స్మార్ట్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలు ఎందుకొస్తాయి, మన డేటా సేఫ్‌గా ఉండాలంటే ఏం చేయాలి?

    • రచయిత, శ్రీకాంత్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారికి కేంద్రం తాజాగా ఓ అలర్ట్ జారీ చేసింది. ఆ కంపెనీకి చెందిన కొన్ని హైఎండ్ ఫోన్లు, ఆపరేటింగ్ సిస్టమ్‌లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని హెచ్చరించింది.

వెంటనే వాటిని సెక్యూరిటీ ప్యాచ్‌లతో అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (cert.in) వినియోగదారులకు సూచించింది.

ఏయే ఫోన్లకు ముప్పు..

శామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేసే ఫోన్లలో భద్రతా పరమైన లోపాలు ఉన్నాయని చెప్పింది.

వీటి వల్ల సదరు వ్యక్తులకు తెలియకుండానే వారి వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదముందని సెర్ట్ వెల్లడించింది.

ఏయే లోపాలున్నాయి

సెర్ట్ వెల్లడించిన లోపాలను యూజర్లు నేరుగా గుర్తించే అవకాశం లేకపోవచ్చు. కానీ అవి ప్రమాదకరమైన సెక్యూరిటీ థ్రెట్‌కు కారణం కావచ్చు.

ఈ లోపాల్లో శామ్‌సంగ్ ఫోన్లలో నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్లలో లోపాలు, ఏఆర్ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలను సెర్ట్ గుర్తించింది.

ఇవన్నీ నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిదిద్దకపోవడం వల్ల తలెత్తిన సమస్యలని సెర్ట్ ఇన్ వెల్లడించింది.

ఈ లోపాల కారణంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లలో భద్రతాపరమైన అడ్డంకులను అధిగమించి యూజర్ల సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.

హ్యాకర్లు ఆ లోపాలను గుర్తించి, ఫోన్లను హ్యాక్ చేస్తే ఫోన్ పిన్‌ను, ఏఆర్ ఎమోజీ సాండ్ బాక్స్ డేటాను సులువుగా యాక్సెస్ చేసే అవకాశముంటుంది.

సిస్టమ్ టైంను మార్చి నాక్స్ గార్డ్ లాక్‌ను కూడా బైపాస్ చేసే అవకాశముంది. దీంతో ఫోన్‌లోని ఆర్బిట్రరీ ఫైల్స్‌ను, ఇతర సెన్సిటివ్ డేటాను తస్కరించే ప్రమాదముందని సెర్ట్ తెలిపింది.

శామ్‌సంగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లలో గెలాక్సీ ఎస్23. గెలాక్సీ జెడ్ ఫ్లిప్5, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 వంటి అల్ట్రా మోడ్రన్ స్మార్ట్ ఫోన్లతో సహా, ఆండ్రాయిడ్ వెర్షన్ 11, 12, 13, 14లతో పనిచేస్తున్న శామ్‌సంగ్ డివైజ్‌లలో కూడా ఈ లోపం ఉన్నట్లు సెర్ట్ ఇన్ పేర్కొంది.

శామ్‌సంగ్ యూజర్లు ఏం చేయాలి?

ఈ ప్రమాదాల్ని నివారించుకోడానికి సదరు ఫోన్లు వాడుతున్న వారు తమ ఫోన్లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఆప్‌డేట్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ వెల్లడించింది.

ఇందుకోసం యూజర్లు ఫోన్ సెట్టింగ్స్ లోని అబౌట్ డివైజ్‌లోకి వెళ్లి లేటెస్ట్ సాఫ్ట్ వేర్లను ఇన్ స్టాల్ చేసుకోవాలి.

భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రమాదాల్ని తప్పించుకోడానికి ఎప్పటికప్పుడు ఫోన్ ను అప్‌డేట్ చేసుకోవాలని, అదే సమయంలో అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదని ఇన్వెస్కో ఇన్ఫర్మేషన్ రిస్క్ అండ్ కంట్రోల్స్ మేనేజర్ హరికృష్ణ మేదరమెట్ల బీబీసీకి తెలిపారు.

స్మార్ట్ ఫోన్లలో తరచూ ఈ సెక్యూరిటీ థ్రెట్స్ ఎందుకొస్తాయి?

స్మార్ట్ ఫోన్ల వాడకం మన రోజువారీ జీవితాల్లో అన్ని అంశాల్లోనూ విస్తృతమవుతోంది. ఫస్ట్ జనరేషన్‌లో కేవలం మాట్లాడుకోవాడానికి మాత్రమే వాడే మొబైల్ ఫోన్లు... స్మార్ట్ ఫోన్లుగా మారాక రోజువారీ అవసరాల కోసం వాటిపై ఆధారపడటం మరింత పెరుగుతూ వస్తోంది.

కమ్యూనికేషన్‌తో పాటు, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా చాలా అంశాలకు స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిపోయింది. ఒక్కో ఫోన్లలో వందలాది అప్లికేషన్లు వచ్చి చేరుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఫోన్లు ఎంత భద్రంగా ఉన్నాయన్న ప్రశ్న నిత్యం తలెత్తూనే ఉంటుంది. మన ఫోన్లలోకి హ్యాకర్లు చొరబడి, అందులోని సున్నితమైన సమాచారాన్ని దొంగలిస్తే మనకు ముప్పు తప్పదు.

ఇక్కడ సున్నితమైన సమాచారం అంటే.. మన వ్యక్తిగత కాంటాక్టులు, ఫోటోలు, మన బ్యాంకింగ్ సమాచారం, ఇతరులతో మనం చేసే చాటింగ్‌లు చాలా అంశాలుంటాయి. బ్యాంకింగ్ వంటి సమాచారం దొంగిలిస్తే, మన అకౌంట్లలో డబ్బుల్ని దోచుకుంటారు.

ఫోటోలు వంటి వాటిని దొంగిలించి, ఆ ఫోటోలను వాటిని మార్ఫింగ్ చేసి మనల్ని బ్లాక్ మెయిల్ చేయడం వంటివి చేసే ప్రమాదముంది. ముఖ్యంగా అమ్మాయిలు తమ ఫోన్లలో తీసుకునే ఫోటోలను హ్యాకర్లు ఇలాంటి వాటికి వాడుకునే అవకాశముంది. కాబట్టి. మన ఫోన్లలో సమాచారాన్ని హ్యాకర్ల బారిన పడకుండా కాపాడుకోవాలి.

మనం వాడే స్మార్ట్ ఫోన్లను అపరిచితులు భౌతికంగా ఓపెన్ చెయ్యకుండా ఉండేందుకు ఫోన్ లాక్ కోసం పిన్ నెంబర్లు వంటివి పెట్టుకుంటాం. కానీ ఇవి కూడా అంత సేఫ్ కాదని వాటి స్థానంలో పాస్‌వర్డ్స్, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ఫేస్ రికగ్నిషన్లు వంటివి కూడా అందుబాటులోకి వచ్చాయి.

అయితే నిత్యం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉండే మన ఫోన్లను భౌతికంగా ముట్టుకోకుండా హ్యాక్ చేసి, అందులో సమాచారాన్ని దొంగిలిస్తే అప్పుడేం చేస్తారు? హ్యాకర్లు చేసేది కూడా ఇదే.

అందుకే మన స్మార్ట్ ఫోన్లను హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా ప్రమాణాలను ఆపరేటింగ్ సిస్టమ్స్ పాటిస్తూ ఉంటాయి. కానీ వాటిలో కూడా దాగిన లోపాల్ని హ్యాకర్లు అదునుగా తీసుకుంటారు.

అసలేంటి సెక్యూరిటీ థ్రెట్స్... వాటిని ఎలా గుర్తించాలి? ఎలా అడ్డుకోవాలి?

మన డేటా సురక్షితంగా ఉండాలంటే... ముందుగా వాటికి ఉన్న ప్రమాదాలేంటి? అవి ఎలా వస్తాయి? వాటిని ఎలా తప్పించుకోవాలో అవగాహన ఉండాలి.

ఈ అంశంపై ఇన్వెస్కో ఇన్ఫర్మేషన్ రిస్క్ అండ్ కంట్రోల్స్ మేనేజర్ హరికృష్ణ మేదరమెట్ల బీబీసీకి వివరించారు.

ఆయన ఏమన్నారంటే....ఒక బ్యాంక్ ఉందనుకోండి. అందులో డబ్బును భద్రంగా ఉంచడం అనేది దాని సెక్యూరిటీ ప్రాథమిక లక్ష్యం. అయితే లాకర్లో ఉన్న డబ్బు ఎంత సురక్షితంగా ఉంటుందన్నది తెలుసుకోవాలంటే... దానిని దొంగిలించేందుకు ఎన్ని రకాల అవకాశాలున్నాయన్నది ముందుగా చెక్ చేసుకుంటాం కదా. దొంగలు పడితే డబ్బు సురక్షితంగా ఉంటుందా? అంటే బ్యాంక్ ముందున్న సెక్యూరిటీ ఎలా ఉంది? లాకర్ గది ఎంత సురక్షితంగా ఉంది? ఇతర దారుల్లోంచి ఎవరైనా రావచ్చా? బ్యాంక్ తలుపులు దృఢంగా ఉన్నాయా? బ్యాంక్ సిబ్బంది ఏమన్నా తప్పు చేసే అవకాశం ఉందా? లాకర్ తాళాలు ఎవరి దగ్గరున్నాయి? ఒక్కటే తాళం ఉందా? ఇలా అన్ని రకాలుగా ఆ బ్యాంక్ సెక్యూరిటీ లోపాల్ని అంచనా వేస్తారు.

ఉదాహరణకు బ్యాంక్ సెక్యూరిటీగా ఒక వృద్ధుడు ఉన్నాడనుకోండి... దొంగలు సులువుగా అతనిపై దాడి చేసేందుకు అవకాశముంది. అప్పుడు ఏం చేస్తారు.. ఒక కండ పుష్టిగల వ్యక్తిని సెక్యూరిటీగా పెడతారు.

అయితే ఇక్కడితో ప్రమాదాన్ని అడ్డుకున్నట్లే కాదు.. ఒకవేళ దొంగలు ఆయుధాలతో దాడి చేస్తే అన్న కోణంలో కూడా ఆలోచించి... సదరు సెక్యూరిటీకి ఒక మంచి ఆయుధాన్ని కూడా అందిస్తారు. ఇక లాకర్ గది తలుపులు బలహీనంగా ఉన్నాయని గుర్తిస్తే వాటిని మార్చడం, బ్యాంక్‌లో వెనుక వైపు గోడ బలహీనంగా ఉందని గుర్తిస్తే దానిని మరింత పటిష్టంగా చేయడం... ఇలా అన్ని రకాలుగా బ్యాంక్‌లో డబ్బులు ఎవరూ దొంగిలించకుండా భద్రతా చర్యలు తీసుకుంటారు.

ఇందులో మనం గుర్తించిన లోపాల్ని వల్నరబిలిటీ(vulnerabilities) అనుకుంటే, వాటికి తీసుకున్న భద్రతా చర్యలను సెక్యూరిటీ ప్యాచెస్ అంటారు. ఇప్పుడు ఇదే విధంగా మన స్మార్ట్ ఫోన్లలో సమాచారాన్ని ఇతరులెవరు దొంగిలించకుండా కూడా చర్యలు తీసుకోవాలి.

హ్యాకర్లు ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లు, మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో ఉన్న లోపాలను గుర్తించి, వాటి ద్వారా మన డేటాను దొంగిలించాలని చూస్తారు. కాబట్టి ఆ సెక్యూరిటీ లోపాల్ని మనమే ముందు గుర్తించి, వాటిని సరిదిద్దుకోవాలి.

స్మార్ట్ ఫోన్ల నుంచి సంస్థల వరకూ

నేటి డిజిటల్ ప్రపంచంలో దాదాపు అన్ని సంస్థలూ సాఫ్ట్ ‌వేర్లు, ఇంటర్నెట్ ఆధారంగానే పనిచేస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్లు కూడా ఇప్పుడు నిత్యం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి వీటిని హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ. అందుకే సంస్థలు ఎప్పటికప్పుడు తమ వల్నరబిలిటీ అసెస్మెంట్ చేస్తాయి.

కొన్ని సంస్థలు నెలవారీ చేస్తే, కొన్ని వారానికోసారి చేస్తాయి. మరికొన్ని సంస్థలు 24/7 తమ సంస్థ నిర్వహించే సాఫ్ట్ వేర్లను స్కాన్ చేస్తూ ఉంటాయి.

దీనినే వల్నరబిలిటీ మేనేజ్‌మెంట్ అంటారు. మనం వాడే స్మార్ట్ ఫోన్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

స్మార్ట్ ఫోన్లలో ఎలాంటి ఇబ్బందులుంటాయి

స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో యాపిల్, శామ్‌సంగ్‌ రెండూ పోటీ పడుతూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్లలో ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్, లినెక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతున్నారు. వీటిలో ఆపిల్ ఫోన్లలో ఆ సంస్థ తయారు చేసిన ఐఓఎస్‌ను వాడుతోంది. శామ్‌సంగ్‌ సహా మిగిలిన స్మార్ట్ ఫోన్లలో ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ ఓఎస్ మీదే రన్ అవుతున్నాయి.

కాలంతో పాటు మారుతున్న అవసరాలు, సేవలకు తగినట్లుగా ఆపరేటింగ్ సిస్టమ్‌లు కూడా అప్‌డేట్ అవుతున్నాయి. అలా ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లు కాలానుగుణంగా కొత్త వెర్షన్లు రిలీజ్ చేస్తాయి. అయితే ఇలా రిలీజ్ చేసిన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కూడా తెలియని వల్నరబిలిటీస్ అంటే లోపాలు ఉండొచ్చు.

వాటిని కూడా ఎప్పటికప్పుడు సదరు టెక్నికల్ టీంలు ముందుగానే గుర్తించి ఆ భద్రతా లోపాల్ని సరిదిద్దే చిన్న చిన్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు రిలీజ్ చేస్తాయి. వీటినే ప్యాచెస్ అంటారు. కొన్నిసార్లు సదరు ఆపరేటింగ్ సిస్టమే వాటిని ఆటో అప్‌డేట్ చేస్తుంది. ఒకవేళ ఆ లోపం మరింత పెద్దది అనిపిస్తే... వాటిని సరిదిద్దే సెక్యూరిటీ అప్‌డేట్లను కూడా రిలీజ్ చేస్తుంది. వాటిని మాన్యువల్‌గా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ ఉండాలి. కొన్ని ప్యాచెస్ మాన్యువల్‌గా అప్ డేట్ చేయడంతో పాటు, మనం ఫోన్ కూడా రీస్టార్ట్ చెయ్యాల్సి ఉంటుంది.

ఈ వల్నరబిలిటీస్ అన్నవి ఆపరేటింగ్ సిస్టమ్‌కి మాత్రమే కాదు.. మనం అందులో ఇన్ స్టాల్ చేసుకునే యాప్‌లకు కూడా ఉంటాయి. అందుకే బ్యాంకింగ్ వంటి కీలకమైన యాప్‌లు ఎప్పటికప్పుడు ఆటో అప్‌డేట్ అవుతూ ఉంటాయి. అంటే సదరు యాప్ నిర్వహించే బ్యాంకులు ఎప్పటికప్పుడు స్కాన్ చేసి, వాటిని సరిదిద్దే సెక్యూరిటీ అప్‌డేట్ ఇన్ స్టాల్ చేసి యాప్‌ని ఆటో అప్ ‌డేట్ చేస్తుంటాయి. కొన్ని యాప్‌లు మనకు అప్‌డేట్ చేసుకోవాలని నోటిఫికేషన్ పంపిస్తాయి.

స్మార్ట్ ఫోన్లే కాదు.. ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయిన డివైజ్ అయినా సరే

ఈ సైబర్ హ్యాకింగ్ అన్నది రెండు రకాలుగా ఉంటుంది. అందులో మొదటిది ఐటీ సెక్యూరిటీ.

అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ. విండోస్, ఐఓస్ఎస్, లినక్స్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లు, సంస్థలు వాడే సర్వర్లు వంటివి హ్యాక్ చేయడం. ఇక రెండోది ఓటీ సెక్యూరిటీ.

అంటే ఆపరేషన్ టెక్నాలజీ సెక్యూరిటీ. అంటే ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయ్యే వస్తువులను కూడా హ్యాక్ చేయడం. ఉదాహరణకు మన ఇంట్లో సీసీటీవీ, స్మార్ట్ టీవీలు, అపార్ట్‌మెంట్లలో సెక్యూరిటీ సిస్టమ్స్, ఫైర్ అలారమ్‌లు వంటి ఇంటర్నెట్ ఆధారిత వస్తువులు (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT) లను హ్యాక్ చేయడం వంటిది.

సినిమాల్లో ట్రాఫిక్ సిగ్నళ్లను, సీసీ కెమెరాలను హ్యాక్ చేయడం వంటివి చూపిస్తారు కదా.. అవి ఇలాంటివే. అంటే ఇంట్నెట్‌తో కనెక్ట్ అయిన ఏ డివైజ్‌ను అయినా హ్యాక్ చేసే ప్రమాదముంది.

అందుకే వాటికి రక్షణగా తగిన ఫైర్ వాల్స్ రూపొందిస్తూ ఉంటారని హరికృష్ణ మేదరమట్ల తెలిపారు. ప్రస్తుతం శామ్‌సంగ్‌ ఫోన్లలో తలెత్తిన ఇబ్బంది డివైజ్ స్పెసిఫిక్ ప్యాచ్ కాబట్టి, సదరు స్మార్ట్ ఫోన్లు వాడేవారు దాని సెక్యూరిటీ ప్యాచ్‌ను డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసి, ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలని హరికృష్ణ మేదరమట్ల తెలిపారు.

ఏంటి ఈ సెర్ట్ ఇన్

కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (cert.in) అన్నది భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన విభాగం.

ఇది ఇండియన్ సైబర్ సెక్యూరిటీ స్పేస్‌ను పరిరక్షించడం దీని ప్రధాన బాధ్యత. సెర్ట్ ఇన్... సైబర్ హ్యాకింగ్‌లను నివారించడం, రెస్పాన్స్ మేనేజ్‌మెంట్, సైబర్ సెక్యూరిటీలో క్వాలిటీ మేనేజ్‌మెంట్ సేవలను అందిస్తుంటుంది.

ఇందులో భాగంగా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, కీలకమైన వెబ్‌సైట్లు, ఇతర యాప్‌లలో దాగిన వల్నరబిలిటీలను నిత్యం శోధించి, గుర్తించిన భద్రతా లోపాలను వెల్లడిస్తుంది. తాజాగా శామ్‌సంగ్‌ ఫోన్లలో భద్రతా లోపాలను గుర్తించి డిసెంబర్ 13న నివేదికలో వెల్లడించింది.

ఆపరేటింగ్ సిస్టమ్ లో తేడాల వల్లే..

ఆండ్రాయిడ్ అన్నది ఓపెన్ ఆపరేటింగ్ ప్లాట్ ఫాం. అంటే దీని సోర్స్ కోడ్ అన్నది అందరికీ ఓపెన్ గా ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ ఆపరేటింగ్ ఫ్లాట్ ఫాం కాబట్టే.. దాని సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది.

దీనిని బేస్ చేసుకుని తమ ఫోన్లలో యూజర్ ఇంటర్ ఫేస్ లను అవి తమకు నచ్చినట్లుగా మార్పులు చేసుకుంటాయి.

అందుకే శామ్‌సంగ్‌, వన్ ప్లస్, షియోమీ, ఒప్పో, వివో, ఐకూ, పోకో ఇలా స్మార్ట్ ఫోన్లన్నీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ నే వాడుకున్నా.. తమకంటూ ప్రత్యేకమైన యూజర్ ఇంటర్ ఫేస్ లు తయారు చేసుకుంటాయి.

ఆండ్రాయిడ్ ఓఎస్ సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే ఎవరైనా దాని సోర్స్ కోడ్ ని పరిశీలించగలరు. దానిలోని లోపాలను పరిశోధించగలరు.

దీంతో వాటిలోని భద్రతా లోపాలను కనిపెట్టేందుకు హ్యాకర్లకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. కానీ కొన్ని క్లోజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే దీని సోర్స్ కోడ్ ఇతరులకు అందుబాటులో ఉండదు.

దీని వల్ల దానిని ఎవరూ పరిశోధించలేరు. అంటే అందులో ఉండే భద్రతా లోపాలు ఇతరులు తెలుసుకునే అవకాశం తక్కువ.

అందువల్లనే క్లోజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ హ్యాకింగ్ కి గురవ్వడం అరుదు.

మార్కెట్లో ఉన్న చాలా ప్రోడక్ట్‌లలో ఇలాంటి క్లోజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఆపిల్ ఐఓఎస్, బ్లాక్ బెర్రి, ఎక్స్ బాక్స్, ప్లే స్టేషన్ వంటి వాటిల్లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ క్లోజ్డ్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది.

భద్రత, డేటా ప్రైవసీ కీలకం అని భావించే వాళ్లు ఎక్కువగా ఐఫోన్లు, బ్లాక్ బెర్రీలు వాడతారని, అది కేవలం స్టేటస్ సింబల్ గా మాత్రమే భావించకూడదని సైబర్ నిపుణులు చెప్తున్నారు.

గణాంకాలను చూసుకున్నా క్లోజ్డ్ సిస్టమ్ కన్నా ఓపెన్ సిస్టమ్ మీద పనిచేసే డివైజ్ లలోనే ఎక్కువగా భద్రతా లోపాలు తలెత్తుతాయి. అయితే ఓపెన్ సిస్టమ్ వినియోగించడం వల్ల ప్రాథమికంగా స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకు లభిస్తాయి.

దీంతో వాటికి ఆదరణ కూడా ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో 5 నుంచి 6 వేల రూపాయల ధరలో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు కొత్తవే దొరుకుతాయి.

కానీ యాపిల్ వంటి క్లోజ్డ్ సిస్టమ్ ఉన్న ఫోన్ల ధరలు మాత్రం ఎక్కువగా ఉంటాయి.

అయితే ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్ నుంచి వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లు, సెక్యూరిటీ అప్ డేట్లు ఇన్ స్టాల్ చేసుకోవడంతో పాటు, నాణ్యమైన మొబైల్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్ చేసుకోవడం, ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్లను స్కాన్ చేసుకోవడం, వల్నరబిలిటీలను ముందుగా గుర్తించడం వల్ల సైబర్ హ్యాకింగ్‌లకు గురి కాకుండా జాగ్రత్త పడవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)