You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గణేష్ బారయ: ఎంబీబీఎస్ సీటు కోసం ఎంసీఐపై పోరాడి గెలిచిన ‘మూడు అడుగుల’ డాక్టర్ కథ
‘మూడు అడుగులే’ ఉన్నావంటూ వైద్య విద్యను అభ్యసించడానికి భారత వైద్య మండలి(ఎంసీఐ) ప్రవేశాన్ని నిరాకరిస్తే, ఆయన న్యాయపోరాటం చేసి విజయం సాధించారు.
ఇప్పుడు తెల్లకోటు వేసుకుని రోగులను పరీక్షిస్తున్నారు.
జూనియర్ డాక్టర్ గణేష్ బారయ.
స్ఫూర్తిదాయకమైన ఆయన ప్రయాణం ప్రస్తుతం ప్రధాన వార్తల్లో కనిపిస్తోంది.
గుజరాత్‌లోని భావ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి గణేష్ ఇటీవలే ఎంబీబీఎస్ పట్టా పొందారు.
కేవలం మూడడుగులు, 18 కిలోల బరువుండే 23 ఏళ్ళ గణేష్ ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తున్న డాక్టర్‌గా గుర్తింపు పొందారు.
కొన్నిరోజుల కిందటి నుంచే ఆయన జూనియర్ డాక్టర్‌గా రోగుల నాడి పడుతున్నారు.
గణేష్ భావనగర్ జిల్లా తలాజా తాలుకాలోని గోర్కీ గ్రామంలో జన్మించారు.
మార్చి 2025లో ఆయన జూనియర్ డాక్టర్‌షిప్ పూర్తవుతుంది. దీంతోపాటు ఆయన పోస్టు గ్రాడ్యుయేషన్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, సైకియాట్రీలలో ఏదో ఒక కోర్సులో పీజీ చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఎంసీఐ చెప్పిన కారణం ఏమిటి?
డాక్టర్ గణేష్ ప్రయాణం తొలి నుంచి ఆసక్తికరంగా ఉంది. ఈ ప్రయాణంలో ఆయన తన స్నేహితులు, స్కూల్ డైరక్టర్, మెడికల్ కాలేజీ డీన్, ప్రొఫెసర్ల సహాయ సహకారాలు పొందారు.
గణేష్ 2018లో వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్’ పాసయ్యారు.
కానీ భారత వైద్య మండలి(ఎంసీఐ) ఆయన ‘మూడడుగుల ఎత్తు’ కారణంగా ఎంబీబీఎస్‌లోకి ప్రవేశాన్ని నిరాకరించింది. తన ఎత్తు కారణంగా ఆయన అత్యవసర కేసులు చూడలేరని ఎంసీఐ తెలిపింది.
ఎంసీఐ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయాల్సిందిగా గణేష్ చదివిన స్కూల్ యాజమాన్యం సలహా ఇచ్చింది.
‘‘ఎంసీఐ ఎంబీబీఎస్‌లో ప్రవేశాన్ని నిరాకరించినప్పుడు, నేను చదివిన తలాజా నీల్ కాంత్ విద్యాలయం హైకోర్టుకు వెళ్ళేలా సహాయసహకారాలు అందించింది. హైకోర్టు మా కేసు కొట్టివేసినా సుప్రీంకోర్టు వరకు వెళ్ళేలా ప్రోత్సహించారు. కానీ హైకోర్టు నిర్ణయం నన్నెంతో నిరుత్సాహానికి గురిచేసింది’’ అని గణేష్ బీబీసీకి చెప్పారు.
‘‘హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నా ధైర్యం సడలిపోలేదు. అందుకే నమ్మకంగా సుప్రీంకోర్టు గడప తొక్కాను. నా ఎత్తు కారణంగా ప్రవేశాన్ని నిరాకరించడం సరికాదంటూ, ఎంబీబీఎస్‌లో నన్ను చేర్చుకోవాలంటూ సుప్రీంకోర్టు 2018 అక్టోబరు 23న ఆదేశాలు ఇచ్చింది’’ అని ఆయన తెలిపారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గణేష్‌కు 2019 ఆగస్ట్ 1న భావ్‌నగర్ వైద్య కళాశాలలో ప్రవేశం లభించింది. ఆ సమయంలో ఆయన బరువు 16 కేజీలే.
ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసి భావ్‌నగర్‌లోని తక్త్‌సింగ్‌జీ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.
విద్యాభ్యాసం సమయంలో సమస్యలు
‘‘తక్కువ ఎత్తు వల్ల రోజూవారీ పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. స్కూల్ రోజుల్లో అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ స్కూల్ యాజమాన్యం చక్కగా సహకరించింది. నాకోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది’’ అని గణేష్ తెలిపారు.
‘‘కాలేజీలో ప్రాక్టికల్ పరీక్షల సమయంలో సమస్యలు ఎదురైతే, డీన్ సహాయపడ్డారు. కాలేజీ ప్రొఫెసర్లు ప్రాక్టికల్స్ నిర్వహించేటప్పుడు నాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించేవారు. అలాగే అవసరమైనప్పుడు కళాశాలలో స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు. నా స్నేహితులు ఎప్పుడూ పరీక్షలలో ముందు కూర్చోవాలని చెప్పేవారు. ఆ సమయంలో నేను ఓ చిన్న టేబుల్ ఉపయోగించేవాడిని’’ అని చెప్పారు గణేష్.
చికిత్స, మాట తీరుకు రోగుల ఫిదా
గణేష్ బారయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక సన్మానాలు పొందారు.
2023 సెప్టెంబర్‌లో గణేష్‌ను తైవాన్ ప్రెసిడెంట్ సన్మానించారు.
గుజరాత్ ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు, ఇతర సామాజిక కార్యక్రమాలలో ఆయన్ను గౌరవించేవారు.
డాక్టర్ కావాలనే తన కలను సాకారం చేసుకున్నట్టు గణేష్ చెప్పారు.
‘‘నేను స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ ఎత్తుతో నువ్వు ఎంబీబీఎస్ చదవగలిగితే కచ్చితంగా ప్రపంచ రికార్డు సాధిస్తావని చెప్పేవారు. ఆ స్ఫూర్తే నన్ను కష్టపడి చదివేలా చేసింది. ఇప్పుడు నేనున్న స్థాయికి కారణం నేను పడిన కష్టమే’’ అంటారు గణేష్.
గణేష్ ఎప్పుడూ చిరునవ్వుతో ప్రజలను పలకరిస్తుంటారు. ఆయనకు తల్లిదండ్రులతోపాటు ఏడుగురు అక్కలు, బీఈడీ చదువుతున్న తమ్ముడు ఉన్నారు. ఆయన తండ్రి వ్యవసాయం చేస్తారు.
గణేష్ అంకుల్‌కు ఐదుగురు పిల్లలుంటే ఐదుగురూ డాక్టర్లే.
గణేష్‌ను చూడగానే రోగులు ఆశ్చర్యపోతుంటారు. కానీ ఆయన చికిత్స అందించే విధానం, మాటతీరు చూసి వారెంతో సంతోషపడతారు.
గణేష్‌ది సహజంగానే అందరితో కలిసిపోయే మనస్తత్వం.
శారీరక వైకల్యం ఉన్నవారికి గణేష్ ఇప్పుడొక స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
‘‘ప్రతిభాసామర్థ్యాలున్న ఏ వికలాంగ వ్యక్తీ వైకల్యం కారణంగా పరుగు ఆపకూడదు. నమ్మకంతో ముందడుగు వేస్తే విజయం ఖాయం’’ అంటారు గణేష్.
ఇవి కూడా చదవండి:
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- పనామా కాలువలో నీరు ఎందుకు ఎండిపోతోంది? దీనికి పరిష్కారం ఏమిటి?
- మెదడుకు చేటు చేసే 11 అలవాట్లు, వాటి నుంచి బయటపడే మార్గాలు
- అనంత్ అంబానీ: వేల జంతువులతో రిలయన్స్ నిర్వహిస్తున్న ‘వంతారా’ జూలో ఏం జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)