సిరియా మిలటరీ అకాడమీపై డ్రోన్ దాడులు... 100 మందికి పైగా మృతి

    • రచయిత, డేవిడ్ గ్రిట్టెన్
    • హోదా, బీబీసీ న్యూస్

సిరియాలోని హొమ్స్ నగరంలో మిలటరీ అకాడెమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికిపైగా చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

అకాడెమీలో జవాన్ల స్నాతకోత్సవ వేడుకను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మహిళలు, పిల్లలు ఈ దాడిలో చనిపోయారు.

అంతర్జాతీయ శక్తుల సహకారంతో ఉగ్రవాద సంస్థలు ఈ దాడిని చేసినట్లుగా ఆర్మీ ఆరోపిస్తోంది. అయితే, ఈ దాడికి బాధ్యులమంటూ ఎవరూ ఇంతవరకు ప్రకటించుకోలేదు.

సిరియాలో అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. తిరుగుబాటుదారులు, జీహాదీలు కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు.

హొమ్స్ నగర ఉత్తర-పశ్చిమ ప్రాంతం నుంచి ఈ డ్రోన్ దాడులు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు

సిరియా న్యూస్ ఏజెన్సీ ‘సనా’ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న సమయంలో హొమ్స్ మిలటరీ అకాడెమీలో స్నాతకోత్సవ వేడుక పూర్తయిన కొద్ది సేపటికే పేలుడు పదార్థాలను మోసుకుని వచ్చిన డ్రోన్‌లు దాడులు చేశాయని మిలటరీ జనరల్ కమాండ్ తెలిపారు.

ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థలకు సరైన రీతిలో గట్టి సమాధానం ఇస్తామని ఆయన పేర్కొన్నట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఆరోగ్య శాఖ మంత్రి హసన్ అల్-గబ్బష్ ఈ ఘటన గురించి స్పందించినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ దాడిలో 200 మందికి పైగా గాయపడ్డారని, ఆరుగురు మహిళలు, ఆరుగురు పిల్లలు చనిపోయినట్లు మంత్రి తెలిపారని వెల్లడించింది.

నేలపై శవాలు

స్నాతకోత్సవ వేడుకల్లో అలంకరణ పనులు చేసిన వ్యక్తి దాడి గురించి చెప్తూ, “వేడుక అయిపోయాక అంతా ప్రాంగణంలోకి వెళ్లారు. అప్పుడే దాడులు జరిగాయి. ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో తెలీలేదు. కొద్దిసేపటికి శవాలు నేలపై పడి ఉన్నాయి” అని చెప్పారు.

దాడికి సంబంధించిన గ్రాఫిక్ వీడియాలో అక్కడి పరేడ్ గ్రౌండ్‌లో పడి ఉన్న శవాలు, సాయం కోసం క్షతగాత్రులు అరుస్తున్న దృశ్యాలు కనిపించాయి. వెనుక నుంచి కాల్పుల శబ్దాలు కూడా వినిపించాయి.

సిరియా రక్షణ శాఖ మంత్రి కూడా ఈ స్నాతకోత్సవ వేడుకకు హాజరయ్యారని, దాడి జరగడానికి కొద్ది క్షణాల ముందే వెళ్లిపోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (SOHR) నివేదించింది.

కొనసాగుతోన్న అంతర్యుద్ధం..

2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్- అస్సాద్ మరణం తర్వాత మొదలైన అంతర్యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 5 లక్షల మందికి పైగా మరణించారు. సుమారు 68 లక్షల మందికి పైగా వలస వెళ్లారని, మరో 60 లక్షల మంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారని అంచనా.

సిరియాలో శాంతిస్థాపన కోసం ప్రత్యేకంగా నియమితులైన ఐక్యరాజ్య సమితి రాయబారి గైర్ పెడెర్‌సెన్ ఈ ఘటనను 'భయానక దాడి'గా వర్ణించారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని కోరారు.

“అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అన్ని పక్షాలు పౌరుల రక్షణ, మౌలిక సదుపాయల కల్పనపై దృష్టి సారించాలి” అని అన్నారు.

“సిరియాలో యథాతథ స్థితి లేదని, రాజకీయంగా అనిశ్చితి నెలకొందని ఈ దాడులను చూస్తే అర్థమవుతోంది. పరిస్థితి మరింత దిగజారుతుందని నేను భయపడుతున్నాను” అన్నారు.

గురువారం ఉత్తర-తూర్పు సిరియాలోని కుర్దిష్ మిలిటెంట్ సంస్థ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో జరిగిన తుర్కియే డ్రోన్ దాడిలో 10 మంది చనిపోయారు. కుర్దిష్ మిలిటెంట్లు అంకారాపై చేసిన బాంబు దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి.

హస్సాకెలోని వాటర్ స్టేషన్, ఆయిల్ ఫీల్డ్, కామిష్లీలోని పవర్ స్టేషన్, అమెరికా మద్దతు, కుర్దిష్ నేతృత్వంలోని మిటిలెంట్ల కూటమి, సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ వంటి ప్రదేశాలతో సహా మొత్తం 17 ప్రాంతాలు లక్ష్యంగా మారాయని SOHR తెలిపింది.

మరోఘటనలో సాయుధ తుర్కియే డ్రోన్‌ను యూఎస్ మిలటరీ కూల్చివేసినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపినట్లు రాయిటర్స్ సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)