You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పాకిస్తాన్ దాడులను భారత్ ఎలా అడ్డుకుందంటే...
- రచయిత, ప్రవీణ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్ మిలటరీ స్థావరాలపై గురువారం(మే 8) రాత్రి క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్ చేసిందని, భారత గగనతల రక్షణ వ్యవస్థ వాటిని భగ్నం చేసిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే, భారత సైనిక స్థావరాలపై తాము దాడి చేయలేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి అన్నారు.
పాకిస్తాన్ రక్షణమంత్రి వ్యాఖ్యలపై భారత్ స్పందించింది.
"తన చర్యలకు బాధ్యత వహించే బదులు, భారత సాయుధ దళాలు అమృత్‌సర్ వంటి తన సొంత నగరాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని పాకిస్తాన్ అసంబద్ధమైన, దారుణమైన వాదనలు చేస్తోంది. పాకిస్తాన్ చరిత్రను గమనిస్తే ఎదుటివారిపై నిందను మోపడంలో ఆ దేశం నిష్ణాతురాలని అర్ధమవుతుంది" అని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రయోగించే క్షిపణులను ఆపడానికి భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందనేదానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
అయితే, భారత్ దాడులను అడ్డుకోవడంలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ విఫలమైంది. తమకు భారీగా నష్టం జరిగిందని, 33 మంది చనిపోయారని పాకిస్తాన్ అంగీకరించింది.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏం చెబుతోంది?
దాడులపై గురువారం(మే 8) భారత్, పాకిస్తాన్‌లు తమ తమ వాదననలను వినిపించాయి.
"జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లోని మిలటరీ స్థావరాలపై డ్రోన్, క్షిపణులతో పాకిస్తాన్ దాడులు జరిపింది. ఈ దాడులను తిప్పికొట్టాం" అని భారత రక్షణ శాఖ తెలిపింది.
"ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. తన సార్వభౌమత్వాన్ని, పౌరులను రక్షించుకోవడానికి భారత్ కట్టుబడి ఉంది" అని రక్షణ శాఖ చెప్పింది.
ఈ క్షిపణులన్నింటినీ గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుని, ధ్వంసం చేసిందని భారత్ తెలిపింది.
అయితే, జమ్మూకశ్మీర్‌లో దాడులకు పాకిస్తాన్‌ది బాధ్యత కాదని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.
"మేము ఇంకా ఏమీ చేయలేదు. పాకిస్తాన్ దాడి చేసినప్పుడు అందరికీ తెలుస్తుంది" అని ఖవాజా ఆసిఫ్ బీబీసీతో అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో పేలుళ్లు, విద్యుత్ సరఫరా నిలిపివేత వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఖవాజా ఆసిఫ్ బీబీసీతో మాట్లాడారు.
దాడులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎలా తిప్పికొట్టింది?
జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లలో పాకిస్తాన్ చేసిన డ్రోన్, క్షిపణి దాడులను భారతదేశం మూడు విధాలుగా తిప్పికొట్టిందని రక్షణరంగ నిపుణులు రాహుల్ బేదీ చెప్పారు.
''2018-19లో రష్యా నుంచి భారత్ ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది. దీనిని జమ్మూ చుట్టూ ఏర్పాటు చేశారు. ఈ ప్రయోజనం కోసమే ఈ క్షిపణి వ్యవస్థను ఉంచారు. ఇది విమానం, హెలికాప్టర్, డ్రోన్ల దాడులను అడ్డుకుంటుంది'' అని ఆయన చెప్పారు.
"భారత్‌కు సొంతంగా ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. ఈ దాడులను ఆపడంలో అది కూడా విజయవంతమైంది. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన 'స్పైడర్' వైమానిక రక్షణ వ్యవస్థ కూడా భారతదేశంలో ఉంది'' అని బేదీ తెలిపారు.
"నాకు తెలిసినంత వరకు, జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌లలో పాకిస్తాన్ చేసిన దాడులను భారతదేశం ఎస్-400 ద్వారా అడ్డుకుంది" అని ఆయన అన్నారు.
భారత గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యం ఎంత?
భారత గగనతల రక్షణ వ్యవస్థ సామర్థ్యం గురించి తెలుసుకోవడానికి, లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువాతో కూడా బీబీసీ మాట్లాడింది.
పాకిస్తాన్ చేస్తున్న దాడులను సొంత గగనతల రక్షణ వ్యవస్థతో భారత్ అడ్డుకుందని సతీశ్ దువా చెప్పారు.
"మాకు మా సొంత గగనతల రక్షణ వ్యవస్థ ఉంది. వేర్వేరు రేంజ్‌ల కోసం వేర్వేరు క్షిపణులున్నాయి. దాని వల్ల మా గగనతలాన్ని మేం రక్షించుకోగలిగాం" అని సతీశ్ దువా చెప్పారు.
"మొదట వాటిని రాడార్ ద్వారా పసిగట్టి, ఆ తర్వాత కూల్చివేస్తారు. ప్రతి రాడార్‌కు సామర్థ్యం ఉంటుంది'' అని సతీశ్ దువా చెప్పారు.
"రాడార్ ద్వారా పసిగట్టడానికి 65 సెకన్లు పడుతుంది. వెంటనే స్పందించాలి. ఒక క్షిపణి వేగంగా వస్తుంటే, వెంటనే కూల్చివేయాలి. సరిహద్దు దాటే ముందే దాన్ని అడ్డుకోవాలి" అని ఆయన తెలిపారు.
"ఈ క్షిపణుల వేగం చాలా ఎక్కువ. గంటకు 15 నుంచి 17 వేల కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది. చాలా ఎక్కువ పరిధి ఉంటుంది. దానికి అనుగుణంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అలాంటి దాడులను ఆపగల పూర్తి సామర్థ్యం భారత గగనతల రక్షణ వ్యవస్థకు ఉంది'' అని సతీశ్ దువా చెప్పారు.
భారత్ సన్నద్ధంగా ఉందా?
భారత గగనతల రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందని కల్నల్ అజయ్ సింగ్ చెప్పారు.
"ఎస్-400 రక్షణ వ్యవస్థ చాలా బలమైనది. వాటి పరిధి 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. 400 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగలదు.
మా గగనతల రక్షణ వ్యవస్థలో అనేక దశలున్నాయి. ఒకటి దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఛేదించడం, ఇంకొకటి మధ్య స్థాయి, మరొకటి తక్కువశ్రేణి లక్ష్యాలను ఛేదించేవి'' అని అజయ్ సింగ్ చెప్పారు.
దాడులను తిప్పికొట్టేందుకు భారత గగనతల రక్షణ వ్యవస్థ సన్నద్ధంగా ఉందని కల్నల్ అజయ్ సింగ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)