You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దక్షిణ రష్యాలో చర్చ్‌లు, ప్రార్థనాస్థలాలపై దాడుల్లో 19 మంది మృతి
- రచయిత, హెన్రీ ఆస్టియర్, స్టీవ్ రోసెన్‌బర్గ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
రష్యాలోని ఉత్తర కాకేసస్‌లో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ దగిస్తాన్‌లో కొందరు సాయుధులు పోలీసు పోస్ట్‌లు, చర్చిలు, యూదుల ప్రార్థనాస్థలాలపై జరిపిన దాడుల్లో 19 మంది మరణించారు. చనిపోయినవారిలో పోలీసు అధికారులు, సాధారణ పౌరులు ఉన్నారు. ఎదురు కాల్పులలో ఆరుగురు సాయుధులు మరణించారు.
గాయపడిన మరో 16 మందిని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘటన తరువాత చెచెన్యా పొరుగున ఉన్న రష్యా దక్షిణ ప్రాంతంలో.. ప్రధానంగా ముస్లిం రిపబ్లిక్ అయిన దగిస్తాన్‌లో మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు.
ఫెస్టివల్ ఆఫ్ పెంతెకోస్ట్ రోజున డెర్బెంట్, మఖచ్కాల నగరాలను లక్ష్యంగా చేసుకుని, అత్యంత పకడ్బందీగా ఈ దాడులు జరిపారు.
చనిపోయిన వారిలో ఒక చర్చి ఫాదర్ ఉన్నారు. డెర్బెంట్‌లో 40 ఏళ్లుకు పైగా పనిచేసిన ఫాదర్ నికోలాయ్ కొటెల్నికోవ్ సహా పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని ‘హెడ్ ఆఫ్ ద దగిస్తాన్’ సెర్గీ మెలికోవ్ తెలిపారు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో దాడికి సంబంధించిన దృశ్యాలున్నాయి. అత్యవసర సేవల వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ముందు నల్లని దుస్తులు ధరించిన కొందరు పోలీసు కార్లపై కాల్పులు జరపడం అందులో కనిపించింది.
యూదులు ఎక్కువగా ఉన్న డెర్బెంట్‌లో సాయుధులు ఒక ప్రార్థనా మందిరం, చర్చిపై దాడి చేశారు. ఆపై వాటికి నిప్పు పెట్టారు.
గతంలోనూ దగిస్తాన్‌లో ఇస్లామిస్ట్ దాడులు జరిగాయి.
సాయుధులు ఎవరనేది ఇంకా అధికారికంగా గుర్తించలేదు. అయితే ఆదివారం దాడులు జరిపిన వారిలో మఖచ్కాల సమీపంలోని సెర్గోకాలిన్‌స్కీ జిల్లా అధిపతి మాగోమెడ్ ఒమరోవ్ కుమారులైన ఒస్మాన్, ఆదిల్ ఉన్నారని, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని రష్యా మీడియా వెల్లడించింది.
టెలిగ్రామ్‌లో షేర్ అయిన ఒక వీడియోలో, యుక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధంలో దగిస్తాన్ పాల్గొనడమే దాడులకు కారణమని.. ఈ దాడికి విదేశాలలో ప్రణాళికను రూపొందించారని సెర్గీ మెలికోవ్ అన్నారు.
‘‘ఉగ్రవాద దాడుల వెనుక ఎవరున్నారో, వారి లక్ష్యం ఏమిటో అర్థమవుతోంది’’ అని ఆయన తెలిపారు.
రష్యన్ స్టేట్ డ్యూమా అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ అధిపతి లియోనిడ్ స్లట్‌స్కీ సైతం దీనిని సమర్థించారు. దగిస్తాన్ దాడులు, రష్యా ఆక్రమిత సెవాస్టోపోల్‌లో నలుగురి మరణానికి కారణమైన క్షిపణి దాడి "యాదృచ్ఛికం కాదు" అని ఆయన అన్నారు.
ఈ విషాదకరమైన సంఘటనలు రష్యా ప్రజలను భయాందోళనలకు గురిచేయడానికి, వారిని విభజించడానికి ఉద్దేశించినవని స్లట్‌స్కీ ఆరోపించారు.
అయితే, ఆక్రమిత యుక్రెయిన్‌లోని రష్యన్ జాతీయవాది దిమిత్రి రోగోజిన్.. ‘‘ ప్రతీ దాడిని యుక్రెయిన్, నాటోల కుతంత్రాలుగా భావిస్తే అలాంటి తప్పుడు భావన అనేక పెద్ద సమస్యలకు దారి తీస్తుంది" అని హెచ్చరించారు.
క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ.. క్రిమియా, దగిస్తాన్‌పై జరిగిన దాడుల్లో తమ ఆప్తులను కోల్పోయిన వారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం తెలిపారని అన్నారు.
దాడుల తర్వాత ప్రారంభించిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ముగిసిందని రష్యా వార్తా సంస్థలు సోమవారం వెల్లడించాయి.
2007 - 2017 మధ్య కాలంలో, మొదట కాకేసస్ ఎమిరేట్ అనే పేరున్న జిహాదిస్ట్ సంస్థ, ఆ తర్వాత ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ కాకేసస్‌గా పేరు మార్చుకుని దగిస్తాన్, దాని పొరుగున ఉన్న చెచెన్యా, ఇంగుషెతియా, కబార్డినో-బల్కారియాలలో దాడులు చేసింది.
మార్చిలో మాస్కో సమీపంలోని క్రోకస్ సిటీ హాల్ వేదికపై దాడి జరిగిన తరువాత, ఇస్లామిక్ స్టేట్ బృందం ఆ దాడికి కారకులం తామే అని చెప్పుకొన్నా అధికారులు యుక్రెయిన్, పాశ్యాత్య దేశాలే దీనికి కారణం అని ఆరోపించారు.
అప్పుడు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. "ఇస్లామిక్ ఛాందసవాదుల దాడులకు రష్యా లక్ష్యంగా కాకూడదు" అన్నారు. "రష్యా సర్వమత సామరస్యం, విభిన్న జాతులు, విభిన్న మతాల ఐక్యతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది" అన్నారు.
మూడు నెలల క్రితం మాస్కోలోని ఒక యూదుల ప్రార్థనా మందిరంపై దాడి చేయడానికి ఇస్లామిక్ స్టేట్ పన్నిన కుట్రను అడ్డుకున్నట్లు రష్యా దేశీయ భద్రత సేవల విభాగం ఎఫ్‌ఎస్‌బీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలు... దీనికి భారతదేశమే కారణమా?
- అయోధ్యలో మసీదుకు కేటాయించిన స్థలంలో నిర్మాణం ఇంకా ఎందుకు ప్రారంభం కాలేదు - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- చైనీస్ మాంజా మెడకు చుట్టుకోవడంతో హైదరాబాద్‌లో జవాన్ కోటేశ్వర్ రెడ్డి మృతి... ఈ పతంగి దారం ఎందుకంత ప్రమాదకరం?
- పాడేరు: మేఘాలు తాకే వంజంగి కొండపైకి టూరిస్టులు రాకపోతేనే బావుండని స్థానికులు ఎందుకంటున్నారు?
- షాపులో దొంగతనం చేసి పట్టుబడిన న్యూజీలాండ్ పార్లమెంటు సభ్యురాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)