగాలకు కోతపెట్టింది. ఇందులో ఆ కంపెనీ తాజాగా కొనుగోలు చేసిన ట్విచ్ ప్లాట్‌ఫామ్ నుంచి 35 శాతం మంది, అమెజాన్ ప్రైమ్ నుంచి 100 మంది ఉద్యోగులు ఉన్నారు.

పేపాల్ ఈ ఏడాది 2500 మందిని తొలగించింది. స్పాటిఫై 1500 మంది, ఈబే 1000 మందిని, స్నాప్‌చాట్ 500 మంది ఉద్యోగులను తొలగించింది.

ఈ పెద్ద కంపెనీలకు తోడు అనేక చిన్న కంపెనీలు కూడా కోతల మీద దృష్టిపెట్టాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆరంభం నుంచి 122 టెక్ కంపెనీల్లో దాదాపు 32 వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు డెస్పిడోస్ డాట్ ఎఫ్‌వైఐ అనే వెబ్ సైట్ వెల్లడించింది.

2000 సంవత్సరంలో డాట్ కామ్ బబుల్ మొదలైన నాటి పరిస్థితులను, నేటి పరిస్థితులను కొంతమంది పోల్చి చూస్తున్నారు.

అయితే, ఇలా పోల్చడం కూడా సరికాదంటున్నారు జూలియస్ బేర్‌లో చీఫ్ అనలిస్ట్ అయిన మాథ్యూ రాచెటర్. ఎందుకంటే 2000ల నాటి బబుల్ టైమ్‌లో టెక్నాలజీ లీడర్ల స్టాక్ వ్యాల్యూకు నేటి మెగా క్యాప్ కంపెనీల స్టాక్స్ వ్యాల్యూ ఇంకా చేరుకోలేదని మాథ్యూ అంటున్నారు.

ఈ ‘మాగ్నిఫిసెంట్ 7’ కంపెనీలు నిరంతరం నగదును ఉత్పత్తి చేసే సంస్థలే. మరి ఈ సంస్థల రెండో దశ ఉద్యోగాల కోతల వెనక ఉద్దేశమేంటి?

1. కృత్రిమ మేధ, వ్యూహాత్మక మార్పులు

‘‘సాంకేతిక రంగ చరిత్రలో పెద్ద కంపెనీల పెరుగుదల, పతనాలు ఒక నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీతో భర్తీ అవుతాయి’’ అని ఓడో బీహెచ్ఎఫ్ ఏఎం సంస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేనేజర్ బ్రైస్ ప్రూనాస్ అన్నారు.

డాట్‌కామ్ బబుల్‌లో ఇదే జరిగింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విజృంభణ మరొక విప్లవాన్ని సూచిస్తోంది.

“లాంగ్వేజ్ లెర్నింగ్ కంపెనీ డ్యూలింగోని ఉదాహరణగా తీసుకుంటే, అక్కడ పని చేసేవారిలో చాలామంది రచయితలు, ట్రాన్స్‌లేటర్లే. వారి స్థానాలు అల్గారిథమ్‌తో భర్తీ అవుతాయి.’’ అని క్వార్క్ వెబ్‌సైట్ వివరించింది.

ప్రస్తుత కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుషులు గంటలో చేసే పనిని, ఏఐ 10 నిమిషాలలోపే పూర్తి చేయగలదు.

ఈ ఏడాది ఆరంభంలో గోల్డ్‌మ్యాన్ సాచ్స్ నివేదిక ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30 కోట్లమంది ఉద్యోగుల స్థానాలను ఆక్రమించే స్థితిలో ఉంది.

‘‘2000 సంవత్సరం నాటి టెక్నాలజీ బబుల్ సమయంలో ఈ ట్రెండ్ కనిపించింది. ఇలాంటి మార్పులు కొత్త ఆవిష్కరణలకు దారి తీస్తాయి.’’ అని ఈ-టెరో సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జేవియర్ మోలినా అన్నారు.

“ కంపెనీలు ఒకవైపు వ్యూహాత్మక మార్పులతోపాటు, కృత్రిమ మేధవైపు మళ్లడాన్ని మనం చూస్తున్నాం. ఇది చాలా ఉద్యోగాల కోతకు కారణమవుతుంది.’’ అని మోలినా అన్నారు. ఇది ఆదాయాన్ని పెంచుకోవడానికి ఒక మార్గమని మోలినా అభిప్రాయపడ్డారు.

2. ప్రాజెక్టులలో కోత

టెక్నాలజీ రంగంలో ఒక్క 2023లోనే దాదాపు 168,032 ఉద్యోగాలకు కోత పడినట్లు కన్సల్టింగ్ కంపెనీ చాలెంజర్, గ్రే & క్రిస్మస్ రిపోర్ట్ చేసింది. ఇన్ని కోతలు మరే ఇతర పరిశ్రమలో కూడా లేవని ఆ సంస్థ పేర్కొంది.

కరోనా మహమ్మారి సమయంలో సాధించిన విజయాలతో మంచి ఉత్సాహం మీదున్న కంపెనీలు 2022 కోసం భారీ విస్తరణ ప్రణాళికలు రచించాయి. నియామకాలను పెంచాయి. అంతా అనుకూలంగా ఉందన్న భావనతో కొత్త ఉద్యోగులను భారీ ఎత్తున నియమించుకున్నాయి.

కానీ ఇది ఎంతో కాలం కొనసాగలేదు. 2022, 2023 వచ్చే సరికి తొలగింపులు మొదలయ్యాయి. ద్రవ్యోల్బణం నియంత్రణ లేకుండా పెరగడంతోపాటు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం కొత్త కంపెనీలకు పెద్ద దెబ్బగా మారింది.

అప్పులు తీసుకుని ఏర్పాటు చేసిన సంస్థలకు ఇది పెద్ద సమస్యే. టెక్ సంస్థలకు ఆరంభంలో మూలధనం అవసరం చాలా ఉంటుంది.

‘‘వడ్డీ రేట్ల పెరుగుదల కంపెనీలకు పరిమితులు విధించింది. మున్ముందు లాభాలను చూడాలంటే ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడం అత్యవసరమని కంపెనీలకు అర్ధమైంది.’’ అని ఏ అండ్ జీ ఫాండోస్ సంస్థలో డిప్ వ్యాల్యూ కేటలిస్ట్ ఫండ్ మేనేజర్‌గా పని చేస్తున్న ఆండ్రెస్ అలెండే అన్నారు.

“పెరుగుతున్న ఖర్చులు సంస్థలపై ప్రభావం చూపించాయి. ఇది కొన్ని ప్రాజెక్టుల మూసివేతకు కూడా కారణమైంది.’’ అని ఆయన అన్నారు. ఆర్థికంగా అనిశ్చితి ఉన్న పరిస్థితిలో కంపెనీలు జాగ్రత్త పడటం సహజమని ఆయన అన్నారు.

బ్రైస్ ప్రూనాస్ కూడా ఈ వాదనతో ఏకీభవించారు. ‘‘మెగా క్యాప్ కంపెనీలకన్నా చిన్నవైన అనేక కంపెనీలు గడ్డు సమయాన్ని ఎదుర్కొంటున్నాయి. అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నాయి’’ అని ప్రూనాస్ అన్నారు.

3. మనుగడ- ముందు జాగ్రత్త

మెగా-క్యాప్‌ కంపెనీలు కూడా లాభాలను పెంచుకోవడానికి, పెట్టుబడిదారులను సంతృప్తిపరచడానికి కోతలను మొదలుపెట్టాయి.

‘‘టెక్ కంపెనీలలో ఇలాంటి మార్పులు చాలా వేగంగా జరుగుతుంటాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు నిరంతరం పుట్టుకొస్తుంటాయి. ఇందులో మనుగడ సాధించగలిగేవి మళ్లీ కొత్త నియామకాలను చేపడతాయి.’’ అని అలెండే వివరించారు.

‘‘ఇప్పుడు కొత్త ఆవిష్కరణలు జరుగుతున్న సూచనలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఇతర రంగాలైన వినియోగం, పెట్టుబడిలాంటి వాటిని ప్రభావితం చేయగలవు. ఎందుకంటే టెక్ కంపెనీలలో జీతాలు సగటు జీతాల కంటే ఎక్కువగా ఉంటాయి.’’ అన్నారు అలెండే.

‘‘చిన్న కంపెనీల సమస్యలను అర్ధం చేసుకోవచ్చు. అవి మనుగడ కోసం పోరాడుతుంటాయి. పెద్ద కంపెనీలు మున్ముందు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి వీలుగా ఎక్కువ మొత్తంలో మూలధనాన్ని తమ వద్ద ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ రెండింటినీ ఒకేలా చూడాకూడదు’’ అని అలెండే అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)