You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నారీ శక్తి వందన: ‘దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ సమావేశాల్లో ఆమోదిస్తాం’
దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిందని, ఈ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం తెలుపుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
పార్లమెంటు కొత్త భవనంలో తొలి ప్రసంగం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును తమ ప్రభుత్వం ఆమోదిస్తుందని తెలిపారు.
మహిళలకు రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన" చట్టానికి రాజ్యాంగ సవరణ ప్రతిపాదనను లోక్‌సభలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు.
కొత్త పార్లమెంట్‌లో సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే కేంద్ర ప్రభుత్వం తొలి బిల్లుగా దీన్ని ప్రవేశపెట్టింది.
దీని గురించి ప్రధాని మోదీ మాట్లాడారు.
"మహిళల రిజర్వేషన్‌కు సంబంధించి ఇంతకుముందు కూడా పార్లమెంట్‌లో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. దీనికి సంబంధించిన బిల్లును మొదటిసారిగా 1996లో ప్రవేశపెట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును అటల్ జీ హయాంలో చాలాసార్లు సమర్పించారు. కానీ, మేం దాన్ని ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోలేకపోయాం. స్త్రీలకు హక్కులు కల్పించే బిల్లును ప్రవేశపెట్టే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు" అని మోదీ అన్నారు.
‘‘మరోసారి మా ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేసింది. సోమవారమే కేబినెట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించింది. సెప్టెంబర్ 19వ తేదీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. నారీ శక్తి విధాన రూపకల్పనలో ఇది చాలా ముఖ్యం. దీనికి మీరంతా సహకరించండి. కొత్త పార్లమెంట్ హౌస్‌లో తొలి ప్రొసీడింగ్‌గా దేశం కొత్త మార్పు కోసం పిలుపునిస్తున్నా" అని ప్రధాని అన్నారు.
"మా ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతోంది. లోక్‌సభ, శాసనసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడమే దీని లక్ష్యం. నారీ శక్తి వందన చట్టాన్ని ప్రవేశపెడుతున్నాం" అని ప్రధాని అన్నారు.
(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)