You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్: కంటోన్మెంట్ విలీనం, ప్రజలకు లాభమా, నష్టమా...
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశవ్యాప్తంగా కంటోన్మెంట్ బోర్డుల విలీనానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా విలీన ప్రక్రియను వేగవంతం చేయాలంటూ జూన్ 27 ఆదేశాలు జారీ చేసింది రక్షణ శాఖ.
దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో ఉన్న సివిల్ ఏరియాలు (ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల)ను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేస్తారు.
తెలంగాణతోపాటు మరో 8 రాష్ట్రాల్లోని కంటోన్మెంట్ ఏరియాల్లో ప్రజలు నివాసముంటున్న ప్రాంతాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తారు.
విలీన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
విలీనంలో ఏం చేస్తారంటే..
మున్సిపల్ కార్పొరేషన్‌లో కంటోన్మెంట్ ప్రాంతం/బోర్డు విలీనంలో భాగంగా ఏం జరగనుందనే విషయంపై కేంద్ర రక్షణ శాఖ ఈ ఏడాది జూన్ 25న జరిగిన సమావేశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మినిట్స్ జారీ చేసింది.
ఇందులో భాగంగా..
- పౌరులకు వసతులు, మున్సిపల్ సేవలు అందించాల్సిన ప్రాంతాలకు సంబంధించి అన్ని ఆస్తులపై యాజమాన్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వం లేదా మున్సిపల్ కార్పొరేషన్లకు ఉచితంగా బదలాయిస్తారు.
- కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు, అప్పులను సంబంధిత మున్సిపాలిటీకి బదలాయిస్తారు.
- మున్సిపల్ పరిధిలోకి వచ్చే లీజు లేదా పురాతన భవనాలను మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేస్తారు.
- ఈ ప్రక్రియలో మిలిటరీ స్టేషన్లు ఉన్న ప్రాంతాలను బదిలీ చేయరు. అవి రక్షణ శాఖ పరిధిలోనే ఉంటాయి. ఎక్కడైతే భూములపై కేంద్ర ప్రభుత్వానికి టైటిల్ రైట్స్ ఉంటాయో.. ఆ ఆస్తుల హక్కులు కేంద్రం పరిధిలోనే ఉంటాయి.
- మున్సిపల్, మిలిటరీ ప్రాంతాల విభజన సమయంలో మిలిటరీ బలగాల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- విలీన ప్రక్రియకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సమాచారం ఇచ్చింది. కంటోన్మెంట్ బోర్డు విలీనం చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి వచ్చారు.
అసలేమిటీ కంటోన్మెంట్ బోర్డు?
హైదరాబాద్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతోంది.
ఎన్నో ఏళ్లుగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలన్న డిమాండ్ ఉంది.
మొత్తం సికింద్రాబాద్ కంటోన్మెంట్ 40.17 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, దాదాపు 10 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది.
1798లో హైదరాబాద్ నిజాం సికందర్ ఝా, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కంటోన్మెంట్ ఏర్పడింది.
హుస్సేన్ సాగర్ ఉత్తర దిక్కున ప్రాంతాన్ని కంటోన్మెంట్ కోసం కేటాయించారు.
సికందర్ ఝా చనిపోయాక ఈ ప్రాంతానికి సికింద్రాబాద్ పేరు పెట్టడంతో కంటోన్మెంట్ కాస్తా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌గా మారింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది.
మొదట బ్రిటిష్ సైన్యానికి వసతి కల్పించేందుకు కంటోన్మెంట్లను ఏర్పాటు చేశారు. ప్రజల నివాసాలు కూడా పెరగడంతో స్థానికంగా సంస్కరణల కోసం 1924లో కంటోన్మెంట్స్ చట్టం తీసుకువచ్చారు.
ఆ తర్వాత 2006లో అంతకుముందు ఉన్న కంటోన్మెంట్ చట్టం రద్దు చేసి, అభివృద్ధి కార్యకలాపాల కోసం మరో కంటోన్మెంట్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.
దేశంలో ఆరు ఆర్మీ కమాండ్లలో 62 కంటోన్మెంట్లు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 11 కంటోన్మెంట్ల బోర్డులను స్థానిక మున్సిపాలిటీలు లేదా ప్రభుత్వంలో విలీనం చేశారు.
జనాభా ఆధారంగా కంటోన్మెంట్లు కేటగిరి I, కేటగిరి II, కేటగిరి III, కేటగిరి IV గా విభజించింది కేంద్ర ప్రభుత్వం.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం కేటగిరి I లోకి వస్తుంది.
కంటోన్మెంట్‌లో స్థలాల విభజన ఇలా..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మిలిటరీ స్థావరాలు ఉండటంతోపాటు ప్రజల నివాసాలు, ఖాళీ స్థలాల ఆధారంగా వివిధ కేటగిరీలుగా స్థలాలను విభజించారు.
దాని ప్రకారం కేటగిరీల వారీగా ఎన్ని ఎకరాలు ఉన్నాయంటే..
ఎ-1 కేటగిరిలో 5,673 ఎకరాలు
ఎ-2 కేటగిరీలో 4 ఎకరాలు(ఇవి ఖాళీ స్థలాలు)
బీ-1 కేటగిరీలో 417 ఎకరాలు
బీ-2 కేటగిరీలోని 2728 ఎకరాలు(332 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి)
బీ-3 కేటగిరీలో 486 ఎకరాలు(పాత భవనాలు)
బీ-4 కేటగిరీలో 90 ఎకరాలు
సీ-కేటగిరీలోని 228 ఎకరాలు
ఇవికాకుండా మరో 236 ఎకరాల్లో 16 చిన్న చిన్న పాకెట్లుగా ప్రజలు నివాసం ఉంటున్నారు.
ఈ భూములపై అక్కడి ప్రజలకు హక్కులు లేవు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తే వీరికి శాశ్వత హక్కులు వచ్చేందుకు వీలుంటుందని కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి సంకి రవీందర్ బీబీసీతో అన్నారు.
ఎ-1, 2 కేటగిరీలోని భూములు ఆర్మీ వినియోగంలో ఉన్నాయి.
బీ-1 కేటగిరీలోని భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి.
బీ-2 కేటగిరీలోని భూములు రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రైవేటు స్థలాలు ఉన్నాయి.
బీ-4 కేటగిరీలోని భూములు రక్షణ శాఖ పరిధిలో ఉన్నాయి.
సీ-కేటగిరీలోని స్థలాల కంటోన్మెంట్ బోర్డుకు చెందినది.
బీ-3 కేటగిరీ భూములు రక్షణ శాఖ పరిధిలో ఉంటాయి.
బీ-2 కేటగిరీలోని భూములలో ప్రజలు నివాసం ఉంటున్నారు.
తిరుమలగిరి, మారేడుపల్లి, అమ్ముగూడ, హకీంపేట, కార్ఖానా, బోయినపల్లి, రసూల్ పురా, కౌకూర్, బొల్లారం వంటి కాలనీలు ఇందులో ఉన్నాయి.
కంటోన్మెంట్ పరిధిలో 2011 జనాభా లెక్కల ప్రకారం 2,17,910 మంది ప్రజలు నివాసం ఉండగా... ప్రస్తుతం దాదాపు 4 లక్షల మంది ఉన్నట్లు కంటోన్మెంట్ బోర్డు అంచనా.
ఆంక్షలు.. ఆటంకాలు..
కంటోన్మెంట్ పరిధిలో కొన్ని దశాబ్దాలుగా, ఇంకా చెప్పుకోవాలంటే బ్రిటిష్ కాలం నుంచి ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
ప్రజలు రాకపోకలు సాగించేందుకు నిర్మించిన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఆర్మీ స్థావరాల వైపు వెళ్లకుండా నిబంధనలు కఠినంగా పాటించేవారు. దీనివల్ల ఒక ప్రాంతం లేదా కాలనీ నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు రహదారులు మూసి ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కంటోన్మెంట్ వాసులు చెబుతున్నారు.
ప్రస్తుతం రహదారులపై ఆంక్షలు తొలగించినా, కంటోన్మెంట్ బోర్డు విలీనం తర్వాత సైనిక స్థావరాలు రక్షణ శాఖ పరిధిలో ఉండనున్నాయి.
దీనివల్ల రహదారులపై ఎలాంటి ఆంక్షలు అమలులో ఉంటాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనంతో తమ సమస్యలు తీరుతాయని భావిస్తున్నట్లు సంకి రవీందర్ చెప్పారు.
‘‘2006 కంటోన్మెంట్ చట్టం ప్రకారం కంటోన్మెంట్ అనేది డీమ్డ్ మున్సిపాలిటీ. కానీ మున్సిపాలిటీ తరహాలో ఇక్కడ అభివృద్ధి జరగడం లేదు. హైదరాబాద్ మహానగరంలో భాగంగా ఉన్నా, కంటోన్మెంట్ మాత్రం మౌలిక వసతులకు దూరంగా ఉంది.
ఒక చిన్న పని చేయాలంటే ఆర్మీ నుంచి అనుమతులు కావాలి, రక్షణ శాఖ నుంచి ఆమోదం కావాలి. అందుకే ఏళ్ల తరబడిగా ప్రభుత్వాలు ఇక్కడ వసతులు కల్పించడం లేదు.
స్టాంప్ డ్యూటీ విషయంలో జీహెచ్ఎంసీలో కట్టించుకుంటున్న 5.5శాతం రిజిస్ట్రేషన్ల శాఖకు వెళుతుంది. ౦.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు పోతాయి. మరో 1.5శాతం జీహెచ్ఎంసీకి వెళితే దానికి తగ్గట్టుగా వసతులు కల్పిస్తోంది.
కానీ, స్టాంప్ డ్యూటీలో 5 శాతం కంటోన్మెంట్ బోర్డుకు వెళుతున్నా.. సరిపడా వసతులు కల్పించడం లేదు. జీహెచ్ఎంసీలోకి రావడం వల్ల పన్నుల భారం పడుతుందనే వాదన సరికాదు’’ అని రవీందర్ అన్నారు.
ఇళ్ల ఎత్తు పెంచుకునేందుకు వీలు
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో 11 మీటర్ల కంటే ఎత్తులో భవనాల నిర్మాణానికి.. అంటే జీ+1 వరకే ఇళ్లు కట్టుకోవడానికి అనుమతి ఉంటుంది.
కంటోన్మెంట్ బోర్డు నుంచి బయటకు వస్తే జీ+4 వరకు నిర్మించేందుకు అనుమతి వస్తుందని వివరించారు రవీందర్.
అయితే, కంటోన్మెంట్ విలీనంపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ.
‘‘కంటోన్మెంట్ ప్రాంతంలో పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో మిగిలిన సిటీతో పోల్చితే ఇక్కడ ఒకటి లేదా రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయి.
కంటోన్మెంట్ విలీనం కారణంగా పచ్చదనం క్రమంగా తగ్గిపోతుందనే ఆందోళన ఉంది.
జనాభా పెరుగుదల ప్రభావం మిలిటరీ స్థావరాలపై పడుతుంది.’’ అని ఆయన అన్నారు.
ప్రస్తుతం కంటోన్మెంట్‌కు పాలకవర్గం లేకపోవడంతో నామినేటెడ్ మెంబర్ ఉన్నారు.
భూములపై వివాదం ఏమిటి..
భూముల బదలాయింపు విషయంలో వివాదం నడుస్తోంది.
కొన్ని భూములకు సంబంధించి టైటిల్ రైట్స్ ఇచ్చేందుకు రక్షణశాఖ అంగీకరించడం లేదు.
దీనివల్ల కంటోన్మెంట్ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్, ఎలివేటెడ్ కారిడార్లకు భూముల బదలాయింపు సమస్య తలెత్తే అవకాశం ఉందని సివిల్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు.
‘‘భూములు బదలాయిస్తామని రక్షణ శాఖ చెబుతోంది. జూన్ చివరి వారంలో వచ్చిన నిబంధనలలో టైటిల్ రైట్స్ రక్షణ శాఖ పరిధిలోనే ఉంటాయని చెబుతోంది. దీనివల్ల ఉపయోగం ఉండదు కదా..?
గతంలో జారీ చేసిన నిబంధనల ప్రకారం భూములు, ఆస్తులు...అన్నింటినీ బదలాయిస్తామని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం విక్రయించాలంటే చెరో 50 శాతం ఆదాయం తీసుకునేలా ఒప్పందం ఉంది.
ఇప్పుడు మాత్రం భూములు ఇస్తామని చెప్పి టైటిల్ రైట్స్ తమ వద్దనే ఉంచుకుంటామంటూ మెలిక పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం మున్సిపల్ శానిటరీ వర్క్స్ మాత్రమే బదలాయింపు ఉంటుంది.’’ అని సికింద్రాబాద్ కంటోన్మెంట్ సివిల్ సొసైటీ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్ర సురానా బీబీసీతో అన్నారు.
విలీనం ఎప్పటిలోగా పూర్తవుతుందంటే..?
జూన్ చివరి వారంలో జరిగిన సమావేశంలో రక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కంటోన్మెంట్ విలీనంపై చర్చ నడిచింది.
ఇందులో విలీన ప్రక్రియ స్పష్టంగా ఎప్పటికల్లా పూర్తవుతుందనే విషయంపై స్పష్టత రాలేదు.
కంటోన్మెంట్ బోర్డు నుంచి అందుతున్న సమాచారం బట్టి చూస్తే డిసెంబరుకల్లా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది.
ఈ ప్రక్రియ మరింత ఆలస్యం కావొచ్చనే వాదన కూడా వినిపిస్తోంది.
దీనిపై వివరణ తీసుకునేందుకు కంటోన్మెంట్ బోర్డు అధికారులను బీబీసీ సంప్రదించింది. కానీ వారు మాట్లాడేందుకు నిరాకరించారు.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)