You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేపీ శర్మ ఓలీ: 14 ఏళ్ల జైలు జీవితం నుంచి నాలుగోసారి నేపాల్ ప్రధాని అయ్యే వరకు..
- రచయిత, రమా పరాజులి
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్) అధ్యక్షుడు ఖడ్గ ప్రసాద్ (కేపీ) శర్మ ఓలీ నూతన ప్రధానమంత్రిగా నియమితులయ్యారు.
అతిపెద్ద పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో ఓలీ రెండు రోజుల క్రితం మెజారిటీని నిరూపించుకున్నారు.
ఓలీ 2015లో 10 నెలలు, 2018లో 40 నెలలు, 2021లో 3 నెలలు.. మొత్తం నాలుగున్నరేళ్ల పాటు నేపాల్ ప్రధానిగా ఉన్నారు.
పదవీకాలంలో ఆయన అభిమానులను, విమర్శకులను ఇద్దరినీ సమానంగా సంపాదించుకున్నారు.
కేపీ ఓలీ పేరు చెప్పగానే, ఆయన అభిమానుల ముందు కనిపించే చిత్రం ఏమిటంటే - రెండుసార్లు కిడ్నీ మార్పిడి చేయించుకున్నా, పలుమార్లు ప్రధానమంత్రిగా దేశాన్ని నడిపించి, జాతీయవాదాన్ని సమర్థించే, రాజకీయ జీవితంలో చురుకుగా ఉండే నాయకుడు.
అదే సమయంలో, ఓలీ పదవిలో కొనసాగడానికి అన్ని దారులనూ ఉపయోగించుకుంటారని ఆయన విమర్శకులు అంటారు.
తన ప్రత్యర్థులపై పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించే ఓలీకి, తన కోరిక మేరకు రాజకీయ ఒప్పందాలను కుదుర్చుకుంటారు, లేదంటే వాటిని తోసిపుచ్చుతారు అన్న పేరుంది.
గత సంవత్సరం, ఆయన ఒక నేపాలీ వార్తాపత్రికలో, "నేను నా మనసు నుంచి 'ఓటమి', 'అవమానం' అనే పదాలను తొలగించాను" అంటూ రాసుకొచ్చారు. అదే కథనంలో "కొన్నిసార్లు ఎవరైనా నన్ను జయించామని సంబరాలు చేసుకుంటుంటే, నేను దాడికి సిద్ధమవుతుంటాను. నేను పడిపోయినా, వెంటనే లేస్తాను’’ అన్నారు.
అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు
2022లో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ పార్లమెంటులో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
అయితే ఎన్నికల ఫలితాల అనంతరం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆయనే ముందున్నారు.
ఆ సమయంలో ప్రచండకు ఓలీ పార్టీ మద్దతు ఇచ్చింది.
ఓలీ ప్రచండను ప్రధానిని, ఆయన ఎంపీలను మంత్రులుగా చేశారు.
ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ప్రచండ పార్టీ 'కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)', అధ్యక్ష ఎన్నికలలో నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రామచంద్ర పౌడెల్‌కు మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత యునిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ (యూఎమ్‌ఎల్)-మావోయిస్ట్ కూటమి విచ్ఛిన్నమైంది.
మొత్తానికి కాంగ్రెస్ మద్దతుతో కేపీ ఓలీ ఇప్పుడు ప్రధాని అయ్యారు.
అయితే కాంగ్రెస్-యూఎంఎల్ పొత్తు ఎంతకాలం కొనసాగుతుందని ప్రచండ సందేహాన్ని వ్యక్తం చేశారు.
విశ్వాస పరీక్ష సందర్భంగా ప్రచండ శుక్రవారం పార్లమెంటులో తన ప్రసంగంలో, ఓలీని ఉద్దేశించి వ్యంగ్యంగా, "దయచేసి పార్లమెంటును రద్దు చేయవద్దు" అని విజ్ఞప్తి చేశారు.
ఓలీ గతంలో పార్లమెంటును రద్దు చేయాలని రెండుసార్లు చేసిన సిఫారసులను ఆయనకు గుర్తు చేయడమే ఈ వ్యంగ్యం వెనుక ఉన్న ఉద్దేశం.
రాజకీయ విశ్లేషకుడు హరి శర్మ మాట్లాడుతూ, “ఓలీ సాహసవంతులు, ధైర్యవంతులు. లేకుంటే ఒకటికి రెండుసార్లు పార్లమెంటును ఎలా రద్దు చేస్తారు?’’ అన్నారు.
ప్రతినిధుల సభను రద్దు చేయాలని ఓలీ మొదట సిఫార్సు చేసినప్పుడు, ఆయన ప్రధానిగా, యూఎమ్‌ఎల్ నాయకురాలు విద్యా భండారీ అధ్యక్షురాలిగా ఉన్నారు.
2020 డిసెంబర్‌లో ప్రతినిధుల సభను రద్దు చేయాలని సిఫార్సు చేయగా, విద్యా భండారీ దానిని ఆమోదించారు.
ఈ చర్యపై ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, ఆ రద్దు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
2021లో, ఓలీ మరోసారి ప్రతినిధుల సభను రద్దు చేయాలని సిఫార్సు చేశారు. పార్టీలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఓలీ చర్యను కోర్టు మళ్లీ తప్పుబట్టింది.
అదే సమయంలో అసమ్మతి పెరగడంతో ఆయన పార్టీ సీనియర్ నేతలు ఝల్‌నాథ్ ఖనాల్, మాధవ్ కుమార్ నేపాల్, మరో 21 మంది ఎంపీలు పార్టీని వీడారు.
అలాగే యూఎమ్ఎల్, మావోయిస్టుల మధ్య చీలికలు రావడంతో, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ మూడు ముక్కలైంది.
ఓలీ నేతృత్వంలోని యూఎమ్‌ఎల్ ఒక వైపు, యునిఫైడ్ సోషలిస్టులు మరోవైపు, మావోయిస్టులు మూడో వైపు చీలిపోయారు.
ఓలీ వామపక్షాల ఐక్యతను కాపాడలేకపోయారని, దాదాపు మూడింట రెండు వంతుల మెజారిటీ ఉన్నా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయారని విమర్శలు వెల్లువెత్తాయి.
'జాతీయవాది'గా గుర్తింపు
ఓలీపై ఎన్నో విమర్శలు వచ్చినా, జాతీయవాదిగా ఆయనకు గుర్తింపు ఉంది, ప్రత్యేకించి ఆయన సొంత పార్టీ నేతలలో.
మాధవ్ కుమార్ నేపాల్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు సలహాదారుగా ఉన్న రఘుజీ పంత్, “భారతదేశం నేపాల్ మీద దిగ్బంధనం విధించినప్పుడు, కేపీ ఓలీ, యూఎమ్‌ఎల్ నాయకులు, కార్మికులు మాత్రమే దానికి వ్యతిరేకంగా గళం విప్పారు, బహిరంగంగా దానిని విమర్శించారు’’ అన్నారు.
ఇప్పుడున్న నేతల్లో కేపీ ఓలీయే శక్తివంతులని ఆయన అన్నారు. ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించడానికి వెనుకాడని నాయకులని పంత్ అన్నారు.
"ఓలీ హయాంలోనే నేపాల్ పార్లమెంటులో కొత్త మ్యాప్‌ను ఆమోదించారు" అని రఘుజీ పంత్ గుర్తు చేశారు.
ఓలీ పార్టీ సీపీఎన్-యూఎమ్ఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఓలీ గురించి చెబుతూ, కమ్యూనిస్ట్ పాలనను స్థాపించే ప్రయత్నంలో ఆయన తన జీవితంలో 14 సంవత్సరాలు జైలులో గడిపారని వర్ణించారు. ఆయనను విప్లవకారుడిగా, సోషలిస్టు నాయకుడిగా అభివర్ణించారు.
విమర్శలూ తక్కువేం కాదు
ఓలీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జన్మస్థలమైన తెహ్రాథుమ్ సమీపంలో నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి హెలిప్యాడ్‌ను నిర్మించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అలాగే ఓలీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది సాధారణ ప్రజలు ఆయనను కలవడానికి అనుమతించరు అన్న విమర్శలూ ఉన్నాయి.
ఓలీ 72 ఏళ్ల క్రితం నేపాల్‌లోని తూర్పు జిల్లా తెహ్రాథుమ్‌లో మోహన్ ప్రసాద్ ఓలీ, మధుమయ ఓలీ దంపతులకు జన్మించారు.
ఆయన 14 సంవత్సరాల వయస్సులో రాజకీయాల్లోకి ప్రవేశించి, 1970లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు.
1973లో అరెస్టయిన ఓలీ 14 సంవత్సరాల పాటు జైలులో ఉన్నారు. 1987లో జైలు నుంచి విడుదలైన తర్వాత, ఆయన సీపీఎన్ (ఎమ్ఎల్) కమిటీ మెంబర్ అయ్యారు.
1991లో ఝాపా-6 నుంచి ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఆయన 1994లో తిరిగి ఎన్నికయ్యారు.
ఆయన ఏప్రిల్ 2006 నుంచి మార్చి 2007 వరకు ప్రధానమంత్రి జీపీ కొయిరాలా నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంలో ఉప ప్రధానిగా ఉన్నారు.
అక్టోబర్ 11, 2015న, ఆయన మొదటిసారిగా దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
( బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)