లోక్‌సభ: ఎంపీ డానిష్ అలీ పై బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు, దీనిపై ఎవరేమన్నారు ?

లోక్‌సభలో బహుజన్ సమాజ్‌ పార్టీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటానని ఆయన్ను హెచ్చరించారు.

రమేశ్ బిధూరి వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించారు.

గురువారం లోక్‌సభలో 'చంద్రయాన్-3 విజయం'పై చర్చ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ఉద్దేశించి బిధూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.

దక్షిణ దిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. బిధూరి వ్యాఖ్యలు చేసిన వెంటనే సభలోనే ఉన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఈ విషయంపై ఎంపీ డానిష్ అలీ స్పందిస్తూ.. 'నాకు న్యాయం జరుగుతుందని, స్పీకర్ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. అలా జరగకపోతే ఈ సభను నుంచి వెళ్లిపోవడంపై నిర్ణయం తీసుకుంటా' అని అన్నారు.

మరోవైపు బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రమేశ్ బిధూరికి బీజేపీ షోకాజ్ నోటీసులు పంపింది. తమ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ నోటీసులు పంపినట్లు బీజేపీ వెల్లడించిందని పీటీఐ, ఏఎన్ఐ వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి.

రమేశ్ బిధూరిపై చర్యలు తీసుకోవాలంటూ పలు ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌కు లేఖ రాశాయి.

డాక్టర్ హర్షవర్ధన్‌పై ఆరోపణలు ఏంటి ?

రమేశ్ బిధూరి అభ్యంతరకరమైన పదాలు వాడుతున్నప్పుడు, బీజేపీ ఎంపీ డాక్టర్ హర్షవర్ధన్ ఆయన పక్కనే ఉన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో ఆయన నవ్వుతున్నట్లు వీడియోలో కనిపించింది.

దీనిపై కొందరు సోషల్ మీడియా యూజర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా, హర్షవర్ధన్‌కు కొన్ని ప్రశ్నలు కూడా వేశారు. అయితే, దీనిపై వెంటనే స్పందించిన హర్షవర్ధన్, వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘‘ఇరుపక్షాలు అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడాన్ని మా సీనియర్ నాయకుడు రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే ఖండించారు.’’ అని హర్షవర్ధన్ అన్నారు.

‘‘సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా రాస్తున్న నా ముస్లిం ఫ్రెండ్స్‌ను ఒకటే విషయం అడుగుతున్నా. సమాజంలో సున్నితమైన సమస్యలను రెచ్చగొట్టేవారి పక్షాన నేను ఉంటానని మీరు అనుకుంటున్నారా’’ అని ఆయన ప్రశ్నించారు.

కొందరు వ్యక్తులు పనిగట్టుకుని తన ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారని, తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో లక్షలమంది ముస్లింలతో కలిసి పని చేశానని ఆయన చెప్పారు.

తాను చాందినీ చౌక్‌ నుంచి ఎంపీగా గెలిచానని, అన్ని వర్గాలు నాకు మద్ధతు ఇవ్వకపోతే ఇది సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు. ఈ వివాదంలోకి తనను లాగడం బాధాకరమని హర్షవర్థన్ అన్నారు.

కాంగ్రెస్ ఎలా స్పందించింది?

బిధూరి వ్యాఖ్యలపై రాజకీయంగా ఘాటైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఏఎన్ఐ వార్తా సంస్థతో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘అతను (రమేష్ బిధూరి) డానిష్ అలీతో మాట్లాడిన తీరు సరైనది కాదు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ క్షమాపణలు చెప్పారు. కానీ ఇది సరిపోదు. అలాంటి పదజాలం సభ లోపలగానీ, వెలుపలగానీ ఉపయోగించరానిది’’ అని అన్నారు.

‘‘కొత్త పార్లమెంటు భవనాన్ని నారీ శక్తి చట్టంతో ప్రారంభించామని మోదీ చెబుతున్నారు. కానీ, రమేశ్ బిధూరితో ప్రారంభించారు. ఇది రమేశ్ బిధూరి ఆలోచన కాదు. బీజేపీ ఆలోచనా విధానం. బిధూరి సస్పెండ్ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని జైరాం రమేశ్ అన్నారు.

‘‘ఒక చట్ట సభలో బీజేపీ ఎంపీ రమేశ్ బీఎస్పీ ఎంపీని దుర్భాషలాడారు. ఇది సరైంది కాదు’’ అని మరో కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా శ్రీనెత్ అన్నారు.

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఏమన్నారు?

రమేశ్ బిధూరి వ్యాఖ్యలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు.

"ఈ వీడియోలో బిధూరి తోటి ఎంపీ మీద అభ్యంతరకరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. జాతి గౌరవాన్ని కాపాడే స్పీకర్ ఓం బిర్లా, విశ్వగురు నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాగార్లూ...ఆయనపై చర్యలు తీసుకోండి’’ అంటూ బిధూరి వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు.

‘‘ముస్లింలు, వెనకబడిన వర్గాలను అవహేళన చేయడం బీజేపీ సంస్కృతిలో భాగం. ఇందులో వారికి తప్పేమీ కనిపించదు. నరేంద్ర మోదీ ఈ దేశంలో ముస్లింలను భయాందోళనలోకి నెట్టారు కాబట్టి వారు మాట్లాడలేరు. చిరునవ్వుతో అన్నీ భరిస్తారు. కానీ, నాకు కాళికా మాత వెన్నెముక ఇచ్చింది. కాబట్టి నేను ఇలాంటివి ఖండిస్తూనే ఉంటాను’’ అని రాశారు.

‘రమేశ్ బిధూరిని జైల్లో పెట్టాలి’

‘‘విద్వేషం నిండిన ఈ ఎంపీలు ఎంత తేలికగా ఇలాంటి అభ్యంతరకర పదాలను ఉపయోగిస్తున్నారు. ముస్లింలపై ద్వేషం ఇంతగా ఎప్పుడూ లేదు. బీజేపీలోని ముస్లిం నేతలు ఇలాంటి ద్వేషం నిండిన నేతలతో ఎలా కలిసి ఉండగలుగుతున్నారో’’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఎక్స్‌(ట్విట్టర్‌)లో రాశారు.

రమేష్ బిధూరిని తక్షణమే డిస్మిస్ చేసి జైలులో పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అమానతుల్లా ఖాన్ ఎక్స్‌లో రాశారు.

తమ ఎంపీపై బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ నాయకురాలు మాయావతి స్పందించారు.

‘‘సభలో ఉన్న సీనియర్ మంత్రి క్షమాపణలు చెప్పారు. కానీ, ఆ ఎంపీపై పార్టీ ఇంకా తగిన చర్యలు తీసుకోకపోవడం విచారకరం.’’ అని సోషల్ మీడియాలో రాశారు.

‘బీజేపీకి ఇది కొత్త కాదు’

ఇటు ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.

ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..."నరేంద్ర మోదీ ఈ వీడియోను త్వరలో అరబిక్‌లో డబ్ చేసి తన స్నేహితులకు పంపాలని నేను సూచిస్తున్నాను" అని రాశారు.

‘‘బీజేపీకి ఇదేమీ కొత్త కాదు. ఆ పార్టీ అగాథం నుంచి ఇంకా అగాథంలోకి వెళ్లిపోతోంది. ఆ ఎంపీపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోదని నేను అనుకుంటున్నాను. త్వరలో ఆయన్ను బీజేపీ దిల్లీ అధ్యక్షుడిగా చేసే అవకాశం కూడా ఉంది’’ అని ఒవైసీ రాశారు.

తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేశ్ బిధూరిపై చర్యలు తీసుకోవాలిన డానిష్ అలీ కూడా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.

“ఈ రోజు దేశంలో ప్రజాప్రతినిధినైన నా పరిస్థితే ఇలా ఉంటే, సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి” అని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)